మతిస్థిమితం లేని యువతితో పెళ్లి.. నా చావుకు కారకులు వీరే..

19 Mar, 2022 12:49 IST|Sakshi
షేక్‌ హుస్సేన్‌ బాషా (ఫైల్‌)     

కర్నూలు:  ‘మతిస్థిమితం లేని యువతితో పెళ్లి చేసి మోసం చేయడమే కాక నా పైన, నా కుటుంబ సభ్యులపైన దౌర్జన్యం చేసి కేసులు పెట్టారు. భార్య తరఫు బంధువులు అమీన్‌బాషా, మాసూంబీ, షేక్షా, షాషా, మైమూన్, ఆశ వేధించారు. వారి సూటిపోటి మాటలు తాళలేకపోతున్నా. నా చావుకు కారకులు వీరే. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయండి’ అంటూ ముదిరాజ్‌నగర్‌కు చెందిన షేక్‌ హుస్సేన్‌ బాషా (24) సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నబిసాహెబ్‌ లారీ క్లీనర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు కాగా చిన్న కుమారుడు షేక్‌ హుస్సేన్‌బాషా ఓ మార్కెటింగ్‌ సంస్థలో పని చేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు.

చదవండి: గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ గాయత్రి మృతి

కల్లూరు ఎస్టేట్‌కు చెందిన హుస్సేన్‌బీ కుమార్తె షాహీన్‌తో ఐదు నెలల క్రితం వివాహమైంది. పెళ్లి జరిగిన వారం రోజుల నుంచే ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దలు పంచాయితీ చేసి సర్ది చెప్పి కాపురం నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే షాహీన్‌ భర్తతో మళ్లీ గొడవపడి మూడు నెలల క్రితం తల్లిదండ్రుల వద్దకు చేరింది. ఇటీవల షాహీన్‌ దిశ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో కౌన్సెలింగ్‌కు పిలిపించడంతో హుస్సేన్‌బాషా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

గురువారం కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేసి అర్ధరాత్రి తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. తండ్రి నబిసాహెబ్‌ తెల్లవారుజామున గుర్తించి ఉరి నుంచి తప్పించి వైద్య చికిత్సల నిమిత్తం ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. భార్య తరఫు బంధువుల వేధింపులు తాళలేకనే తన కుమారుడు సూసైడ్‌ లెటర్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు నాల్గవ పట్టణ ఎస్‌ఐ రామయ్య తెలిపారు. సూసైడ్‌ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు