పనిమనిషితో టాయిలెట్ నాకించిన బీజేపీ నేత అరెస్టు

31 Aug, 2022 10:55 IST|Sakshi

రాంచీ: బీజేపీ నుంచి సస్పెండ్‌ అయిన జార్ఖండ్ మహిళా నాయకురాలు సీమ పాత్రను రాంచీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గరిజన తెగకు చెందిన పనిమనిషిని చిత్రహింసలు పెట్టిందనే ఆరోపణలతో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరిచిన అనంతరం జైలుకు తరలిస్తామని అధికారులు చెప్పారు.

సీమపాత్ర ఇంట్లో పనిచేసే గిరిజన మహిళ సునీత ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది. రోజూ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పింది. తనతో టాయిలెట్‌ను నాకించడమే గాక.. వేడి వేడి వస్తువులతో వాతలుపెడుతూ సీమ పాత్ర వికృత చర్యలకు పాల్పడుతున్నారని సునీత వెల్లడించింది.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సీమ పాత్ర కోసం గాలింపు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఆమె పరారైంది. చివరకు పోలీసులు ఆమెను బుధవారం ఉదయం అరెస్టు చేశారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ సీమపాత్ర రోడ్డుపైనుంచి వెళ్తున్న సమయంలో చాకచక్యంగా పట్టుకున్నారు.

సునీత ఆరోపణల అనంతరం జాతీయ మహిళా కమిషన్ ఈ విషయంపై స్పందించింది. వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని జార్ఖండ్‌ డీజీపీకి లేఖ రాసింది. విచారణ పారదర్శకంగా చేపట్టాలని సూచించింది. మాజీ ఐఏఎస్ అధికారి మహేశ్వర్ పాత్ర సతీమణి అయి ఉండి సీమ పాత్ర ఇలాంటి దారుణాలకు పాల్పడటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
చదవండి: సీఎం స్టాలిన్‌ గొప్ప మనసు.. అంతు చిక్కని వ్యాధి సోకిన డానియాకు..

మరిన్ని వార్తలు