నకిలీ పత్రాలతో ఇల్లు విక్రయం

24 Aug, 2022 08:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థ యజమాని తల్లిదండ్రుల పేరుతో ఉన్న ఇంటిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలతో విక్రయించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ అధికారులు ప్రధాన సూత్రధారిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ అరెస్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెల్లాపూర్‌కు చెందిన విజయ్‌కుమార్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ నిర్వహిస్తున్నాడు. అతడి తల్లిదండ్రులకు నల్లకుంటలో ఇల్లు ఉంది. దానికి ప్రతి సంవత్సరం ఆస్తిపన్ను, ఇతర పన్నులు చెల్లిస్తున్నారు.

రెండేళ్ల క్రితం వరకు అక్కడే నివసించిన విజయ్‌ తల్లిదండ్రులు కోవిడ్‌ నేపథ్యంలో కుమారుడి వద్దకే వెళ్లిపోయారు. దీంతో ఈ ఇంటిపై కన్నేసిన నాగ నాయక్‌ అనే వ్యక్తి మరికొందరితో కలిసి ముఠా కట్టాడు. నకిలీ పత్రాలు సృష్టించి రూ.2 కోట్ల విలువైన ఆ ఇంటిని రూ.75 లక్షలకు అమ్మేశారు. ఇంటిని ఖరీదు చేసుకున్న వారు జీహెచ్‌ఎంసీలో మ్యూటేషన్‌ ప్రక్రియ సైతం పూర్తి చేసుకున్నారు. ఇవేమీ తెలియని విజయ్‌ ఈ ఏడాది ప్రాపర్టీ ట్యాక్స్‌ను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు ప్రయత్నించారు. దీనికోసం పీటిన్‌ ఎంటర్‌ చేయగా... ఆ ఇల్లు బత్తిని భాస్కర్‌గౌడ్, బత్తిని భువనేశ్వరీ పేర్లతో ఉన్నట్లు కనిపించింది. వెబ్‌సైట్‌లోనే లభించిన నెంబర్‌కు ఫోన్‌ చేయగా భాస్కర్‌ మాట్లాడారు. తమకు కొడవత్‌ నాగ నాయక్‌ అనే వ్యక్తి ఇంటిని విక్రయించాడంటూ అతడి నెంబర్‌ ఇచ్చారు.

అతడికి ఫోన్‌ చేయగా తన తండ్రి కొడావత్‌ సూక్య ద్వారా వచ్చిన ఆ ఆస్తిని భాస్కర్‌కు విక్రయించానని, 1978లో మీ తల్లి మాకు అమ్మిందంటూ చెప్పాడు. దీంతో బాధితుడు ఇదంతా అవాస్తవమని, మా తల్లి ఎవరికీ విక్రయించలేదని, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి క్రయ విక్రయాలు చేశారంటూ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న ఏసీపీ దామోదర్‌ రెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. అనేక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో నాగ నాయక్‌ సూత్రధారని, మరికొందరు సహకరించినట్లు గుర్తించారు. దీంతో అతడిని అరెస్టు చేసి నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. నాగ నాయక్‌పై వాడపల్లి పోలీసుస్టేషన్‌ ఓ డబుల్‌ మర్డర్‌ కేసు ఉందని, అందులో జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

(చదవండి:  హీటెక్కిన స్టేట్‌..!)

మరిన్ని వార్తలు