2రోజుల నష్టాలకు బ్రేక్‌

28 Jul, 2020 09:35 IST|Sakshi

161 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌

2రోజుల నష్టాలకు బ్రేక్‌

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు

కదంతొక్కుతున్న ఐటీ, బ్యాంకింగ్‌ రంగ షేర్లు

రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పెడుతూ మంగళవారం దేశీయ స్టాక్‌మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 161 పాయింట్ల లాభంతో 38096 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల పెరిగి 11175 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాలకు చెందిన షేర్లకు సంపూర్ణ కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. అత్యధికంగా ఐటీ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు లాభపడుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.75శాతం పెరిగి 22,014 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు మన మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచాయి. సోమవారం అమెరికా సూచీలు 0.50 -1.50శాతం లాభంతో ముగిశాయి. టెక్నాలజీ షేర్ల ర్యాలీ ఇందుకు కారణమైంది. ఇక ప్రస్తుతం ఆసియాలో దాదాపు మార్కెట్లన్నీ లాభాలతో కదులుతున్నాయి.

కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో కుదేలైన భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు 3వ, 4వ త్రైమాసికాల్లో వీ-ఆకారపు రికవరి సాధిస్తుందని 15వ ఆర్థిక కమీషన్‌ ఛైర్మన్‌ ఎన్‌.కే.సింగ్‌ తెలిపారు. అయితే ఇదే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి ప్రతికూలంగా నమోదవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, నెస్లే ఇండియాతో సహా 132 కంపెనీలు నేడు తమ ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసిక పలితాను విడుదల చేయనున్నాయి. 

శ్రీరాం సిమెంట్స్‌, విప్రో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటర్స్‌, టెక్‌ మహీంద్రా షేర్లు 1.50శాతం నుంచి 5శాతం లాభాల్లో కదలాడుతున్నాయి. ఐటీసీ, ఏషియన్‌ పేయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, ఇన్ఫ్రాటెల్‌, సిప్లా షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి.

మరిన్ని వార్తలు