అమ్మవారికీ త్వరలో వజ్ర కిరీటం | Sakshi
Sakshi News home page

అమ్మవారికీ త్వరలో వజ్ర కిరీటం

Published Tue, Nov 7 2023 11:52 PM

- - Sakshi

రూ.కోటిన్నర వ్యయమవుతుందని అంచనా

ఆలస్యంపై ‘అందివస్తే అలంకారమే’ శీర్షికన ‘సాక్షి’లో కథనం

స్పందించిన ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌

సందేహాలను నివృత్తి చేస్తూ దాతకు

అనుమతి లేఖ

అన్నవరం: రత్నగిరి వాసుడు శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి వజ్ర కిరీటం తయారీకి మార్గం సుగమం అయింది. దాత, ప్రముఖ పారిశ్రామికవేత్త, పెద్దాపురంలోని శ్రీలలితా రైస్‌ ఇండస్ట్రీ అధినేతలలో ఒకరైన మట్టే సత్యప్రసాద్‌ దంపతులు గతేడాది సత్యదేవునికి రూ.రెండు కోట్ల వ్యయంతో వజ్ర కిరీటం చేయించి సమర్పించారు. ఆ సందర్భంగా అమ్మవారికి కూడా వజ్రకిరీటం చేయించేందుకు దాత సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే వజ్రకిరీటం అమ్మవారికి శాశ్వతంగా అలంకరించాలనేది దాత మట్టే సత్యప్రసాద్‌ కోరిక. ఇందుకు దేవదాయ శాఖ నిబంధనలు అంగీకరించవని, నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన తర్వాత ఇంతకన్నా ఎక్కువ వ్యయంతో పెద్ద కిరీటం మరో దాత తయారు చేయిస్తే అప్పుడు దాతతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. దీనిపై దాత సత్యప్రసాద్‌ కొంత అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఫలితంగా కిరీటం తయారీ ఆలస్యమైంది.

దీంతో సత్యదేవుడు వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమిస్తుంటే అమ్మవారు స్వర్ణకిరీటంతో దర్శనమిస్తుండడం భక్తులను అసంతృప్తికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో వజ్రకిరీటం తయారీ ఆలస్యంపై ‘అందివస్తే అలంకారమే ’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో వార్త ప్రచురితమైంది. దీనిపై దేవస్థానం ఈఓ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ అజాద్‌ స్పందించి వజ్రకిరీటం తయారీకి దాత మట్టే సత్యప్రసాద్‌కు మంగళవారం లిఖిత పూర్వక అనుమతి ఇస్తూ లేఖ పంపించారు. ఆ లేఖలో దాత సందేహాలను ఈఓ నివృత్తి చేశారు. దీంతో దీనిపై స్పందించిన దాత త్వరలోనే వజ్ర కిరీటం చేయించి అమ్మవారికి సమర్పిస్తానని తెలిపారు. ఈ కిరీటం తయారీకి సుమారు రూ.కోటిన్నర వ్యయం అవుతుందని అంచనా.

త్వరగా చేయించమని

దాతను కోరాం

సాధ్యమైనంత త్వరగా వజ్ర కిరీటం తయారు చేయించి అమ్మవారికి సమర్పించాలని దాతను కోరాం. గతంలో స్వామివారికి వజ్ర కిరీటం చేయించనపుడు కర్ణాభరణాలు చేయించలేదు. వాటిని కూడా చేయించాలని కోరాం. దాత కూడా అంగీకరించారు. కార్తికమాసంలో అమ్మవారు వజ్రకిరీటంతో భక్తులకు దర్శనమివ్వాలని కోరిక.

– ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ అజాద్‌,

ఆలయ ఈఓ

పూర్వజన్మ సుకృతం

సత్యదేవునికి వజ్రకిరీటం చేయించిన తనకు అమ్మవారికి కూడా వజ్ర కిరీటం చేయించే అదృష్టం దక్కడం పూర్వజన్మ సుకృతం. సాధ్యమైనంత త్వరలోనే వజ్ర కిరీటం చేయించి అమ్మవారికి సమర్పించేందుకు ప్రయత్నిస్తాను. కార్తికమాసంలోనే కిరీటం సమర్పించే అవకాశం అమ్మవారు తనకు ఇవ్వాలని వేడుకుంటున్నా. తనకు ఈ అవకాశం కల్పించిన దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌కు కృతజ్ఞతలు.

– మట్టే సత్యప్రసాద్‌, దాత

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement