పోలీసుల అదుపులో జనశక్తి నేత కూర రాజన్న!

2 Aug, 2022 04:29 IST|Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లాకు తరలింపు

మీడియాకు వెల్లడించిన అరుణోదయ గౌరవాధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క

సాక్షి, సిరిసిల్ల/బోధన్‌/హైదరాబాద్‌: సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి నేత కూర రాజన్న (80) అలియాస్‌ కేఆర్‌ను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు అరుణోదయ గౌరవాధ్యక్షురాలు, ప్రజా గాయని విమలక్క తెలిపారు. హైదరాబాద్‌ శివారులోని కౌకూరులో ఓ ఇంట్లో నుంచి బయటికి వస్తుండగా.. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారని సోమవారం ఆమె మీడియాకు వెల్లడించారు.

వయోభారంతో రాజన్న అనారోగ్యంతో ఉన్నారని విమలక్క ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలకు చెందిన ఏనుగు ప్రభాకర్‌రావు అలియాస్‌ వేణుగోపాల్‌రావు హత్యకేసులో కూర రాజన్న నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో గతంలో అరెస్టయిన రాజన్న, జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యారు. కానీ.. మళ్లీ కోర్టుకు హాజరు కాకపోవడంతో రాజన్నపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మళ్లీ జనశక్తి సాయుధ దళాలను నిర్మించేందుకు రాజన్న ఆయుధాలు సమకూర్చుకుంటున్నట్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులు కేసులు నమోదు చేశారు. సిరిసిల్ల కోర్టులో ప్రవేశపెడతారని భావిస్తున్నా... రాజన్న అరెస్ట్‌పై సిరిసిల్ల జిల్లా పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. కాగా... జిల్లాలోని వేములవాడకు చెందిన కూర రాజన్న నాలుగున్నర దశాబ్దాలుగా విప్లవోద్యమంలో ఉన్నారు. 

వైద్యుల పర్యవేక్షణలో విచారించాలి..
పోలీసులు అరెస్టుచేసిన సీపీఐఎం ఎల్‌ జనశక్తి నేత కూర రాజన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనను వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే విచారించాలని మానవహక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్‌ చేసింది. ఇతరుల సహాయం లేకుండా నడవ లేని, శ్వాస కూడా సరిగ్గా తీసుకోలేని స్థితిలో ఉన్నాడని వైద్యుల పర్యవేక్షణలో, రాజన్న ఏర్పాటు చేసుకున్న న్యాయవాది సమక్షంలో విచారించాలని సంస్థ అధ్యక్షులు జి.మాధవరావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ తిరుపతి ప్రభుత్వాన్ని కోరారు. 

మరిన్ని వార్తలు