నేడు మళ్లీ మార్కెట్ల దూకుడు?!

10 Nov, 2020 08:41 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 156 పాయింట్లు అప్

నిఫ్టీకి 12,501-12,541 వద్ద రెసిస్టెన్స్!

డోజోన్స్ దూకుడు- నాస్డాక్ పతనం

సానుకూలంగా ఆసియా మార్కెట్లు

పెట్టుబడుల బాటలోనే ఎఫ్‌పీఐలు

ముంబై: నేడు (10న) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి భారీ లాభాల(గ్యాపప్)తో ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 156 పాయింట్లు జంప్ చేసి 12,636 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ నవంబర్‌ ఫ్యూచర్స్‌ 12,480 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్-19కు అమెరికన్ ఫార్మా దిగ్గజం ఫైజర్ రూపొందిస్తున్న వ్యాక్సిన్ విజయవంతమైనట్లు వెలువడిన వార్తలతో సోమవారం డోజోన్స్ 3 శాతం జంప్ చేసింది. అయితే టెక్ దిగ్గజాలలో అమ్మకాలతో నాస్డాక్ 1.5 శాతం పతనమైంది. వ్యాక్సిన్ కారణంగా దేశీయంగానూ నేడు మార్కెట్లు మరోసారి హుషారుగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆరు రోజుల వరుస ర్యాలీ కారణంగా కొంతమేర లాభాల స్వీకరణకు అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆసియాలో అత్యధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి.

కొత్త రికార్డ్స్
సోమవారం వరుసగా ఆరో రోజు స్టాక్ బుల్ కదం తొక్కింది. దీంతో కేవలం 7 నెలల్లోనే దేశీ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను లిఖించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్ ఇంట్రాడేలో 752 పాయింట్లు దూసుకెళ్లి 42,645ను తాకింది. నిఫ్టీ సైతం 210 పాయింట్లు ఎగసి 12,474కు చేరింది. వెరసి సరికొత్త రికార్డులను సాధించాయి. ట్రేడింగ్ ముగిసేసరికి నిఫ్టీ 198 పాయింట్ల లాభంతో 12,461 వద్ద నిలిచింది. సెన్సెక్స్ 704 పాయింట్లు జంప్ చేసి 42,597 వద్ద స్థిరపడింది. వెరసి ముగింపులోనూ లైఫ్ టైమ్ ‘హై’లను సాధించాయి.

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 12,394 పాయింట్ల వద్ద, తదుపరి 12,327 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 12,501 పాయింట్ల వద్ద, ఆపై 12,541 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 27,204 పాయింట్ల వద్ద, తదుపరి 26,873 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 27,730 పాయింట్ల వద్ద, తదుపరి 27,925 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐల కొనుగోళ్లు
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,548 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 3,036 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 4,870 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  డీఐఐలు రూ. 2,939 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు