విద్యార్థుల కోసం జూమ్ సరికొత్త ఫీచర్!

12 Aug, 2021 19:54 IST|Sakshi

Zoom Focus Mode Feature: కరోనా మహమ్మరి కారణంగా ఆన్‌లైన్‌ వినియోగం రోజు రోజుకి భారీగా పెరిగిపోతుంది. ప్రస్తుతం పరిస్థితులలో వీడియో కాలింగ్ యాప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. విద్యార్థుల పాఠ్యాంశాల నుంచి ఉద్యోగుల బోర్డు సమావేశాల వరకు అన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. దీంతో జూమ్‌, గూగుల్‌ మీట్ వంటి వీడియో కాలింగ్ యాప్‌లు వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వినియోగదారుల కోసం ఈ యాప్‌లు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తున్నాయి. తాజాగా జూమ్‌ యాప్ విద్యార్థులకు కోసం మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది.

ఫోకస్‌ మోడ్’ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ వల్ల విద్యార్థులు శ్రద్ధగా ఆన్‌లైన్‌ క్లాసులు వినడమే కాకుండా తోటి విద్యార్థుల ఏకాగ్రతకు ఎటువంటి భంగం కలగకుండా సహాయపడనున్నట్లు జూమ్ పేర్కొంది. ఈ ఫీచర్ యాక్టివేట్ చేస్తే విద్యార్థి కేవలం టీచర్ / హోస్ట్ ని మాత్రమే చూడగలడు. ఆ విధ౦గా ఒక ఉపాధ్యాయుడు భోదించే సమయ౦లో తన అనుమతి లేకుండా విద్యార్థులు షేర్ చేసే వీడియోలు, స్క్రీన్‌ షేర్లను ఇది కనిపించకుండా చేస్తుంది. టీచర్స్ కూడా తమ విద్యార్థులు ఏం చేస్తున్నారని, ఎలాంటి అంశాలు షేర్ చేస్తున్నారనేది చూడవచ్చు. 

అలాగే, టీచర్/హోస్ట్ ఫోకస్ మోడ్‌ డిసేబుల్ చేస్తేనే విద్యార్థులు ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇది జూమ్ డెస్క్ టాప్ క్లయింట్లకు మాత్రమే లభ్యం అవుతున్నట్లు తెలుస్తుంది. కుటుంబ సమావేశాలు, చిన్న వ్యాపార సమావేశాలు, ఇతర సమావేశలకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫీచర్ కొద్ది మందికి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. త్వరలో అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు