సప్లయి తగ్గింది.. డిమాండ్‌ పెరిగింది!

23 Apr, 2022 03:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో అందుబాటు గృహాల సరఫరా తగ్గినప్పటికీ.. డిమాండ్‌ మాత్రం పుంజుకుంది. దీంతో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఇన్వెంటరీ 21 శాతం క్షీణించాయి. 2020 జనవరి–మార్చి (క్యూ1)లో 2,34,600 అఫర్డబుల్‌ యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. ఈ ఏడాది క్యూ1 నాటికి 1,86,150 యూనిట్లకు తగ్గాయని అనరాక్‌ డేటా వెల్లడించింది.

► రెండేళ్ల కోవిడ్‌ కాలంలో అఫర్డబుల్‌ గృహాల సప్లయి తగ్గింది. కరోనా కంటే ముందు 2019 జనవరి–మార్చి (క్యూ1)లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 70,480 యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో అందుబాటు గృహాల వాటా 44 శాతంగా ఉంది. కరోనా మొదలైన ఏడాది 2020 క్యూలోని గృహాల సప్లయిలో అఫర్డబుల్‌ వాటా 38 శాతం, 2021 క్యూ1లో 30 శాతం, ఈ ఏడాది క్యూ1 నాటికి 25 శాతానికి తగ్గింది. సప్లయి తగ్గడం వల్ల డెవలపర్లు అమ్ముడుపోకుండా ఉన్న గృహాల (ఇన్వెంటరీ)ని విక్రయించడంపై దృష్టిసారించారని అనరాక్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు. దీంతో గత రెండేళ్లలో ఏడు నగరాల్లోని అఫర్డబుల్‌ హౌసింగ్‌ ఇన్వెంటరీ 21 శాతం, లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం తగ్గుముఖం పట్టాయి.

► ఈ ఏడాది తొలి త్రైమాసికం ముగింపు నాటికి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో 6,27,780 గృహాల ఇన్వెంటరీ ఉండగా.. ఇందులో 1,86,150 యూనిట్లు రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలే. అదే గతేడాది క్యూ1లో ఇవి 2,17,63, 2020 క్యూ1లో 2,34,600 యూనిట్లున్నాయి. 2021 క్యూ1లో అత్యధికంగా చెన్నైలో 52%, పుణేలో 33 శాతం, ముంబైలో 27% అఫర్డబుల్‌ హౌసింగ్‌ ఇన్వెంటరీ తగ్గాయి.

► ఇదే రెండేళ్ల కరోనా సమయంలో రూ.2.5 కోట్లకు పైగా ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఇన్వెంటరీ 5 శాతం మేర తగ్గింది. 2020 క్యూ1లో 41,750 యూనిట్ల ఇన్వెంటరీ ఉండగా.. గతేడాది క్యూ1 నాటికి 42,080కు, ఈ ఏడాది క్యూ1 నాటికి 39,810 యూనిట్లకు క్షీణించాయి. అత్యధికంగా ముంబైలో 16 శాతం, కోల్‌కతాలో 15 శాతం అల్ట్రా లగ్జరీ హౌసింగ్‌ ఇన్వెంటరీ తగ్గాయి.

మరిన్ని వార్తలు