‘కిలాడి కపుల్’.. ఫేక్‌ ప్రొఫైల్స్‌తో రూ.1.6 కోట్లకు టోకరా!

26 Sep, 2022 16:24 IST|Sakshi

లక్నో: మ్యారేజ్‌ బ్యూరోల్లో నకిలీ వివరాలతో మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. అలాంటి సంఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో వెలుగుచూసింది. నకిలీ మ్యాట్రిమోనియల్‌ ప్రోఫైల్స్‌ ద్వారా  ఓ కిలాడి జంట ఏకంగా 35 మందిని మోసం చేసింది. వారికి సుమారు రూ.1.6 కోట్లకు టోకరా వేశారు దంపతులు. నకిలీ మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్స్‌ ద్వారా  మోసాలకు పాల్పడుతున్న జంటను సైబర్‌ సెల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బిహార్‌కు చెందిన మహిళ, జార్ఖండ్‌కు చెందిన వ్యక్తి కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 35 మందిని మోసగించారు. వారి నుంచి సుమారు రూ.1,63,83,000లు దోచుకున్నారు. ‘వివాహం పేరుతో తన కూతురి వద్ద రూ.27 లక్షలు తీసుకున్నారని ఓ సైనికాధికారి మొరాదాబాద్‌ సివిల్‌ లైన్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సైబర్‌ సెల్‌ టీంతో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దర్యాప్తు చేపట్టిన టీం ఇద్దరిని అరెస్ట్‌ చేసింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టాం. గత ఏడాదిన్నరగా సుమారు 35 మందిని మోసగించినట్లు తేలింది. అందమైన ఫోటోలతో మ్యాట్రిమేనియల్‌ సైట్స్‌లో ఆకర్షించేలా ప్రోఫైల్స్‌ పెడతారు. ఎవరైనా వారి కాంటాక్ట్‌లోకి వస్తే వారిని మాటల్లో పెట్టి మచ్చిక చేసుకుంటారు. ఆ తర్వాత వివిధ కారణాలతో డబ్బులు అడుగుతారు. అరెస్ట్‌ చేసిన వారు జార్ఖండ్‌కు చెందిన బబ్లూ కుమార్‌, బిహార్‌కు చెందిన పూజా కూమారిగా గుర్తించాం. ఇరువురికి వివాహం జరిగింది ’ అని వివరాలు వెల్లడించారు డీఎస్‌పీ అనూప్‌ కుమార్‌.

ఇదీ చదవండి: Squid Game: ఒకేసారి 1415 మంది విద్యార్థుల ఆట.. వీరికి రికార్డులు కొత్తేం కాదు..

మరిన్ని వార్తలు