StudentVisa అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్‌!

24 Feb, 2023 16:09 IST|Sakshi

న్యూఢిల్లీ: అమెరికాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే వార్త. కోర్సు ప్రారంభానికి కంటే ఒక సంవత్సరం ముందు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అకడమిక్ టర్మ్ ప్రారంభమయ్యే 365 రోజుల ముందే వీసా జారీ చేయనున్నామని అమెరికా బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రకటించింది. ఒకవైపు కోర్సులు మొదలు కావడం, మరోవైపు వీసా కేంద్రాలలో 300 రోజుల వరకు వేచి ఉండే సమయంతో ఇబ్బందులు పడుతున్న  భారతీయ విద్యార్థులకు ఈ ప్రకటన  భారీ ఊరటనిస్తుంది.

యుఎస్‌లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు ఇప్పుడు వీసా కోసం ఒక సంవత్సరం ముందుగానే దరఖాస్తు చేసుకోవచ్చు కానీ ముందుగానే వీసా పొందిన విద్యార్థులు కూడా వారి ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు USలోకి ప్రవేశించడానికి అనుమతించబడరు.

దీని ప్రకారం ‘ఎఫ్‌-1 లేదా ఎం’ స్టూడెంట్ వీసాలు ఇప్పుడు I-20 ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 365 రోజుల ముందుగానే జారీ కానున్నాయి.  ఫలితంగా విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ సమయం లభిస్తుందని అని బ్యూరో ఒక ట్వీట్‌లో పేర్కొంది. అమెరికా యూనివర్సిటీలో చేరబోయే విద్యార్థులు తమ వీసా ఇంటర్వ్యూలను 120 రోజుల ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే  ముందుగానే వీసా పొందినా కూడా  ప్రోగ్రామ్ ప్రారంభ తేదీకి 30 రోజుల కంటే ముందు అమెరికాలో  ప్రవేశించడానికి అనుమతి ఉండదని తెలిపింది. 

యుఎస్ ఎంబసీ, కాన్సులేట్‌లు ఈ సంవత్సరం భారతీయ విద్యార్థుల నుండి రికార్డు స్థాయిలో వీసాలు ఆశిస్తున్నామని ముంబైలోని యుఎస్ కాన్సులేట్ జనరల్‌లోని కాన్సులర్ చీఫ్ జాన్ బల్లార్డ్ తెలిపారు. వీసా అపాయింట్‌మెంట్‌ల బ్యాక్‌లాగ్‌ను తగ్గించేందుకు కూడా కసరత్తు చేస్తోంది.  వీసా దరఖాస్తుల ప్రక్రియ వేగవంతం చేసేలా సంబంధిత సిబ్బందిని పెంచాలని, మొదటిసారి దరఖాస్తు చేసుకున్న వారి కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహించాలని కూడా యోచిస్తోంది.

మరిన్ని వార్తలు