కోడలుకు పట్టిన దెయ్యం వదలించేందుకు

27 Aug, 2020 08:52 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లిలో తన అనుమతి లేకుండా ఇంట్లోకి వచ్చిందని కోడలిపై మామ దాడి చేశాడు.ఈ నేపథ్యంలో ఇంట్లో భూతవైద్యుడితో మంత్రాలు చేస్తూ అడ్డంగా దొరికాడు. కోడలి ఫిర్యాదుతో అత్త, మామలతో పాటు భూత వైద్యుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లికి చెందిన యువకుడు చిరంజీవి, వేరే సామాజిక వర్గానికి చెందిన యువతి రజిత ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు.

పదేళ్ళ క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఆ జంటకు ఓ పాప పుట్టాక మనస్పర్థలు రావడంతో వేరుగా ఉంటున్నారు. దయ్యం పట్టడంతోనే కోడలు కేసు వేసి కుటుంబాన్ని ఇబ్బందులపాలు చేస్తుందని అత్తింటివారు భావిస్తూ ఆమెను ఇంట్లోకి రానివ్వడంలేదు‌. గత కొంతకాలంగా పుట్టింటి వద్దనే ఉంటున్న ఆ మహిళ, కూతురుతో కలిసి అత్తవారింటికి చేరుకొని ఆందోళనకు దిగింది. ఇంట్లోకి రాకుండా అత్తమామలు శంకరమ్మ, అమృతయ్య అడ్డుకున్నారు.

అప్పటికే కోడలుకు పట్టిన దెయ్యం పోవాలని భూతవైద్యుడితో ఇంటి లోపల ఓ తంతు నిర్వహిస్తున్నారు. కోడలు ఇంట్లోకి వస్తే అరిష్టం అని భావించిన మామ అమృతయ్య, కోడలు ఇంటిలోపల అడుగు పెట్టకుండా అడ్డుకుని ఆమెను నెట్టివేస్తు దాడికి దిగాడు. మామ నెట్టేస్తూ దాడికి పాల్పడ్డప్పటికీ ఆమె ప్రతిఘటిస్తూ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అప్పటికి ఇంట్లో గుండిగోపాల్ రావుపేట్ కు చెందిన భూతవైద్యుడు ఉండడంతో పోలీసులకు సమాచారం అందించింది.  వెంటనే ఎస్ఐ ప్రేమ్ కుమార్ అక్కడికి చేరుకొని భూత వైద్యుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. కోడలు ఫిర్యాదు తో అత్తమామలతో పాటు భూతవైద్యుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా