ఏసీబీ వలకు చిక్కిన మావల తహసీల్దార్‌ 

25 Sep, 2023 03:54 IST|Sakshi

పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణకు రూ.20 లక్షలు డిమాండ్‌ 

రూ. 2 లక్షలు ముట్టజెబుతుండగా ఆర్‌ఐతో పాటు పట్టివేత 

ఆదిలాబాద్‌ జిల్లాలో ఘటన 

ఆదిలాబాద్‌ రూరల్‌: ఆదిలాబాద్‌ జిల్లా మావల తహసీల్దార్‌ ఆరిఫా సుల్తానా, ఆర్‌ఐ హన్మంత్‌రావు ఆదివారం ఏసీబీ వలలో చిక్కుకున్నారు. మావల పట్టణ శివారులోని వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టా పాస్‌బుక్‌లో పేరు సవరణ కోసం రైతుల నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

నిజామాబాద్‌కు చెందిన నిర్మల్కర్‌ సుధాకర్‌తోపాటు ఆయన కుటుంబీకులకు సంబంధించి ఆదిలాబాద్‌ జిల్లా మావల శివారు సర్వే నంబర్‌ 181లో 14 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఒక్కొక్కరి పేరిట మూడున్నర ఎకరాలు ఉన్నాయి. వీరు యతేంద్రనాథ్‌ యాదవ్‌ను రిప్రజెంటర్‌గా ఉంచారు. పట్టా పాస్‌బుక్‌లలో పేర్లకు సంబంధించి మార్పుల కోసం 2023, ఏప్రిల్‌ 13న మావల తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.

తహసీల్దార్‌ ఆరీఫా సుల్తానాను కలిసి పనులు పూర్తి చేయాలని విన్నవించారు. ఈ క్రమంలో ఆర్‌ఐ హన్మంత్‌రావు వారిని రూ.20 లక్షలు డిమాండ్‌ చేశాడు. మొదట రూ.2 లక్షలు ఇవ్వాలని సూచించగా, యతేంద్రనాథ్‌ ఈ నెల 21న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో డబ్బులు ముట్టజెబుతుండగా ఏసీబీ అధికారులు తహసీల్దార్, ఆర్‌ఐలను పట్టుకున్నారు. వీరిని కరీంనగర్‌ ఏసీబీ కోర్టుకు రిమాండ్‌ కోసం తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు.  
 

మరిన్ని వార్తలు