విషవాయువులు పీల్చి.. ‘ఐ క్విట్‌’ అని రాసి ఆత్మహత్య 

22 Jul, 2021 04:28 IST|Sakshi
సమ్రిత్‌ ఆత్మహత్య చేసుకున్న భవనం

కోల్‌కతాలో బలవన్మరణానికి పాల్పడ్డ హైదరాబాద్‌వాసి 

కుటుంబీకులు, ఆప్తుల మరణాలతో కుంగిపోయిన వైనం 

విషవాయువులు పీల్చి తనువు చాలించిన సమ్రిత్‌ 

మృతదేహాన్ని సిటీకి తీసుకువస్తున్న స్నేహితుడు 

సాక్షి, హైదరాబాద్‌: 2016 మార్చిలో తండ్రి, అక్టోబర్‌లో సోదరుడు, నవంబర్‌లో తల్లి, డిసెంబర్‌లో నానమ్మ, ఇటీవలే సోదరిగా భావించే ఆప్తురాలు చనిపోవడం... ఇలా తనకంటూ జీవితంలో ఎవరూ మిగలకపోవడానికి కారణం తానో దురదృష్టవంతుడినని భావించిన హైదరాబాద్‌ యువకుడు కోల్‌కతాలో తనువు చాలించాడు. తలకు ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని, విషవాయువులు పీల్చి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికంటూ ఎవరూ లేకపోవడంతో హైదరాబాద్‌ నుంచి వెళ్లిన ప్రాణ స్నేహితుడు మృతదేహాన్ని తీసుకువస్తున్నాడు. అంబర్‌పేట ప్రాంతానికి చెందిన పి.సమ్రిత్‌ (25) ప్రస్తుతం కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌లో టెక్నికల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2016లో తన కుటుంబీకులు చనిపోయిన తర్వాత తీవ్రంగా కుంగిపోయిన ఇతడికి స్నేహితుడి భార్య ధైర్యం చెప్పింది. ఆమెను సోదరిగా భావిస్తూ ప్రతి విషయం పంచుకునేవాడు. అనారోగ్య కారణాలతో ఆమె కూడా ఇటీవలే కన్నుమూయడంతో సమ్రిత్‌ తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. 

తానో దురదృష్టవంతుడనని, తనకున్న ఈవిల్‌ పవర్స్‌ వల్లే కుటుంబీకులందరినీ కోల్పోయానని భావించాడు. ఇదే విషయాన్ని ఫ్లాట్‌లో ఉండే సహోద్యోగులతో చెప్తుండేవాడు. ఇటీవల సమ్రిత్‌ మరింత నిస్పృహకు లోనయ్యాడు. సోమవారం ఉదయం సహోద్యోగులతో కలసి విధులకు బయలుదేరాడు. అంతలోనే మనసు మార్చుకుని తాను ఫ్లాట్‌లోనే ఉంటానని చెప్పాడు. సమ్రిత్‌ మానసిక స్థితి తెలిసిన ఆ సహోద్యోగులు ఆఫీస్‌కు వెళ్లిన తర్వాత ఫోన్‌ చేశారు. అయితే సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి తిరిగి ఫ్లాట్‌కు వచ్చారు.   

సూసైడ్‌ నోట్‌ స్వాధీనం... 
తమ వద్ద ఉన్న తాళంతో తలుపు తెరిచి లోపలకు వెళ్లి చూడగా... ముఖానికి ప్లాస్టిక్‌ కవర్‌ చుట్టుకుని, పక్కన ఓ సిలిండర్‌ పెట్టుకుని, దాని పైపు ప్లాస్టిక్‌ కవర్‌లో ఉంచిన స్థితిలో కనిపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న సమ్రిత్‌ను పోలీసుల సాయంతో బిద్ధన్‌నగర్‌ సబ్‌–డివిజినల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సమ్రిత్‌ ఫ్లాట్‌లో సోదాలు చేసిన పోలీసులు రెండు పేజీల సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో తన పరిస్థితుల్ని వివరించిన సమ్రిత్‌ ‘ఐ క్విట్‌’ అంటూ ముగించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం హైదరాబాద్‌ నుంచి వెళ్లిన అతడి స్నేహితుడికి అప్పగించారు. సూసైడ్‌ నోట్‌లోని చేతి రాత సమ్రిత్‌దేనని పోలీసులు తేల్చారు. అతడికి విషవాయువుల సిలిండర్‌ ఎక్కడ నుంచి వచ్చిందనే అంశాన్ని ఆరా తీస్తున్నారు.   

మరిన్ని వార్తలు