మళ్లీ బుల్‌ పరుగు..!

16 Feb, 2021 06:12 IST|Sakshi

52 వేల పైన ముగిసిన సెన్సెక్స్‌  

15,314 వద్ద నిఫ్టీ ముగింపు 

కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు 

రాణించిన బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లు

ఐటీ, మెటల్, ఫార్మా షేర్లకు నష్టాలు

ముంబై: జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు కలిసిరావడంతో స్టాక్‌ మార్కెట్‌ సోమవారం మళ్లీ రికార్డుల బాట పట్టింది. బ్యాంకింగ్, ఆర్థిక రంగాల షేర్లు రాణించడంతో సెన్సెక్స్, నిఫ్టీలు సరికొత్త శిఖరాలపైన ముగిశాయి. సెన్సెక్స్‌ 610 పాయింట్లు లాభపడి తొలిసారి 52 వేల శిఖరంపైన 52,154 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 151 పాయింట్లు ర్యాలీ చేసి 15,314 వద్ద నిలిచింది. మార్కెట్‌ రికార్డు ర్యాలీలోనూ ఐటీ, మెటల్, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ కొనుగోళ్ల పర్వం కొనసాగడంతో సెన్సెక్స్‌ 692 పాయింట్లు లాభపడి 52,236 వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు పెరిగి 15,340 వద్ద కొత్త జీవికాల గరిష్టాలను నమోదు చేశాయి. ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.1.22 లక్షల కోట్లను ఆర్జించగలిగారు. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపద భావించే బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీ మొత్తం మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.205.14 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ 7 పైసలు బలపడి 72.68 వద్ద స్థిరపడింది.  

ఏడు ట్రేడింగ్‌ సెషన్‌ల్లో 1154 పాయింట్లు...   
ఈ ఫిబ్రవరి 5న సెన్సెక్స్‌ సూచీ తొలిసారి 51000 స్థాయిని అందుకుంది. నాటి నుంచి కేవలం ఏడు ట్రేడింగ్‌ సెషన్లలోనే సూచీ 1154 పాయింట్లను ఆర్జించి సోమవారం 52,154 వద్ద ముగిసింది. ఇదే ఏడాది జనవరి 07న సెన్సెక్స్‌ 50000 స్థాయిని అధిగమించింది. కాగా 50వేల నుంచి 51 వేల స్థాయికి చేరుకునేందుకు 11 ట్రేడింగ్‌ సెషన్ల సమయం తీసుకుంది.  

మార్కెట్‌లో మరిన్ని సంగతులు...  
► ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్ల అనూహ్య ర్యాలీతో ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ మూడు శాతానికి పైగా లాభపడి జీవితకాల రికార్డు స్థాయి 37306 వద్ద ముగిసింది.  
► నిఫ్టీ–50 ఇండెక్స్‌లో మొత్తం ఏడు స్టాకులు ఏడాది గరిష్టాన్ని తాకగా.., అందులో ఐదు స్టాక్‌లు ఆర్థిక రంగానికి చెందినవి కావడం విశేషం.  
► యాక్సిస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు నాలుగు నుంచి ఆరు శాతం ర్యాలీ చేశాయి.  
► మెరుగైన క్యూ3 ఆర్థిక ఫలితాలను వెల్లడించడంతో అపోలో హాస్పిటల్‌ షేరు 12 శాతం లాభపడి ఏడాది గరిష్టానికి ఎగసింది.  
► ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో అమరరాజా బ్యాటరీస్‌ ఆరు శాతం పతనమై, రూ.928 వద్ద ముగిసింది.  

మార్కెట్‌ ఉత్సాహానికి కారణాలు...
► మెరుగైన ఆర్థిక గణాంకాలు...  
గత వారాంతంలో వెలువడిన డిసెంబర్‌ పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), జనవరి ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్‌ను మెప్పించాయి. పారిశ్రామికోత్పత్తి ఆశించిన స్థాయిలో నమోదుకాగా., రిటైల్‌ ద్రవ్యోల్బణమూ దిగివచ్చింది. అలాగే సోమవారం విడుదలైన జనవరి హోల్‌సేల్‌ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా ఆర్థికవేత్తల అంచనాలకు తగ్గట్లు 2.03 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఆర్‌బీఐ ఇక ఇప్పట్లో కీలక వడ్డీరేట్ల జోలికి వెళ్లకపోవచ్చనే అంచనాలు ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి.

► కలిసొచ్చిన అంతర్జాతీయ సంకేతాలు...  
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతుంది. యూఎస్‌ బాండ్‌ ఈల్డ్‌ గతేడాది మార్చి తర్వాత పెరిగింది. అమెరికా ఉద్దీపన ప్యాకేజీ ఆమోదానికి దాదాపు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఫలితంగా గత శుక్రవారం అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగిశాయి. ఒక సోమవారం జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ రెండు శాతం లాభపడి 1990 తర్వాత తొలిసారి 30వేల స్థాయిని తాకింది. సింగపూర్, థాయిలాండ్, దక్షిణ కొరియా దేశాలు అరశాతం నుంచి ఒకటిన్నర శాతం లాభంతో ముగిశాయి. యూరప్‌ మార్కెట్లు సైతం రెండుశాతం ఎగిశాయి.

► మెప్పించిన కార్పొరేట్‌ ఫలితాలు...
కార్పొరేట్‌ డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాల ప్రకటన అంకం ముగిసింది. ఆర్థిక పురోగతిపై ఆశలు, పండుగ సీజన్‌లో నెలకొన్న డిమాండ్‌ లాంటి అంశాలు కలిసిరావడంతో ఈ క్యూ3 లో కంపెనీలు రెండింతల వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఈ క్యూ3లో సుమారు 3087 కంపెనీల సరాసరి నికరలాభం 69 శాతం పెరిగినట్లు ఓ సర్వే తెలిపింది.

► కొనసాగుతున్న విదేశీ పెట్టుబడులు...
భారత మార్కెట్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) బుల్లిష్‌ వైఖరిని కలిగి ఉండటం కూడా సూచీల రికార్డు ర్యాలీకి కొంత తోడ్పడింది. దేశీయ మార్కెట్లో ఈ ఫిబ్రవరి 15 నాటికి ఎఫ్‌ఐఐలు రూ.20,700 కోట్ల ఈక్విటీ షేర్లను కొన్నారు. కేంద్ర బడ్జెట్‌ మెప్పించడం, వడ్డీరేట్లపై ఆర్‌బీఐ సులభతర వైఖరి, లాక్‌డౌన్‌ ఎత్తివేత తర్వాత ప్రపంచ దేశాల్లోకెల్లా భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా రికవరీ అవుతుండటం, దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుండటం తదితర కారణాలతో ఎఫ్‌ఐఐలు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు