Videocon CEO Arrest: వీడియో కాన్‌ సీఈవో వేణుగోపాల్‌ ధూత్‌ అరెస్ట్‌!

26 Dec, 2022 13:56 IST|Sakshi

ఐసీఐసీఐ రుణం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించే సమయంలో వీడియోకాన్ గ్రూప్‌కు ఇచ్చిన రూ. 3వేల కోట్లుకు పైగా రుణంలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లను సీబీఐ అరెస్ట్‌ చేసింది. వారిద్దరిని అరెస్ట్‌ చేసిన రెండు రోజుల తర్వాత ఇవాళ (సోమవారం) వేణుగోపాల్‌ ధూత్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

నేరపూరిత కుట్ర
ఈ సందర్భంగా నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీపక్ కొచ్చర్, సుప్రీం ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్న నూపవర్ రెన్యూవబుల్స్ (ఎన్‌ఆర్‌ఎల్) కంపెనీలతో పాటు కొచ‍్చర్‌ దంపతులతో పాటు, వేణుగోపాల్‌ ధూత్‌ను నిందితులుగా పేర్కొంది.  

రూ.40వేల కోట్లు రుణంలో ఇదొక భాగం
కేసులో అభియోగాల ప్రకారం.. 2010 - 2012 మధ్యకాలంలో వీడియోకాన్ గ్రూప్‌కు బ్యాంకు రుణం మంజూరు చేసిన నెలల తర్వాత, క్విడ్ ప్రోకోలో భాగంగా వేణుగోపాల్ ధూత్ న్యూపవర్ రెన్యూవబుల్స్‌లో రూ. 64 కోట్లు పెట్టుబడి పెట్టాడు. అంతేకాదు చందా కొచ్చర్‌ తన పదవిని దుర్వినియోగం చేసి వీడియోకాన్‌కు రూ.300 కోట్లు మంజూరు చేసినందుకు ధూత్ నుండి తన భర్త దీపక్‌ కొచ్చర్‌కు లబ్ధి చేకూరేలా వ్యవహరించినట్లు సీబీఐ పేర్కొంది. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 20 బ్యాంకుల కన్సార్టియం నుండి వీడియోకాన్ పొందిన రూ. 40వేల కోట్ల రుణంలో ఇది భాగం .

పదవి నుంచి వైదొలగి
కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్,ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీ వీడియోకాన్ గ్రూప్‌కు అనుకూలంగా ఉన్నారనే ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా చందా కొచర్‌ 2018 అక్టోబర్‌లో కీలక బాధ్యతల నుంచి వైదొలిగారు.

 నేను ఎలాంటి తప్పు చేయలేదు
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, ఆర్‌బీఐ మార్గదర్శకాలు,బ్యాంక్ క్రెడిట్ పాలసీని ఉల్లంఘించి వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు ఐసీఐసీ బ్యాంక్‌ రూ. 3,250 కోట్ల మేరకు రుణాలు మంజూరు  చేసినట్లు సీబీఐ ఆరోపించింది. చందా కొచ్చర్‌ మాత్రం రుణాల విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని కొట్టిపారేశారు.

చదవండి👉 పద్మభూషణ్ నుంచి.. కటకటాల్లోకి, ‘ఎంత పనిచేశావయ్యా అరవింద్‌’

మరిన్ని వార్తలు