ఇదేమి ప్రజాస్వామ్యస్ఫూర్తి?!

20 Dec, 2023 00:16 IST|Sakshi
భద్రతా వైఫల్యంపై కేంద్ర హోం మంత్రి వివరణకు డిమాండ్‌ చేస్తూ సోమవారం లోక్‌సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న విపక్ష ఎంపీలు

ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌లో చరిత్రలో మునుపెన్నడూ లేనంత పెద్ద సంఖ్యలో సస్పెన్షన్ల పర్వం సాగుతోంది. ఈ నెల 13న పార్లమెంట్‌లో జరిగిన భద్రతా వైఫల్య ఘటనపై కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా సభలో ప్రకటన చేయాలనీ, చర్చ జరగాలనీ ప్రతిపక్షాలు పట్టు బట్టడం రచ్చగా మారింది. సభా వ్యవహారాలకు అడ్డుతగులుతున్నా రనీ, అభ్యంతరకరంగా ప్రవర్తి స్తున్నారనీ అంటూ ఇప్పటికి 141 మంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్‌ చేయడం నిర్ఘాంత పరుస్తోంది.

అధికార పార్టీ ఎంపీ సిఫార్సు పాసులతో సందర్శకులుగా వచ్చిన ఆగంతకుల రంగు పొగల హంగామాపై అధికారపక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షం చూస్తుంటే, గత సంప్రదాయాలకు విరుద్ధంగా సభలో కాక బయట వివిధ పత్రికలు, టీవీ ఛానళ్ళలో ప్రధాని, హోమ్‌ మంత్రి జరిగిన సంఘటనపై స్పందిస్తూ ప్రతిపక్షాల డిమాండ్‌ను పెడచెవిన పెట్టడం చర్చనీయాంశమైంది. 

గత వారం 14 మంది, ఈ సోమవారం 78 మంది, తాజాగా మంగళవారం మరో 49 మంది... మొత్తం ఇప్పటికి 141 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటుపడింది. పార్లమెంట్‌లో సభా వ్యవహారాలకు అడ్డుపడిన సభ్యుల సస్పెన్షన్‌ కొత్తేమీ కాదు. ఇలా ఇంత సంఖ్యలో సస్పెన్షన్ల పర్వం సాగడం మాత్రం ఇదే తొలిసారి. దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం ఎన్నడో 1989 మార్చిలో థక్కర్‌ ప్యానెల్‌ నివేదికపై రచ్చతో ఒకే రోజున లోక్‌సభలో 63 మంది సభ్యులను సస్పెండ్‌ చేసినట్టు చరిత్ర.

ఇప్పుడు ఆ పాత రికార్డును చెరిపేస్తూ, దురదృష్టకరమైన కొత్త చరిత్ర లిఖితమైంది. సభాధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తికి సభ్యులను సస్పెండ్‌ చేసే అధికారమున్న మాట నిజమే. కానీ, ఆ స్థానంలో కూర్చొనే వ్యక్తి ప్రథమ కర్తవ్యం – అధికార, ప్రతిపక్షాల మధ్య సమతూకం పాటిస్తూ సభను సజావుగా నడపడమే తప్ప, సభ్యులపై పెత్తనం చూపడం కానే కాదు. ఆ సంగతి మర్చి పోయి సభలో వారందరికీ పెద్దన్నయ్యలా ప్రవర్తిస్తామంటేనే కష్టం. ప్రస్తుతం జరుగుతున్నదదే! 

నిరుద్యోగం సహా వివిధ సమస్యలపై దృష్టి పడేటందుకే పార్లమెంట్‌లో గతవారం అలా అలజడి రేపామని పట్టుబడ్డ ఆగంతకుల కథనం. ఆ ఆందోళనకారుల ఆలోచనలు ఏమైనప్పటికీ, వారు పొగ గొట్టాలతో పార్లమెంటులోకొచ్చే వీలు కల్పించి, సభ్యుల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టిన భద్రతా లోపంపై తక్షణం చర్చ జరగాల్సి ఉంది. అత్యవసరంగా చర్యలు చేపట్టాల్సి ఉంది. విపక్షాల వాదనా అదే. ఆ వాదనలో న్యాయం ఉంది.

ఘటనపై సభలో రక్షణ మంత్రి లాంటి వారు కాక శాంతి భద్ర తలు చూసే హోమ్‌ మంత్రి, సభానాయకుడు ప్రకటన చేయడం, సభ్యుల అనుమానాలను నివృత్తి చేయడం విధాయకం కూడా! కానీ అలా జరగట్లేదు. అక్కడే పీటముడి బిగిసింది. అనైతికత అంటూ ప్రతిపక్ష ఎంపీ మహువా మొయిత్రాపై చర్యలకు వేగిరపడ్డ పాలకులు, ఆగంతకులకు పాసులిచ్చిన స్వపక్షీయుడిపై చర్యకు ముందుకు రాకపోవడం ద్వంద్వ ప్రమాణాలంటూ విమర్శలకు తావిచ్చింది.

