పెళ్లైన నెలకే మెడ కోసి..

27 Sep, 2021 03:21 IST|Sakshi
కిరణ్‌కుమార్, సుధారాణి దంపతులు(ఫైల్‌) 

భార్య మెడకోసి చంపిన భర్త 

తానూ ఆత్మహత్యాయత్నం.. విషమంగా పరిస్థితి 

పెళ్లయిన నెల రోజులకే దారుణం

నిజాంపేట్‌(హైదరాబాద్‌)/కామారెడ్డి: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే సైకోగా మారాడు. పెళ్లి తర్వాత భార్యపై అనుమానం పెంచు కున్నాడు. మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. ఆపై తానూ మెడ, చేతులపై కోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీ స్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన సుధారాణి.. అదే జిల్లా శివయ్యపల్లి గ్రామానికి చెందిన ఎర్రోల కిరణ్‌కుమార్‌ ఏడెనిమిది నెలలుగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గత నెల 27న వివాహం చేసుకున్నారు.

ఎన్నో ఆశలతో అత్తారింటికి వస్తే భర్త అనుమానాలతో ఆమె ఆందోళనకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. బంధువులతో కలసి మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. కిరణ్‌కుమార్‌ సాప్ట్‌వేర్‌ ఉద్యోగి కావడంతో ప్రగతినగర్‌లోని శ్రీసాయిద్వారకా అపార్ట్‌మెంట్‌లో ఫ్లా ట్‌ తీసుకున్నారు. ఈ క్రమంలో శనివారం హై దరాబాద్‌ రావాలని కిరణ్‌ కుటుంబం నుంచి సుధారాణి తల్లిదండ్రులకు సమాచారం వెళ్లింది. 

రక్తం మడుగులో సుధారాణి... 
సుధారాణి తల్లిదండ్రులు శనివారం మధ్యా హ్నం 3:30 గంటల సమయంలో ప్రగతినగర్‌ కు వచ్చారు. కాలింగ్‌ బెల్‌ కొట్టినా, ఇద్దరికీ ఫోన్లు చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బెడ్‌రూమ్‌ తలుపు పగులగొట్టారు. సుధారాణి రక్తం మడుగులో చనిపోయి ఉండగా, కిరణ్‌కుమార్‌ కొన ఊపిరితో ఉన్నాడు. పోలీసులు వెంటనే కిరణ్‌ను ఆసుపత్రికి తరలించారు. కూరగాయలు కోసే కత్తితో సుధారాణి గొంతు, కాళ్లు, చేతులను కోశాడు.

అపార్ట్‌మెంట్‌లోకి 2 వారాల క్రితమే వచ్చారని, అప్పటి నుంచీ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడలేదని చుట్టుపక్కల వారు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో సుధారాణిని హత్యచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కిరణ్‌కుమార్‌ మెడ, చేతులపై కత్తితో కోసుకోవడంతో అధిక రక్తస్త్రావం అయ్యిం దని, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. అతను స్పృహలోకి వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశముందన్నారు.

బంధువుల ఆందోళన
భర్త, అత్తమామలే సుధారాణిని హతమార్చారని ఆగ్రహంతో ఆమె బంధువులు కామారెడ్డి శ్రీరాంనగర్‌ కాలనీలోని కిరణ్‌కుమార్‌ ఇంటిపై దాడిచేశారు. తమకు న్యాయం చేయాలంటూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగించారు.

మరిన్ని వార్తలు