మోస్ట్ వాంటెడ్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ ఫెడ్లర్ టోనీ అరెస్ట్‌

21 Jan, 2022 02:43 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న కారు, మొబైల్స్, డ్రగ్స్‌తో పాటు నిందితుడిని చూపుతున్న సీవీ ఆనంద్‌

ముంబైలో పట్టుకున్న పోలీసులు

10 గ్రాముల కొకైన్, కారు స్వాధీనం

అతడి నుంచి డ్రగ్స్‌ కొంటున్న వారిలో చిక్కిన ఏడుగురు

అంతా సంపన్నుల బిడ్డలే: కొత్వాల్‌ సీవీ ఆనంద్‌  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో అక్రమంగా నివసిస్తూ ఏడేళ్లుగా డ్రగ్స్‌ దందా సాగిస్తున్న నైజీరియా డ్రగ్‌ పెడ్లర్‌ చుకో ఒబెన్నా డేవిడ్‌ అలియాస్‌ టోనీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. వివిధ రాష్ట్రాల్లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న అతన్ని పట్టుకున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. టోనీ నుంచి ఓ కారు, సెల్‌ఫోన్‌తోపాటు 10 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. గురువారం ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి ఆయన డ్రగ్‌ పెడ్లర్‌ అరెస్ట్‌ వివరాలను విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... నైజీరియాకు చెందిన టోనీ 2013లో తాత్కాలిక వీసాపై ముంబై వచ్చాడు.

వీసాతోపాటు పాస్‌పోర్ట్‌ కాలపరిమితి ముగిసినా అంథేరీ ఈస్ట్‌లో అక్రమంగా నివసిస్తున్నాడు. తొలినాళ్లలో వస్త్ర వ్యాపారం చేయగా సులువుగా అధిక డబ్బు సంపాదనకు డ్రగ్స్‌ దందా మొదలెట్టాడు. సోషల్‌ మీడియా, నైజీరియా ఫోన్‌ నంబర్‌ ద్వారా వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ (వీఓఐపీ) కాల్స్‌తో అనుచరులను సంప్రదిస్తూ దందా సాగించేవాడు. అతనికి తెలంగాణ, ఏపీతోపాటు గోవా, ఢిల్లీల్లోనూ అనుచరులు ఉన్నారు. వారి సహకారంతో ఆయా ప్రాంతాలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నాడు. లావాదేవీలన్నీ బిట్‌ కాయిన్స్‌ రూపంలో జరుగుతుంటాయి. 

అనుచరులు చిక్కడంతో... 
హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరాకు ఇమ్రాన్‌ బాబూఖాన్‌ కీలకంగా వ్యవహరించాడు. అతనితోపాటు మరికొందరినీ ఈ నెల మొదటి వారంలో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో వారు టోనీ పేరు చెప్పడంతో ముంబైలో ఉన్న అతన్ని పట్టుకొనేందుకు సుమారు 10 రోజులు అక్కడే మకాం వేసింది. గత వారం టోనీ నాలుగైదుసార్లు ముంబై, పుణే మధ్య రాకపోకలు సాగించినట్లు సాంకేతిక ఆధారాలు, స్థానిక పోలీసుల సాయంతో టోనీని పట్టుకున్నారు. 

9 మంది వినియోగదారులకు చెక్‌... 
టోనీని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతని సెల్‌ఫోన్‌ను విశ్లేషించి 13 మంది డ్రగ్స్‌ వినియోగదారుల వివరాలను సేకరించారు. వారిలో నిరంజన్‌ కుమార్‌ జైన్, శాశ్వత్‌ జైన్, యోగానంద్‌ అగర్వాల్, బండి భార్గవ్, వెంకట్‌ చలసాని, తమ్మినేడి సాగర్‌లను పట్టుకున్నారు. వారంతా సంపన్నుల బిడ్డలే కావడం గమనార్హం. ఒక్కొక్కరి ఆస్తి రూ. 100 కోట్ల నుంచి రూ. 1,000 కోట్ల వరకు ఉంటుందని సీవీ ఆనంద్‌ వెల్లడించారు. టోనీకి నైజీరియాలో ఉంటున్న స్టార్‌ బోయ్‌ అనే వ్యక్తి ఓడల ద్వారా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని పూర్తి వివరాలు టోనీకి కూడా తెలియవని చెప్పారు.  

సహకరించిన ఆఫీస్‌ బాయ్స్‌ అరెస్టు... 
డ్రగ్స్‌ కొనుగోలు కోసం వెంకట్‌ చలసాని, నిరంజన్‌ జైన్‌ తమ కార్యాలయాల్లో ఆఫీస్‌ బాయ్స్‌గా పనిచేస్తున్న అల్గాని శ్రీకాంత్, గోడి సుబ్బారావుల ఫోన్లు వాడారు. అయితే ఈ విషయం తెలిసినా తమ ఫోన్లు ఇచ్చి సహకరించినందుకు ఆ ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. కాగా, డ్రగ్స్‌ వినియోగదారుల్లో సినీ ప్రముఖులు ఉన్నట్లు తేలినా ఈసారి వదిలేది లేదని సీవీ ఆనంద్‌ స్పష్టం చేశారు.  
చదవండి: తెలంగాణలో మరో భారీ నిధుల గోల్‌మాల్‌

మరిన్ని వార్తలు