ప్రతికూల ఓపెనింగ్‌ నేడు?!

28 Oct, 2020 08:42 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు మైనస్‌

నిఫ్టీకి 11,951-12,013 వద్ద రెసిస్టెన్స్‌!

0.5 శాతం నీరసించిన యూఎస్‌ మార్కెట్లు

నష్టాలతో ట్రేడవుతున్న ఆసియా మార్కెట్లు

మంగళవారం ఎఫ్‌పీఐల పెట్టుబడులు

నేడు (28న) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే  అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు తక్కువగా 11,853 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,875 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఇటీవల తిరిగి కోవిడ్‌-19 కేసులు పెరుగుతుండటం, ఆర్థిక వృద్ధికి దన్నుగా ప్యాకేజీ ప్రకటించే అంశంపై కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. అయితే నాస్‌డాక్‌ ఇదే స్థాయిలో పుంజుకుంది. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు బలహీనంగా కదులుతున్నాయి. దేశీయంగా గురువారం ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో నేడు మార్కెట్లలో హెచ్చుతగ్గులు నమోదుకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మార్కెట్ల బౌన్స్‌బ్యాక్‌
తొలుత కొంతమేర ఆటుపోట్లను చవిచూసినప్పటికీ మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ అయ్యాయి. సెన్సెక్స్‌ 377 పాయింట్లు జంప్‌చేసి 40,522 వద్ద నిలవగా.. నిఫ్టీ 122 పాయింట్లు జమ చేసుకుని 11,889 వద్ద స్థిరపడింది. ప్రారంభంలో 39,978 వరకూ నీరసించిన సెన్సెక్స్‌ ఒక దశలో 40,556 వరకూ ఎగసింది. ఇక నిఫ్టీ 11,899- 11,723 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,775 పాయింట్ల వద్ద, తదుపరి 11,661 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,951 పాయింట్ల వద్ద, ఆపై 12,013 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 24,193 పాయింట్ల వద్ద, తదుపరి 23,616 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 25,078 పాయింట్ల వద్ద, తదుపరి 25,388 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ఎఫ్‌పీఐలు ఓకే..
నగదు విభాగంలో మంగళవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 3,515 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1,571 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 119.4 కోట్లు, డీఐఐలు రూ. 979 కోట్లు చొప్పున అమ్మకాలు చేపట్టిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు