సుస్థిరమైన ఆవిష్కరణలు, ఉత్పత్తులు రావాలి

30 Oct, 2022 05:47 IST|Sakshi

25 ఏళ్లలో భారత్‌ శక్తికేంద్రంగా నిలుస్తుంది

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌

నిఫ్ట్, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్, ప్యాకింగ్, ఫుట్‌వేర్‌ డిజైనింగ్, ఐఐఎఫ్‌టీ విద్యార్థుల సమావేశంలో పాల్గొన్న మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: మన దేశంలోని అతి పెద్ద మార్కెట్‌ లక్ష్యంగా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరమైన ఉత్పత్తులు తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పిలుపునిచ్చారు. వివిధ రంగాల పరస్పర సహకారం, వినూత్న విధానాలతో వచ్చే 25 ఏళ్లలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశాల శక్తికేంద్రంగా నిలుస్తుందనే ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిఫ్ట్, ఎఫ్‌డీఐఐ, ఎన్‌ఐడి, ఐఐఎఫ్‌టి, ఐఐపి విద్యార్థుల సమావేశం శిల్పకళావేదికలో శనివారం జరిగింది.

ముఖ్యఅతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్‌ ‘డిజిటలైజేషన్, ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌: భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ సూచించిన పంచ సూత్రాల(పంచ పరిష్కారాలు) అమలుతో దేశం మరింత బలోపేతం అవుతోందన్నారు.     ఇప్పటికే భారత్‌ అభివృద్ధి చేసిన స్థిరమైన డిజైన్ల గురించి తెలుసుకొని, వాటిని ఈ తరానికి సౌకర్యంగా ఉండేలా మెరుగుపరచాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. మార్పును స్వీకరించి, కొనసాగించే వారధులుగా విద్యార్థులు ఉండాలని సీతారామన్‌ వ్యాఖ్యానించారు.   

ఆశాకిరణంగా భారత్‌ ఆర్థిక వ్యవస్థ : పీయూష్‌ గోయల్‌
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్‌ ఆర్థికవ్యవస్థ ఒక ఆశాకిరణంగా ఉందని కేంద్ర పరిశ్రమలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. ఉత్తమ డిజైన్లను రూపొందించి, ఖర్చు తగ్గించే అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. పేటెంట్ల కోసం ఆన్‌లైన్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటలైజేషన్‌ ద్వారా అవినీతిని రూపుమాపామని, మధ్యవర్తులను దూరం చేయగలిగామని, పోటీతత్వం పెంచగలిగామని తెలిపారు.

నూతన ఆవిష్కరణలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఐదు విద్యాసంస్థల విద్యార్థుల (పూర్వవిద్యార్థులుసహా) సమ్మేళనం తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోందని, రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రవాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్‌ సింగ్‌ ఠాకూర్, ఎఫ్‌డీడీఐ ఎండీ అరుణ్‌ కుమార్‌ సిన్హా, నిఫ్ట్‌ డైరెక్టర్‌ విజయ్‌ కుమార్‌ మంత్రి, ఎన్‌ఐడి ప్రొఫెసర్‌ శేఖర్‌ ముఖర్జీ, ఎఫ్‌డిఐఐ హైదరాబాద్‌ సెంటర్‌ ఇంచార్జ్‌ దీపక్‌ చౌదరి, ఐఐఎఫ్‌టి డీన్‌ డాక్టర్‌ సతీందర్‌ భాటియా, ఐఐపీ చైర్మన్‌ వాగీ దీక్షిత్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు