టాటా టెక్నాలజీస్‌ ఐపీవో

14 Dec, 2022 02:08 IST|Sakshi

టాటా మోటార్స్‌ ప్రణాళికలు

న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్‌లో పాక్షిక వాటాను విక్రయించే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ పేర్కొంది. ఇందుకు పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. సోమవారం(12న) సమావేశమైన ఐపీవో కమిటీ తాజా ప్రతిపాదనకు సూత్రప్రాయ అనుమతినిచ్చినట్లు తెలియజేసింది. అయితే మార్కెట్‌ పరిస్థితులు, అవసరమైన, సెబీ సహా నియంత్రణ సంస్థల అనుమతులు ఆధారంగా ఐపీవోను చేపట్టనున్నట్లు వివరించింది. టాటా టెక్నాలజీస్‌ గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ డిజిటల్‌ సర్వీసులందిస్తోంది. ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఇండస్ట్రియల్‌ హెవీ మెషీనరీ తదితర పరిశ్రమలకు సర్వీసులు సమకూర్చుతోంది.  

విదేశీ విస్తరణ
మార్చితో ముగిసిన గతేడాది(2021–22) 47.35 కోట్ల డాలర్ల(సుమారు రూ. 3,910 కోట్లు) ఆదాయం సాధించింది. ఎయిర్‌బస్‌కు వ్యూహాత్మక సరఫరాదారుగా నిలుస్తున్న కంపెనీ ఇటీవలే ఫ్రాన్స్‌లోని టోలౌజ్‌లో ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించింది. తద్వారా అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్‌ రంగాలకు ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్, డిజిటల్‌ సర్వీసులను అందించనుంది. సస్టెయినబుల్‌ మొబిలిటీ సొల్యూషన్స్‌ అభివృద్ధికి సహకరించేందుకు ఈ ఏడాది జూన్‌లో ఫాక్స్‌కాన్‌ ప్రారంభించిన ఎంఐహెచ్‌ కన్సార్షియంలో చేరింది. దీంతో పరిశ్రమలో సహకారానికి ప్రోత్సాహాన్నివ్వనుంది. హార్మనీ కన్సార్షియం మొబిలిటీ(ఎంఐహెచ్‌)లో సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, సర్వీసుల రంగాలకు చెందిన 2,300 సభ్య సంస్థలున్నాయి. 

మరిన్ని వార్తలు