ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతు చేస్తూ విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి 

11 Feb, 2023 03:07 IST|Sakshi
ట్రాన్స్‌ఫార్మర్‌పైన  మృతి చెందిన కుంట రాజు  

అధికారుల నిర్లక్ష్యమేనంటూ కుటుంబసభ్యుల అందోళన

గజ్వేల్‌రూరల్‌: ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మతులు చేస్తుండగా, ఓ యువరైతు విద్యుత్‌ సరఫరా జరిగి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం సింగాటం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట రాజు(32)కు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పాడైంది.

దానికి మరమ్మతు చేయించి బిగించేందుకు రైతులు సబ్‌స్టేషన్‌ నుంచి ఎల్‌సీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌ఫార్మర్‌పైకి ఎక్కి రాజు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్‌ సరఫరా కావడంతో షాక్‌కు గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే రాజు మృతి చెందాడని ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేదిలేదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదఘటనపై విచారణ చేపట్టి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రాజును ట్రాన్స్‌ఫార్మర్‌ పైకి ఎవరు ఎక్కమన్నారు? ఎల్‌సీ తీసుకున్న తర్వాత మరమ్మతు పనులు పూర్తికాకముందే ఎలా విద్యుత్‌ సరఫరా చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు