ఇష్టపూర్వకంగా కలిసి బతికి.. ఇప్పుడు రేప్‌ కేసులు పెడతామంటే కుదరదు!

15 Jul, 2022 19:08 IST|Sakshi

న్యూఢిల్లీ: తమంతట తాముగా ఇష్టపూర్వక సహజీవనం చేసి.. అవి బెడిసి కొట్టడం, విభేధాల కారణంగా అత్యాచారం ఫిర్యాదులు చేయడం సరికాదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఓ కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ.. ద్విసభ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఈ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి.. తనంతట తానే ఇష్టపూర్వకంగా అవతలి వ్యక్తితో సహజీవనం చేసింది. పైగా 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె అతనితో బంధంలోకి అడుగు పెట్టింది. నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు లైంగికంగా లోబర్చుకున్నాడని, దాడికి పాల్పడ్డాడని చెబుతోంది. ఇష్టపూర్వకంగానే ఆమె అతనితో బంధం కొనసాగించినట్లు ఒప్పుకుంది. కాబట్టి.. అత్యాచారం కింద ఐపీసీ 376(2)(n) ప్రకారం అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి కారణం కాదు అని జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. 

దేశంలో ఇలాంటి కేసులు చాలానే న్యాయస్థానాల ముందుకు వస్తున్నాయి. పూర్తి ఇష్టంతోనే పరస్పర అంగీకారంతోనే వాళ్లు కలిసి ఉంటున్నారు. వివాహంతో సంబంధం లేకుండా పిల్లల్ని కంటున్నారు. తీరా గొడవలు జరిగితే చాలూ.. ఇలా అత్యాచారం, లైంగిక దాడులంటూ న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం. సరైన పద్ధతి కాదు అంటూ బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఈ మేరకు రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తోసిపుచ్చుతూ.. నిందితుడికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే.. బెయిల్‌ మంజూరు అయినప్పటికీ దర్యాప్తు మాత్రం యథాతథంగా కొనసాగాలని సుప్రీం బెంచ్, రాజస్థాన్‌ పోలీసులకు సూచించింది.

మరిన్ని వార్తలు