దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు..

28 Nov, 2021 12:34 IST|Sakshi

సాక్షి,మరిపెడ రూరల్‌(వరంగల్‌): తాయత్తులు, పూజలు చేస్తానని ఓ దేశ గురువు పేరుతో దొంగ బాబా గ్రామస్తులను భయపెట్టి రూ.80వేలు వసూలు చేశాడు. అతనిపై అనుమానం వచ్చి కొందరు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా దొంగ గురువుగా బయటపడింది. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం వీరారం గ్రామంలోకి ఈ నెల 25వ తేదీన దేశగురువు పేరుతో ఓ వ్యక్తి తన నలుగురు శిష్యువులతో కలిసి వచ్చాడు. (చదవండి: దొంగ స్వామి: నీ కొడుకుకు ప్రాణగండం.. తప్పిస్తా, అందుకు నువ్వు.. )

వసతి కోసం అక్కడి సర్పంచ్‌ను ఆశ్రయించగా పాఠశాలలో ఓ గదిని చూపించారు. తన శిష్యులతో కలిసి దేశ గురువు తన గుర్రంపై గ్రామంలో పర్యటిస్తున్న క్రమంలో ప్రజలు నీళ్లు అరబోయడంతో పాటు కొబ్బరికాయలు కొట్టారు. ఈ క్రమంలో వితంతువుని పిలిచి నీ కొడుకుకు ప్రాణగండం ఉందని అది పోవాలంటే తాయత్తు కట్టాలని అందుకు రూ. 7 వేలు, పెండ్లి కావడం లేదని మరొకరి ఇంట్లో రూ.5 వేలు, ఆరోగ్య సమస్య అని మరో ఇంట్లో రూ.10 వేలు చొప్పున ఒక్కరోజే రూ.80 వేలు కాజేశాడు. బయట ఊరినుంచి వీరారం వచ్చిన ఓ వ్యక్తి దేశ గురువు నిజస్వరూపం తెలుసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

బయటపడ్డ నిజస్వరూపం..
మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలానికి చెందిన బూడిగ జంగాలకు చెందిన యాకయ్యగా బాబాను గుర్తించారు. కొందరితో ముఠాగా ఏర్పడి  ఓ గుర్రాన్ని రోజుకు రూ. వెయ్యి కిరాయికి తీసుకొచ్చి దేశ గురువుగా యాకయ్య అవతారమెత్తాడు. పలు గ్రామాలు తిరుగుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరారం గ్రామ బాధితుల ఫిర్యాదు మేరకు యాకయ్య,  తన అనుచరులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. 

చదవండి: కన్నీటి గాథ: ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నా ఆ నాన్న అనాథే

మరిన్ని వార్తలు