ఎవరితోనైనా లేచిపో లేదంటే.. వదిన అసభ్యంగా దూషించడంతో..

7 Jun, 2021 04:11 IST|Sakshi
శ్రీదేవి(ఫైల్‌)  

పెళ్లి చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని సూటిపోటి మాటలు

అన్నతో కాపురం చెయ్‌.. అంటూ దూషణ

అవమానం భరించలేక పురుగు మందు తాగిన బాధితురాలు  

ఆదిలాబాద్‌ జిల్లా హర్కపూర్‌లో ఘటన

సాక్షి, ఇంద్రవెల్లి(ఖానాపూర్‌): వదిన, మేనత్త వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో ఈ సంఘటన జరిగింది. ఎస్సై నందిగామ నాగ్‌నాథ్‌ కథనం ప్రకారం.. హర్కపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్‌ అరవింద్, శ్రీదేవి (21) అన్నా చెల్లెలు. వీరి తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి చెల్లి బాధ్యతలను అరవిందే చూసుకుంటున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా గొర్రెపల్లి గ్రామానికి చెందిన తన మేనత్త జాదవ్‌ సెవంతబాయి కూతురు మంజులను అరవింద్‌ పెళ్లి చేసుకున్నాడు. గ్రామంలో సరైన ఉపాధి లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను ఉపాధి కోసం 2018లో దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ పనిచేసుకుంటూ భార్యా బిడ్డలతోపాటు చెల్లి శ్రీదేవి బాగోగులు చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆమె డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. కాగా, భార్యా పిల్లలకు తోడుకోసం అరవింద్‌ తన మేనత్తను కూడా హర్కపూర్‌లో తన ఇంట్లో ఉండమని చెప్పాడు.

 
చెల్లి పెళ్లి విషయంలో గొడవ..  
ఇదిలా ఉండగా శ్రీదేవిని తమతోపాటు ఉంచుకుని పోషించడం అరవింద్‌ భార్య మంజుల, ఆమె తల్లి సెవంతబాయికి నచ్చేదికాదు. శ్రీదేవి పెళ్లి విషయంలో వారిద్దరూ దుబాయ్‌లో ఉన్న అరవింద్‌తో తరచూ ఫోన్‌లో గొడవ పడుతుండేవారు. ఆమె పెళ్లికి కట్నం ఇవ్వడంతోపాటు వివాహ ఖర్చులకు లక్షల రూపాయలు కావాల్సి వస్తుందని ఘర్షణ పడేవారు. ఈ క్రమంలో శ్రీదేవికి వేధింపులు ఎక్కువయ్యాయి. తాము పెళ్లి చేయలేమని, పెళ్లి చేస్తే తమకు ఖర్చు తప్ప లాభం లేదని, అందుకే ఎవరితోనైనా లేచిపోవాలని మానసికంగా శ్రీదేవిని హింసించేవారు. ఏడాదిగా వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేక బాధితురాలు విషయాన్ని తన అన్నకు చెప్పింది.  

జనవరిలో స్వగ్రామానికి అరవింద్‌..  
దుబాయ్‌లో కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడిన అరవింద్‌ ఈ ఏడాది జనవరిలో స్వగ్రామానికి వచ్చాడు. తన చెల్లిని వేధించిన విషయమై భార్య, మేనత్తతో గొడవ పడ్డాడు. దీంతో భార్య మంజుల, మేనత్త సెవంతబాయి అదే నెలలో తమ ఊరికి వెళ్లిపోయారు. అయినా తరచుగా శ్రీదేవికి ఫోన్‌ చేస్తూ ఆమె కారణంగానే తాము విడిపోయామని వేధించేవారు. శనివారం రాత్రి కూడా శ్రీదేవికి మంజుల ఫోన్‌ చేసింది.

‘నీ కారణంగా నేను పుట్టింటికి వచ్చాను. ఐదు నెలలైనా మీ అన్న నన్ను కాపురానికి తీసుకెళ్లడం లేదు. ఇక మీ అన్నతో నువ్వే సంసారం చేయ్‌’అని సూటిపోటి మాటలు అన్నది. మేనత్త కూడా తీవ్రంగా దూషించడంతో మనస్తాపం చెందిన శ్రీదేవి క్షణికావేశంలో ఇంట్లో ఉన్న పురుగు మందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది.  ఎస్సై నాగ్‌నాథ్‌ ఆదివారం గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అరవింద్‌ ఫిర్యాదు మేరకు మంజుల, సెవంతబాయిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.  

మరిన్ని వార్తలు