అయితే, సభను సజావుగా సాగనివ్వకుండా ప్రతిపక్షాలు మొండిగా వ్యవహరిస్తున్నాయని అధికార పక్ష ఆరోపణ. అది పూర్తి సత్యదూరమనలేం. కానీ, దాన్ని సాకుగా చూపుతూ సభలో సాధారణ ప్రకటన చేయడానికి కూడా అమాత్యులకూ, ప్రభుత్వానికీ అభ్యంతరం ఉంటే అది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. సభావ్యవహారాలను అడ్డుకోవడం సైతం సభ్యుల హక్కులలో భాగమేనని బీజేపీ ఎంపీ స్వర్గీయ అరుణ్‌ జైట్లీయే ఒకప్పుడు వ్యాఖ్యానించడం గమనార్హం.

కానీ, అధికార పీఠంపై కూర్చున్నాక బీజేపీ ఆ పాత వైఖరిని నమ్ముతున్నట్టు లేదు. చర్చలు, భిన్నాభిప్రాయాల కలబోతతో సాగాల్సిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పాలకుల ఏకపాత్రాభినయంగా మార్చాలని చూస్తున్నట్టుంది. ఎన్నికల సంఖ్యాబలపు నియంతృత్వంతో అధికారాన్ని హక్కుభుక్తంగా భావిస్తే అది గర్హనీయం. ప్రతిపక్షాలకున్న ప్రశ్నించే హక్కును కాదంటే, వాటి మాట వినాల్సిన పనే లేదనుకుంటే ఇక సభా సమావేశాలకు అర్థం ఏముంది!

నేటి ప్రధాని గతంలో గుజరాత్‌ను ఏలినప్పుడూ, నిరసన తెలిపే ప్రతిపక్షాలపై నిర్దాక్షిణ్య సస్పె న్షన్ల పర్వం ఇలాగే సాగిందని పండితులు లెక్కలు తీస్తున్నారు. ఒకప్పుడు కొన్ని రాష్ట్రాల్లోనే కనిపించే ఈ ధోరణి ఇప్పుడు పార్లమెంటుకు పాకడం విచారకరం. 2009–14 మధ్య దాదాపు 36 సస్పెన్షన్లు జరిగితే, ఎన్డీఏ ఏలుబడి వచ్చాక 2014–19లో అది 81కి ఎగబాకింది.

ఇక, కేంద్రంలో వర్తమాన ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్లు 149కి చేరాయి. ఇక, తాజా సస్పెన్షన్ల వల్ల ప్రస్తుత శీతకాల సమా వేశాల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమిలో మూడింట రెండొంతుల పైగా సభ్యులు సభ వెలుపలికే పరిమితమైన పరిస్థితి. కొన్నేళ్ళుగా అనేక కీలక బిల్లులు చర్చే లేకుండా, అవసరమైన సవరణల్ని పట్టించుకోకుండా సంఖ్యాబలంతో చట్టాలవుతున్న తీరు పార్లమెంటరీ విధానాన్నే ప్రశ్నిస్తున్నాయి. 

ఇక, ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్‌ వెలుపల మంగళవారం నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు ఓ ప్రతిపక్ష ఎంపీ ప్రవర్తించిన తీరు బాగా లేదు. రాజ్యసభ ఛైర్మన్‌ను అనుకరిస్తూ ఆ సభ్యుడు చేసిన  ప్రహసనం సమర్థనీయం కాదు. ఇది ‘డెమోక్రసీ’ కాదు, ‘నమోక్రసీ’ అంటున్న ప్రతిపక్షాల పోరుకు శోభనిచ్చేదీ కాదు. వ్యక్తిగత ప్రవర్తనలో లోపాలు, పక్షపాత ధోరణులు ఎన్ని ఉన్నా... రాజ్యాంగ రీత్యా రాజ్యసభ ఛైర్మనైన భారత ఉపరాష్ట్రపతి హోదాకంటూ ఓ గౌరవం ఉంది.

పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ఆ గౌరవం ఇవ్వాల్సి ఉంది. అది మరిచి అగౌరవంగా ప్రవర్తిస్తే ప్రతిపక్షాలకే నష్టం. పోరాటాన్ని అది పలుచన చేస్తుంది. అసలు సంగతి పక్కదోవ పడుతుంది. ఏమైనా, చర్చలంటే టీవీలో ప్రసంగాల స్థాయికి దించేస్తూ, ప్రజాసమస్యల్ని గాలికొదిలేసే సభలతో ప్రయోజనం శూన్యం. ప్రతిపక్షాలే లేని పాలన కావాలనుకుంటే దానికి ప్రజాస్వామ్యమని పేరెందుకు? 

>
మరిన్ని వార్తలు