విషాదం: మరణంలో కూడా బెస్ట్‌ ఫ్రెండ్స్‌గానే మిగిలారు..

31 Mar, 2022 19:44 IST|Sakshi
బాలరాజు, విజయ్‌లు (ఫైల్‌)

పెదనందిపాడు(గుంటూరు జిల్లా): వారి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. పిల్లలను బాగా చదివించాలని తాము  పడిన కష్టం పిల్లలు పడకూడదని చదివిస్తున్నారు. స్నేహితులిద్దరు చిన్నప్పటి నుంచి ఒకే గ్రామం, ఒకే పాఠశాల కాకపోయినప్పటికీ  ఇంటర్మీడియట్‌ నుంచి ఒకే కళాశాలలో కలిసి చదువుకుంటున్నారు, ఖాళీ సమయాల్లో తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉంటూ తమ చదువులు కొనసాగిస్తున్నారు. వారి స్నేహాన్ని చూసి విధికి కన్నుకుట్టిందో ఏమో కాని ఒకరి తర్వాత మరొకరు ఈ లోకాలను, తల్లిదండ్రులను విడిచివెళ్లారు, వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చారు వారే పెదనందిపాడు మండల అబ్బినేనిగుంటపాలెం గ్రామానికి చెందిన కోండే పాటి విజయ్, కాకుమాను మండలం గార్లపాడు గ్రామానికి చెందిన బాలరాజులు.

చదవండి: హోటల్‌ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్‌ పీకలు

వీరివురు పెదనందిపాడులోని పెదనందిపాడు అర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ కళాశాలలో బీఎస్సీ (కంప్యూటర్స్‌) మూడవ సంవత్సరం చదువుతున్నారు. ఇంటర్మీడియట్‌ మొదటి పంవత్సరంలో ఏర్పడిన వీరి స్నేహం కడవరకు నిలిచింది. అందరి దృష్టిలో బెస్ట్‌ ప్రెండ్స్‌లా ఉన్నారు. మరణంలో కూడా బెస్ట్‌ ప్రెండ్స్‌గానే మిగిలారు. గార్లపాడు గ్రామానికి చెందిన బాలరాజు ఆదివారం ఇంట్లో ఫ్యాన్‌కు ఊరివేసుకుని చనిపోయాడు, ఈ విషయం తెలిసిన స్నేహితుడు విజయ్‌ అక్కడకు వెళ్లి బాలరాజు అంత్యక్రియలు అయిపోయేంత వర కు అక్కడే ఉన్నాడు. ఇంటికి వచ్చిన నాటి నుంచి స్నేహితుడితో ఉన్న అనుబంధాలను గుర్తుచేసుకుంటూ కుమిలిపోయాడు.  తన స్నేహితుడు లేని లోకంలో తాను ఉండలేనని, తానూ స్నేహితుడు వద్దకు వెళతానని తల్లిదండ్రులతో చెబుతూ బాధపడేవాడు.

దీనిపై తల్లిదండ్రులు సర్ది చెబుతూ ధైర్యం చెప్పే వారు.  అయితే మంగళవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు లేని సమయం చూసి గ్రామంలో వెలుపల ఉన్న చెరువు వద్దకు వెళ్లి చీరతో ఊరివేసుకుని తన స్నేహితుడు వద్దకు వెళ్లిపోయాడు. రెండు రోజుల వ్యవధిలో తమ తరగతి చెందిన ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో కళాశాల సిబ్బంది, విద్యార్థులు దుఃఖసాగరంలో మునిగారు. ఇన్నాళ్లు తమతో స్నేహంగా మెలిగిన ఇద్దరు మరణించడంతో కళాశాల చిన్నబోయింది. బుధవారం సాయంత్రం అబ్బినేనిగుంటపాలెం గ్రామంలో విజయ్‌ను కడసారి చూడటానికి వచ్చిన స్నేహితులు, బంధువులు, కళాశాల సిబ్బంది శోకసంద్రంలో  మునిగారు. తల్లిదండ్రులు, తోబుట్టువులు వేదన వర్ణనాతీతంగా మారింది. స్నేహితులు, బంధువులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య కడసారి వీడ్కోలు పలికారు.   

మరిన్ని వార్తలు