పారిశుధ్య కార్మికులు ప్రథమ వైద్యులు | Sakshi
Sakshi News home page

పారిశుధ్య కార్మికులు ప్రథమ వైద్యులు

Published Tue, Nov 7 2023 11:52 PM

పారిశుధ్య కార్మికులు తిన్న ప్లేట్లను తీస్తున్న 
మంత్రి వేణు   - Sakshi

మంత్రి వేణుగోపాలకృష్ణ

రామచంద్రపురం: పారిశుధ్య కార్మికులను సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రథమ వైద్యులుగా గుర్తించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం మంత్రి రామచంద్రపురంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని పారిశుధ్య కార్మికులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. రామచంద్రపురం పురపాలక సంఘం కమిషనర్‌ కె.శ్రీకాంత్‌రెడ్డితో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. కార్మికులు భోజనం చేసిన తర్వాత వారి తిన్న ప్లేట్లను మంత్రి తీశారు. మంత్రి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులను గౌరవించుకునే విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎప్పుడు సమాజానికి దూరంగా ఉంటున్న వారికి సమాజంలో తాము ఒకరమనే భావన కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వచ్ఛ సంకల్పమే ధ్యేయంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలలో వెనకబడిన వారికి ప్రోత్సాహం కల్పించడమే ధ్యేయంగా ఎలా ముందుకు వెళుతున్నారో అందుకు అనుగుణంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా పారిశుధ్య కార్మికుల సేవలు ఉంటాయని, ఇలాంటి వారిని ప్రతి ఒక్కరూ ప్రఽథమ వైద్యులుగా గుర్తించవలసి ఉందన్నారు. అలాంటి వారిని సత్కరించుకోవడం కనీస ధర్మంగా భావించాలన్నారు. నాలుగు ఏళ్ల కాలంలో రామచంద్రపురంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన పారిశుధ్య కార్మికుల సేవలను గౌరవించుకునే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నేడు వారితో కలసి సహపంక్తి భోజనం చేయడం సంతోషంగా ఉందన్నారు. కమిషనర్‌ కె.శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు అంటేనే సమాజంలో తమకు తాము చిన్నతనంగా భావించే స్వభావం కలిగి ఉంటారని, అలాంటి వారిని ఈ విధంగా సత్కరించుకోవడం వారిలో మనోధైర్యం కల్పించే విధంగా ఉందన్నారు. రామచంద్రపురం పురపాలక సంఘానికి చెందిన పారిశుధ్య కార్మికులు పిల్లి వెంకటరమణ, వడ్డాది ముస్తాబాయి, ఎ.బాబురావు మాట్లాడుతూ మంత్రి ఆయన ఇంట తమకు ఆత్మీయ విందు ఇవ్వడం, స్వయంగా వడ్డించడం, భోజనం అనంతరం తాము తిన్న ప్లేట్లను తీయడం తమకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. వివిధ గ్రామాల పారిశుధ్య కార్మికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement