కోతుల భయం.. తీసింది ప్రాణం

2 Dec, 2020 04:08 IST|Sakshi
దోమల శ్రీలత (ఫైల్‌), తల్లిని కోల్పోయిన శిశువు

కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి బాలింత మృతి

సూర్యాపేట జిల్లాలో ఘటన

మద్దిరాల: కోతుల దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కిందపడి బాలింత దుర్మరణం పాలైంది. ఈ హృదయ విదారక ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం కుక్కడం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ సాయి ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలతకు అర్వపల్లి మండలం అడివెంలకు చెందిన జేసీబీ డ్రైవర్‌ దోమల సైదులుతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇప్పటికే నాలుగేళ్ల కొడుకు బిట్టు, రెండున్నరేళ్ల కుమార్తె మాన్యశ్రీ ఉన్నారు. మూడో కాన్పు కోసం శ్రీలత (24) మూడు నెలల క్రితం పుట్టింటికి వచ్చింది. నెల క్రితం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం తల్లిగారింటి ముందు రేకుల షెడ్‌ కింద ఊయలలో చిన్నారి పడుకొని ఉన్నాడు.

ఆ సమయంలో శ్రీలత బట్టలు ఉతికి ఆరేస్తుండగా ఒక్కసారిగా కోతుల గుంపు దాడిచేసింది. కోతుల బారి నుంచి తప్పించుకుని బాబును తీసుకుని ఇంట్లోకి వెళ్లాలనుకున్న శ్రీలత.. కోతుల గుంపు మరింత ముందుకు ఉరకడంతో భయంతో బాబును అక్కడే ఉంచి ఇంట్లోకి పరుగుతీసింది. ఈ క్రమంలో గడప తగిలి కిందపడగా, అటుపక్కనే ఉన్న మంచంకోడు తలకు బలంగా తగిలింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతురాలి భర్త సైదులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత్‌ తెలిపారు. ప్రభుత్వం స్పందించి కోతుల బారి నుంచి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా