ఎలక్ట్రిక్ వాహనాలు: హీరో మోటోకు భారీ ఊరట

1 Jul, 2022 16:05 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్స్‌కు భారీ ఊరట లభించింది. హీరో ట్రేడ్‌ మార్క్‌ వివాదంపై విజయం సాధించింది.  తన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి 'హీరో' ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించుకోవచ్చని  ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ కేసు తుది పరిశీలన చేసిన తర్వాత  ట్రైబ్యునల్‌ తన నిర్ణయాన్ని ప్రకటించిందని హీరో మోటోకార్ప్ పేర్కొంది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ వాదనలను ట్రైబ్యునల్ తోసిపుచ్చింది. ఈమేరకు హీరో గురువారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్‌ ద్వారా సమాచారమిచ్చింది.

ట్రేడ్‌ మార్క్ వినియోగానికి సంబంధించి భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, రిటైర్డ్ న్యాయమూర్తులు ఇందు మల్హోత్రా,  ఇందర్మీత్ కౌర్ నేతృత్వంలోని ట్రైబ్యునల్ అనుకూలంగా తీర్పునిచ్చిందని  హీరో మోటో  తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏథెర్‌  ఎనర్జీ వ్యాపారంపై హీరో మోటో కార్ప్  400 కోట్ల పెట్టుబడులు,  గత 10 ఏళ్లలో హీరో బ్రాండ్  గుడ్‌ విల్‌, రిపుటేషన్‌  బిల్డింగ్‌పై దాదాపు   రూ. 7వేల కోట్ల  వెచ్చించిన విషయాన్ని ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ ఉద్ఘాటించిందని కంపెనీ పేర్కొంది. అయితే హీరో ఎలక్ట్రిక్ ప్రమోషన్ కోసం నవీన్ ముంజాల్ గ్రూప్ రూ.65 కోట్లు పెట్టుబడి పెట్టిందట.

'హీరో' బ్రాండ్‌పై  తమకే ప్రత్యేక యాజమాన్య హక్కులు ఉన్నాయని పేర్కొంటూ హీరో మోటోకార్ప్ ఛైర్మన్ పవన్ ముంజాల్‌తో న్యాయ పోరాటం చేస్తున్నారు నవీన్‌ ముంజాల్‌. ఈ క్రమంలోనే హీరో బ్రాండ్‌ నేమ్‌తో హీరో మోటో కార్ప్‌ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ హీరో ఎలక్ట్రిక్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. నవీన్ ముంజాల్ నేతృత్వంలోని హీరో ఎలక్ట్రిక్ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన ధర్మాసనం తాజా తీర్పునిచ్చింది.  కాగా జూలైలో ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించాలనుక్ను హీరో మోటో కార్ప్‌ ఈ సంవత్సరం పండుగ సీజన్‌కు దీన్ని వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు