33 కేసులు.. 22 సార్లు జైలు.. 

23 Nov, 2020 04:50 IST|Sakshi

బీటెక్‌ దొంగ మళ్లీ అరెస్ట్‌ 

రాజకీయ నాయకులు, నిరుద్యోగులే లక్ష్యంగా మోసాలు 

ప్రభుత్వ పథకాల ఎరతో సొమ్ము వసూలు 

సాక్షి, తిరుపతి: రాజకీయ నాయకులు, నిరుద్యోగులే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాడు తోట బాలాజీనాయుడు మరోసారి పోలీసులకు చిక్కాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తికి ప్రధానమంత్రి గ్రామీణ యోజన కింద రూ.25 లక్షల రుణం ఇప్పిస్తామని చెప్పి రూ.2.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్‌ చేయించుకున్న కేసులో అతడిని ఆదివారం శ్రీకాళహస్తిలో పోలీసులు అరెస్టు చేశారు. వివిధ ప్రభుత్వ పథకాల పేరు చెప్పి ఇప్పటి వరకు 60 మంది ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టించిన ఇతగాడిపై ఏపీ, తెలంగాణల్లోని పలు పోలీస్‌ స్టేషన్లలో 33 కేసులు నమోదు కాగా 22 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడికి చెందిన బాలాజీనాయుడు కాకినాడలోని జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తిచేశాడు. 2003లో ఎన్‌టీపీసీలో జూనియర్‌ ఇంజినీర్‌గా చేరి రామగుండం, పాల్వంచ, విశాఖపట్నం ప్రాంతాల్లో పనిచేశాడు. విశాఖలో పనిచేస్తుండగా 2008లో అప్పటి తణుకు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు ఆనంద్‌ నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆ కేసుతో  ఉద్యోగం కోల్పోయి జైలుకెళ్లాడు. 

బుద్ధి మార్చుకోకుండా..
విశాఖ జైలు నుంచి బయటకు వచ్చిన బాలాజీనాయుడు వివిధ ప్రాంతాల ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యదర్శులకు ఫోన్లు చేసి ఎన్‌టీపీసీలో ఉద్యోగాలంటూ, వారి నియోజకవర్గం నుంచి యువతను సిఫార్సు చేయాలని ఎమ్మెల్యేలకు సూచించాడు. ఆ తరువాత డిపాజిట్‌ పేరుతో కొంత మొత్తం దండుకొని మోసం చేశాడు. విజయనగరం పోలీసులు 2009లో అరెస్టు చేసి జైలుకు పంపారు. నల్లగొండ జిల్లాలోనూ ఇదే తరహాలో మోసం చేయడంతో 2010లో యాదగిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆరోగ్యశ్రీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రాజకీయ నేతల నుంచి  రూ.1.5 లక్షలు వసూలు చేసి జైలుపాలయ్యాడు.

పలువురు ప్రజా ప్రతినిధులకు ఫోన్‌ చేసి రుణాలిప్పిస్తామంటూ వారి పీఏల ద్వారా ఒక్కో అభ్యర్థికి రూ.1,060 వంతున రూ.3.50 లక్షలు రాబట్టాడు. బీజేపీ నేత రాంజగదీష్‌ ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు 2013 ఫిబ్రవరిలో అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చాక అప్పటి ఎంపీలు వి.హనుమంతరావు, దేవేందర్‌గౌడ్, పాల్వాయి గోవర్ధన్‌లను బురిడీ కొట్టించాడు. 2015లో మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకు రూ.90 వేలు టోకరా వేసి మళ్లీ పోలీసులకు చిక్కాడు. విడుదలైన బాలాజీ పలు మోసాలు చేశాడు. అతడి మాటలు నమ్మి తెలంగాణ ఎమ్మెల్సీ ఆకుల లలిత రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయించారు. 2018లో సూర్యాపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్తకు ఫోన్‌చేసి రూ.30 వేలు ఇస్తే రూ.2 కోట్ల కేంద్ర నిధుల పెండింగ్‌ ఫైల్‌ క్లియర్‌ చేయిస్తానని చెప్పారు. దీనిపై సూర్యాపేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదవడంతో బాలాజీని అరెస్టు చేశారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు