Nifty: నాలుగో రోజూ లాభాలే

11 May, 2021 04:36 IST|Sakshi

సెన్సెక్స్‌ లాభం 296 పాయింట్లు 

119 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ 

పతనమైన ప్రతిసారి కొనుగోళ్ల మద్దతు

కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు

ముంబై: కరోనా సంబంధిత ప్రతికూలతలను విస్మరిస్తూ స్టాక్‌ మార్కెట్‌ నాలుగోరోజూ ముందడుగేసింది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూల సంకేతాలు అండగా నిలిచాయి. ఫలితంగా దేశీయ మార్కెట్‌ సోమవారం లాభాలను మూటగట్టుకుంది. అన్ని రంగాలకు షేర్లకు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 296 పాయింట్లు ఎగసి 49,502 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు ర్యాలీ చేసి 14,942 వద్ద నిలిచింది. కార్పొరేట్‌ కంపెనీల మార్చి క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను మెప్పిస్తున్నాయి.

కోవిడ్‌ వేళ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పకుండా ఆర్‌బీఐ తీసుకున్న చర్యలు ఇన్వెస్టర్లకు భరోసానిచ్చాయి. ప్రపంచ మార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలు అందా యి. ఇన్వెస్టర్లు చిన్న, మధ్య తరహా రంగాల షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లు రెండూ ఒక శాతం ర్యాలీ చేశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 49,412– 49,617 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 14,892 – 14,967 శ్రేణిలో ట్రేడైంది. గతవారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు సోమవారం రూ.584 కోట్ల విలువైన షేర్లను కొ న్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ.476 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.

4 రోజుల్లో రూ.6.4 లక్షల కోట్లు అప్‌...
మార్కెట్‌ వరుస ర్యాలీతో గడిచిన నాలుగు రోజుల్లో సెన్సెక్స్‌ 1,249 పాయింట్లు, నిఫ్టీ 446 పాయింట్లను ఆర్జించాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల సంపద కూడా పెరిగింది. నాలుగు రోజుల్లో ఏకంగా రూ.6.44 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేష¯Œ  రూ. 213 లక్షల కోట్లను తాకింది.

ఇంట్రాడేలో ట్రేడింగ్‌ జరిగిందిలా..,
ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న మన మార్కెట్‌ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 209 పాయింట్ల లాభంతో 49,496 వద్ద, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 14,928 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో బలహీనత కారణంగా సూచీలు ఆరంభ లాభాలన్ని కోల్పోయాయి. అయితే దేశీయ మార్కెట్‌లో నెలకొని ఉన్న సానుకూలతో సూచీలు వెంటనే రికవరీ అయ్యి తిరిగి ఆరంభ లాభాల్ని పొందగలిగాయి. మిడ్‌సెషన్‌లో మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనప్పటికీ.., యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభంతో మళ్లీ కొనుగోళ్లు జరిగాయి. ఇలా పతనమైన ప్రతిసారి కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆరంభ లాభాల్ని నిలుపుకోగలిగాయి.

మార్కెట్‌లో మరిన్ని సంగతులు
► కోవిడ్‌ ఔషధ తయారీకి అనుమతులు లభిం చడంతో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ షేరు మూడు శాతం లాభపడి రూ.5328 వద్ద ముగిసింది.
 
► మార్చి క్వార్టర్‌లో నికర లాభం 17 రెట్లు పెరగడంతో సీఎస్‌బీ బ్యాంక్‌ షేరు ఆరు శాతం ర్యాలీ చేసి రూ.272 వద్ద స్థిరపడింది.  

► 2020–21 క్యూ4లో రిలయన్స్‌ పవర్‌ టర్న్‌అరౌండ్‌ సాధించడంతో కంపెనీ షేరు రూ.6.65 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి ఫ్రీజ్‌ అయ్యింది.  

► ఆర్థిక ఫలితాల ప్రకటన తర్వాత లాభాల స్వీకరణ జరగడంతో అల్ట్రాటెక్‌ షేరు ఒక శాతం నష్టపోయి రూ.6403 వద్ద నిలిచింది.

మరిన్ని వార్తలు