భార్యను వేధించొద్దన్నందుకు ఇనుప రాడ్‌తో దాడి

3 Sep, 2021 20:29 IST|Sakshi

లక్నో: ప్రభుత్వాలు మహిళలు, యువతుల పట్ల వేధింపుల నిరోధానికి ఎన్ని కఠిన చట్టాలు చేసిన కొందరు యువకులలో మార్పు రావండం లేదు. ప్రతిరోజు మహిళలు వేధింపులకు గురౌతున్న సంఘటనలు తరచుగా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా, ఇలాంటి సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మీరట్‌లోని లిసారి గేట్‌ ప్రాంతంలో బాధిత మహిళ, తన భర్తతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో లిసారి ప్రాంతానికి చెందిన యువకుడు సదరు వివాహితను ప్రతిరోజు అనుసరించేవాడు. అంతటితో ఆగకుండా తన ఫోన్‌ నంబర్‌ ఇవ్వాలని విసిగించేవాడు.

మొదట ఆ వివాహిత యువకుడిని పట్టించుకునేది కాదు. అయితే, క్రమక్రమంగా వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో నిన్న (గురువారం) బాధిత యువతి తన ఇంట్లో నుంచి పనిమీద బయటకు వెళ్లింది. అదును కోసం ఎదురుచూస్తున్న యువకుడు ఆమెను వెంబడించాడు. అంతటితో ఆగకుండా ఫోన్‌ నంబర్‌ ఇవ్వాల్సిందే అని అసభ్యపదజాలంతో దూశించాడు. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన సదరు వివాహిత.. ఇంటికి వెళ్లి తన భర్తకు జరిగిన విషయాన్ని తెలిపింది. కాగా, భర్తతో కలిసి యువకుడి  ఇంటికి వెళ్లి అతడిని గట్టిగా నిలదీశారు. అప్పటికే అతని ఇంట్లో మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు.

దీంతో అతను ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే స్నేహితులతో కలిసి అక్కడే ఉన్న ఇనుపరాడ్‌తో వివాహిత భర్తపై దాడిచేశాడు. అతను ఇంటి నుంచి బైటకు పరిగెత్తిన వెంబడించి మరీ గాయపర్చాడు. తీవ్రగాయాలపాలైన వివాహిత భర్త కిందపడిపోయాడు. కాగా, వివాహిత అరుపులు విన్న స్థానికులు పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకున్నారు.  ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు. గ్రామస్తులు వెంటనే బాధితుడిని  మీరట్‌లోని మెడికల్‌ కాలేజ్‌ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి భార్య నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మీరట్‌ పోలీసులు నిందితులను గాలించడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

చదవండి: రమ్య హత్య కేసు: ఏపీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు..

మరిన్ని వార్తలు