వర్క్‌ ఫ్రమ్‌ హోం: ఆ కంపెనీ ఉద్యోగులకు భారీ ఊరట

13 Aug, 2021 09:32 IST|Sakshi

Facebook Employees Return To Office: కరోనా-లాక్‌డౌన్‌ మొదలైన వర్క్‌ ఫ్రమ్‌ హోం ట్రెండ్‌.. ఇంకొన్నాళ్లు కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే టెక్‌ కంపెనీలు కొన్ని అక్టోబర్‌ మధ్య నుంచి ఆఫీసులకు రావాలని తేల్చిచెప్పడంతో పాటు షరతుల మీద కొందరు ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోంకి అనుమతి ఇస్తున్నాయి. ఈ తరుణంలో సోషల్‌ మీడియా దిగ్గజ కంపెనీ ఫేస్‌బుక్‌ తన ఉద్యోగులకు భారీ ఊరట ఇచ్చింది. ఇక వచ్చే ఏడాది నుంచే ఆఫీసులకు రావాలని తెలియజేసింది. 

డెల్టా ఫ్లస్‌ వేరియెంట్‌ ఉధృతి.. తగ్గినట్లే తగ్గి ఒక్కసారిగా విజృంభిస్తోంది. దాదాపు అన్ని దేశాల్లోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి.. వాళ్ల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేయడం ఇష్టం లేదని ఫేస్‌బుక్‌ భావిస్తోంది. ఈ మేరకు కాలిఫోర్నియా మెన్లో పార్క్‌ హెడ్‌ కార్యాలయం నుంచి ఉద్యోగులకు మెయిల్‌ వెళ్లింది. అందులో ‘ఇప్పట్లో ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని. బహుశా జనవరి నుంచి ఆఫీసులకు రావాల్సి ఉండొచ్చ’ని సంకేతాలు ఇచ్చింది. 

చదవండి: జీతాల కట్టింగ్‌కు రెడీ, కానీ..-ఉద్యోగులు

ఇక గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, యాపిల్‌లు వ్యాక్సినేషన్‌ పూర్తైన ఉద్యోగులను ఆఫీసులకు రావాల్సిందేనని ఇదివరకు చెప్పాయి. అంతేకాదు మాస్క్‌లు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌, శానిటైజేషన్‌ లాంటి ఏర్పాట్లతో ఆరోగ్య భద్రతకు తమది హామీ అని ప్రకటించాయి. కానీ, వేవ్‌ల వారీగా పెరుగుతున్న కరోనా కేసులు, ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళన, విమర్శలు, పైగా ఇంటి నుంచే ఎక్కువ అవుట్‌పుట్‌​ వస్తుండడంతో రిమోట్‌ వర్క్‌ విషయంలో ఉద్యోగుల పట్ల సానుకూల స్పందన ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్‌ కూడా జనవరి నుంచే రావాలని ఊరట ఇవ్వగా.. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి ఫేస్‌బుక్‌ కూడా చేరింది. మరోవైపు గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌లు మాత్రం అక్టోబర్‌ మధ్య నుంచే ఉద్యోగులను రప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు