Vizag: కబడ్డీ క్లాసులకు పిల్లలు.. మాయమాటలు చెప్పి కిడ్నాప్‌ చేసిన ఆటోడ్రైవర్‌.. ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా

18 May, 2023 04:35 IST|Sakshi

కోవెలకుంట్ల(నంద్యాల)/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర) : ఇద్దరు పిల్లలను ఆటోడ్రైవర్‌ కిడ్నాప్‌ చేసి తీసుకెళుతుండగా పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోవెలకుంట్ల సీఐ నారాయణరెడ్డి అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని నాగులకట్ట సమీపంలో నివాసముంటున్న షేక్‌ మహమ్మద్, షమీవున్‌ దంపతులకు షేక్‌ రిజ్వానా, షేక్‌ ఆసియా సంతానం. పెద్ద కుమార్తె స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి, చిన్న కుమార్తె ఇదే పట్టణంలోని గాంధీ సెంటర్‌ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు.

పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో పిల్లలు పట్టణంలోని సెయింట్‌ జోసఫ్స్‌ పాఠశాలలో కబడ్డీ నేర్చుకునేందుకు వెళుతున్నారు. కోవెలకుంట్లకు చెందిన ఇమాంఉసేన్‌ పిల్లలను ఆటోలో ఎక్కించుకుని రోజూ పాఠశాల వద్ద వదిలేవాడు. మంగళవారం ఉదయం పిల్లలను ఆటోలో పంపించి తల్లిదండ్రులు పనుల నిమిత్తం వెళ్లిపోయారు. అయితే అతను పిల్లలను స్కూల్‌ వద్ద దించకుండా మాయమాటలు చెప్పి ఆటోను నంద్యాల వైపు మళ్లించాడు. నంద్యాలలో దిగి పిల్లలతో సహా గుంటూరు రైలెక్కాడు. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పట్టణంలోని పలు ప్రాంతాల్లో గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు ఆటో డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా వైజాగ్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని చిన్నారులను రక్షించారు. కోవెలకుంట్ల ఎస్‌ఐ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందాలు అక్కడకు చేరుకోగా రైల్వేపోలీసులు పిల్లలను వారికి అప్పగించారు. ఆటో డ్రైవర్‌ చిన్నారులను ఎత్తుకెళ్లి విక్రయించేందుకు ఒడిగట్టినట్లు తెలుస్తోంది. చిన్నారుల కిడ్నాప్‌ మిస్టరీని పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు.

మరిన్ని వార్తలు