బాలికపై అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు

31 Aug, 2022 05:28 IST|Sakshi

విజయవాడ లీగల్‌: బాలికను గర్భవతిని చేసిన కేసులో యువకుడి నేరం రుజువు కావడంతో 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి, అదనపు జిల్లా జడ్జి డాక్టర్‌ ఎస్‌.రజని మంగళవారం తీర్పు చెప్పారు. విజయవాడ మారుతీనగర్‌కు చెందిన పట్నాల మహేష్‌ (20) మాయమాటలు చెప్పి తన ఇంటి పక్కన నివసించే బాలికను లోబర్చుకున్నాడు. ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశాడు.

బాలిక ఆరోగ్యం మీద అనుమానం వచ్చిన ఆమె తల్లిదండ్రులు పరీక్షలు చేయించగా గర్భవతి అని తేలింది. బాలిక తల్లి మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు విచారణలో నిందితుడి నేరం రుజువుకావడంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. బాలికకు రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థను జడ్జి ఆదేశించారు.  

మరిన్ని వార్తలు