పుణ్యక్షేత్రాలకు టూరిజం కళ..

13 May, 2022 13:28 IST|Sakshi

పర్యటనలపై 40 శాతం వరకూ పెరిగిన ఆసక్తి 

ట్రావెల్‌ పోర్టల్‌ ఇక్సిగో అధ్యయనంలో వెల్లడి  

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల్లో పర్యాటకం మళ్లీ పుంజుకుంటోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి వాటిని సందర్శించేందుకు ఆసక్తి కనపరుస్తున్న వారి సంఖ్య 35–40 శాతం మేర పెరిగింది. ఆన్‌లైన్‌ ట్రావెల్‌ పోర్టల్‌ ఇక్సిగో నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. తమ పోర్టల్, యాప్‌లలో ప్రయాణికులు చేసే ఎంక్వైరీల నెలలవారీ ధోరణులను విశ్లేషించి ఇక్సిగో దీన్ని రూపొందించింది. దీని ప్రకారం ఆధ్యాత్మిక ప్రాంతాలకు పర్యటనలపై ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో కట్రా (83 శాతం), తిరుపతి (73 శాతం), హరిద్వార్‌ (36 శాతం), రిషికేష్‌ (38 శాతం శాతం) రామేశ్వరం (34 శాతం) ఆగ్రా (29 శాతం), ప్రయాగ్‌రాజ్‌ (22 శాతం) వారణాసి (14 శాతం) మొదలైనవి ఉన్నాయి.

ఐఆర్‌సీటీసీ తాజాగా రామాయణ యాత్ర రైలు టూర్, బుద్ధిస్ట్‌ సర్క్యూట్‌ రైళ్లు, జ్యోతిర్లింగ దర్శన్‌ యాత్ర, ఢిల్లీ–కాట్రా మధ్య వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ మొదలైనవి నిర్వహిస్తుండటం కూడా ఆయా ప్రాంతాల్లో పర్యాటకుల సందడి పెరిగేందుకు దోహదపడుతోంది. అయితే సంఖ్యాపరంగా మాత్రం ఎంత మంది వెడుతున్నారన్నది మాత్రం సర్వేలో వెల్లడి కాలేదు. బూస్టర్‌ డోస్‌లు అందుబాటులోకి రావడం కూడా  పర్యాటకుల్లో.. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్లలో ప్రయాణాలపై ధీమా పెరిగేందుకు దోహదపడుతున్నట్లు ఇక్సిగో సహ వ్యవస్థాపకుడు, గ్రూప్‌ సీఈవో అలోక్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. 

కన్ఫర్మ్‌టికెట్‌లోనూ అదే ధోరణి.. 
టికెట్ల సెర్చి ఇంజిన్‌ కన్ఫర్మ్‌టికెట్‌ నిర్వహించిన అధ్యయనంలో కూడా దాదాపు ఇలాంటి ధోరణులే వెల్లడయ్యాయి. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే రైళ్ల కోసం తమ యాప్, వెబ్‌సైట్లలో ఎంక్వైరీలు 35–40 శాతం మేర పెరిగినట్లు సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో దినేష్‌ కుమార్‌ కొత్తా తెలిపారు. రామేశ్వరం విషయంలో ఎంక్వైరీలు 47 శాతం పెరిగాయి. కట్రా (వైష్ణోదేవి)కి సంబంధించి 36 శాతం, ప్రయాగ్‌రాజ్‌.. వారణాసికి చెరి 8 శాతం, హరిద్వార్‌ (30 శాతం), రిషికేష్‌ (29 శాతం), తిరుపతి (7 శాతం) మేర ఎంక్వైరీలు పెరిగినట్లు దినేష్‌ వివరించారు. ఆధ్యాత్మిక అనుభూతి కోసమే కాకుండా యోగా, ఆయుర్వేద స్పాలు మొదలైన వాటితో ప్రశాంతత, పునరుత్తేజం పొందేందుకు కూడా పర్యాటకులు పుణ్యక్షేత్రాల సందర్శనకు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు.   

చదవండి: భారతీయులు వీటి కోసం ఖర్చుకు వెనకాడలేదు!

మరిన్ని వార్తలు