Rs 75 Coin: త్వరలో విడుదల కానున్న రూ. 75 కాయిన్​ - ప్రత్యేకతేంటంటే?

26 May, 2023 19:15 IST|Sakshi

Rs 75 Special Coin: నూతన పార్లమెంట్ భవనం త్వరలో ప్రారంభం కానున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 75 కాయిన్ విడుదల చేయడానికి సంకల్పించింది. త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న రూ. 75 కాయిన్ ప్రత్యేకతలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ. 75 నాణెం సాధారణ కాయిన్స్ మాదిరిగా కాకుండా.. భిన్నంగా ఉంటుంది. ఈ నాణెం బరువు 35 గ్రాములు వరకు ఉంటుంది. దీనిని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలయికతో తయారు చేయనున్నారు. వ్యాసం 44 మిల్లీ మీటర్స్ వరకు ఉంటుంది.

ప్రత్యేకతలు
75 రూపాయల నాణెం చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఇందులో ఆశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం, దాని కింద 'సత్యమేవ జయతే' అనే వాక్యం ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అనే పదం, కుడివైపున ఇంగ్లిష్‌లో ఇండియా అనే పదం ఉంటుంది. దీనికి మధ్య భాగంలో దాని విలువను తెలియజేయడానికి 75 అనే సంఖ్య, కాయిన్​ ఎగువ అంచుపై 'సంసద్​ సంకుల్​' అని దేవనగరి స్క్రిప్ట్​లో, దిగువ అంచున 'పార్లమెంట్​ కాంప్లెక్స్​' ఉండనున్నాయి.

ప్రస్తుతం 1, 2,5,10 రూపాయల నాణేలు అందుబాటులో ఉన్నాయి. అయితే 10 నాణెం వాడకం బాగా తగ్గింది. ఇక త్వరలో కాయిన్స్ జాబితాలోకి రూ. 75 నాణెం కూడా చేరనుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 100 నాణెం కూడా గతంలోనే వెల్లడించారు. ఇది మన్‌కీ బాత్‌ 100 ఏపీసోడ్‌ సందర్భంగా విడుదల చేశారు. అయితే ఇది సాధారణ కాయిన్ మాదిరిగా వాడుకునే అవకాశం లేదు. ఇప్పుడు త్వరలో విడుదలకానున్న రూ. 75 కాయిన్ కూడా సాధారణ ప్రజలు వాడుకోవడానికి అందుబాటులో వస్తుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు