Nursing Student: ఏం జరిగిందో.. ఏమో.. హాస్టల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య 

1 Aug, 2022 08:33 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న సుమతి (ఫైల్‌)

తిరువళ్లూరు(తమిళనాడు): ఓ నర్సింగ్‌ విద్యార్థిని హాస్టల్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరువేర్కాడు సమీపంలోని మాదిరవేడులో మహిళా నర్సింగ్‌ కళాశాల, దానికి అనుబంధంగా హాస్టల్‌ కూడా ఉంది. ఇక్కడ ఈరోడ్‌కు చెందిన సుమతి(19) నర్సింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. శనివారం మధ్యాహ్నం కళాశాల ముగిసిన తరువాత లంచ్‌ కోసం విద్యార్థులు హాస్టల్‌కు వచ్చారు. అయితే సుమతి డైనింగ్‌హాల్‌కు వెళ్లకుండా తన రూమ్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది.
చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్‌.. నమ్మించి నగ్న వీడియోలు తీసి..

తన గది నుంచి చాలా సమయం వరకు బయటకు రాకపోవడంతో సహచర విద్యార్థునులు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ సుమతి ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతుండడంతో తిరువేర్కాడు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం చెన్నై కీల్పాక్కం వైద్యశాలకు తరలించారు. కాగా సుమతి ఆత్మహత్య విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు ఈరోడ్‌ నుంచి నేరుగా హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. తమ బిడ్డ ఆత్మహత్యకు కళాశాల యాజమాన్యం వేధింపులే కారణమని ఆరోపిస్తూ రాస్తారోకోకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారితో చర్చించారు. మృతిపై అనుమానం ఉంటే తమకు ఫిర్యాదు చేయాలంటూ ఆందోళనను విరమింపజేశారు.

సీబీసీఐడీ విచారణ ప్రారంభం  
నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో తిరువేర్కాడు పోలీసులు కేసు నమోదు చేయగా,  సీబీసీఐడీ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆదివారం హాస్టల్‌ కళాశాల సిబ్బంది, సహచర విద్యార్థులను ప్రశ్నించారు. విచారణలో సుమతి ఓ యువకుడితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై తల్లిదండ్రులతో సుమతి గొడవపడినట్లు పోలీసులు నిర్ధారించారు. రెండుమూడు రోజుల్లో హాస్టల్‌ నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించిన క్రమంలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఇదిలా ఇండగా ఇటీవల కల్లకురిచ్చి, కీళచ్చేరి హాస్టల్‌లో ప్లస్‌–2 విద్యార్థినుల అనుమానాస్పద మృతి ఘటనలను మరువకముందే నర్సింగ్‌ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది.   

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు