ఏటీఎం మిషన్‌లో వేయాల్సిన నగదుతో జంప్‌!... దంపతులను బురిడీ కొట్టించినదొంగ!

12 Feb, 2022 08:56 IST|Sakshi

మాండ్య : మండ్య జిల్లా మద్దూరు పట్టణంలోని కెనరా బ్యాంకు ఏటీఎం కేంద్రానికి వచ్చిన దంపతులను ఓ ఘరానా మోసగాడు వంచించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... చెన్నపట్టణ తాలూకా కోలూరు గ్రామానికి చెందిన మహదేవయ్య, మమత దంపతులు ఈనెల 2న తన కుమారుడు ఉన్నత చదువుల కోసం బ్యాంకులో నగలు తాకట్టు పెట్టి రూ. 50 వేలు తీసుకుని మద్దూరులోని కెనరా బ్యాంక్‌ వద్దకు వచ్చాడు. అదే సమయంలో బ్యాంకులో వినియోగదారులు ఎక్కువగా ఉండటంతో ఏటీఎం మిషన్‌లో వేయాలని సూచించారు.

వారి వెనుకాలే ఓ వ్యక్తి ఏటీఎం సెక్యూరిటీ ఉద్యోగి తరహాలో వారి వద్దకు వచ్చాడు. నగదు ఏటీఎం మిషన్‌లో తమ ఖాతాలో డిపాజిట్‌ చేయాలని కోరారు. మోసగాడు వారిని చూపు మళ్లించి నగదు తన జేబులో పెట్టుకుని, ఖాతాలో వేసినట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. దీంతో దంపతులు కుమారుడికి ఫోన్‌ చేసి నగదు వేశామని చెప్పారు. తనకు ఇంకా నగదు పడలేదని చెప్పడంతో బ్యాంకు సిబ్బందితో విచారించారు. సర్వర్‌ సమస్య ఉంటుందని, వారం రోజుల్లో నగదు పడుతుందని చెప్పారు. వారం రోజులు గడచినా నగదు జమ కాకపోవడంతో అనుమానించిన సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని వార్తలు