ప్లాస్టిక్‌పై కొత్త ఉద్యమం బర్తన్‌ బ్యాంక్‌ !

29 Nov, 2023 09:49 IST|Sakshi

పెళ్లి అనగానే డిస్పోజబుల్‌ ప్లాస్టిక్‌ను విపరీతంగా వాడాల్సి వస్తుంది. ఇది పర్యావరణానికి హాని. అంతే కాదు పల్లెల్లో వాటి వల్ల పేరుకున్న చెత్తతో ఎక్కడలేని మురికి. జబ్బులు. అందుకే ఉత్తరాదిలో చాలామంది మహిళా సర్పంచ్‌లు ‘బర్తన్‌ బ్యాంక్‌’ను ఏర్పాటు చేస్తున్నారు. ఊరికి ఇంతని స్టీలు పెళ్లి సామాను ఇచ్చి అందరూ వాటిని ఫ్రీగా వాడుకునేలా చేస్తున్నారు. ఇది దక్షిణాదికి అందుకోవాల్సి ఉంది.

ఇండోర్‌లో మునిసిపల్‌ అధికారులు రెగ్యులర్‌గా కేటరింగ్‌ వాళ్లను, పెళ్లిళ్లు జరిగే ఫంక్షన్‌ హాళ్లను, రెస్టరెంట్‌లను సందర్శిస్తారు. ఎక్కడైనా ప్లాస్టిక్‌ వాడితే మొహమాటం లేకుండా ఫైన్‌ వేస్తారు. ఈ ఫైన్‌ ఐదు వందలతో మొదలయ్యి 12 లక్షల వరకూ ఉంటుంది. హోటళ్ల వారికి వాళ్లు ఒకటే చెబుతారు– ‘మీరు రోజూ వన్‌ టైమ్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వాడటం వల్ల చేసే ఖర్చును స్టీలు వాడకం ద్వారా పూర్తిగా తగ్గించవచ్చు’ అని. ఇండోర్‌కు క్లీన్‌ సిటీగా పేరు ఉంది.

ఆ పేరును నిలబెట్టాలని అధికారుల తాపత్రయం. అంతే కాదు, వారు ఒక ‘బర్తన్‌ బ్యాంక్‌’ను కూడా ఏర్పాటు చేశారు. బర్తన్‌ అంటే గిన్నెలు. పెళ్లికి కావాల్సిన వంట, వడ్డన కోసం కావాల్సిన అన్ని పాత్రలు, గ్లాసులు, ప్లేట్లు, గరిటెలు అన్నీ ఒక చోట పెడతారు. 24 గంటల ముందు చెప్పి ఎవరైనా ఉచితంగా తీసుకెళ్లవచ్చు. ఉపయోగించుకున్నాక శుభ్రం చేసి తిరిగి చెల్లించాలి. ఏవైనా డ్యామేజీ అయినా పోయినా డబ్బు కట్టాలి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఈ బ్యాంక్‌కు పోటెత్తుతున్నారు.

ఇదంతా ఎలా మొదలైంది?
రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా తదితర రాష్ట్రాలలో కొత్తగా పదవుల్లోకి వచ్చిన మహిళా సర్పంచ్‌లు పల్లెల్లో చెత్తగా పేరుకు పోతున్న ప్లాస్టిక్‌ను చూసి ఇది మొదలెట్టారు. రాజస్థాన్‌లోని జున్‌జును అనే పల్లెకు నీరూ యాదవ్‌ అనే ఆవిడ సర్పంచ్‌ అయ్యాక ఈ సంవత్సరం మొదలులో ‘బర్తన్‌ బ్యాంక్‌’ మొదలెట్టింది. ఊరి పెద్దలను ధిక్కరించి నిధులను ఇలాంటి పనులకు ఉపయోగించడం మొదలెట్టిన నీరూ యాదవ్‌ ‘బర్తన్‌ బ్యాంక్‌’ వల్ల ఊరు ఎంత శుభ్రంగా ఉంటుందో ప్రాక్టికల్‌గా చూపించాక అందరూ ఆమె నిర్ణయాన్ని అంగీకరించారు. అలా ఈ ఉద్యమం రాజస్థాన్‌ నుంచి ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది.

‘ప్లాస్టిక్‌ వద్దు చెత్త వద్దు’ నినాదంతో మహిళా సర్పంచ్‌లు తమ గ్రామాల్లో బర్తన్‌ బ్యాంక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో గ్రామానికి 1000 స్టీలుప్లేట్లు, రెండు వేల కూర గిన్నెలు, రెండు వేల స్టీలు గ్లాసులు, 2 వేల స్పూన్లు, 50 మంచి నీటి జగ్గులు, ఐదారు వంట డేగిసాలు ఏర్పాటు చేస్తూ... గ్రామంలో ఎవరి ఇంట ఏ శుభకార్యం జరిగినా ఈ బ్యాంక్‌ నుంచి ఉచితంగా గిన్నెలు పొందే సదుపాయం కల్పిస్తున్నారు. .

దీదీ బర్తన్‌బ్యాంక్‌
చత్తిస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా అంబికా పూర్‌లో స్వయంఉపాధి మహిళా బృందాలు తమ ఇళ్లల్లో శుభకార్యాల కోసం ‘దీదీ బర్తన్‌ బ్యాంక్‌’ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ మహిళల ఈ బ్యాంక్‌లో ఏర్పాటు చేసుకున్న పాత్రలను ఉచితంగా వాడుకోవచ్చు. అయితే రాను రాను జిల్లా అంతా అందరు ప్రజలూ వాడుకునేలా ఈ ‘దీదీ బర్తన్‌ బ్యాంక్‌’లు విస్తరించాయి.‘ప్లాస్టిక్‌ చెత్త మురుగు నీటికి పెద్ద ప్రతిబంధకం. అది మట్టిలో కలవదు. దానిని రీసైకిల్‌ చేయడం కూడా వృథా. ఇలాంటి ప్లాస్టిక్‌కు స్టీలు వస్తువులతో విరుగుడు చెప్పాలి’ అంటారు ఈ మహిళలు.

ఒడిస్సాలో
ఒడిస్సాలో బర్తన్‌ బ్యాంక్‌ ఉద్యమం జోరు మీద ఉంది. నౌపాడ జిల్లాలో భలేస్వర్‌ అనే పంచాయితీ సర్పంచ్‌ అయిన సరోజ్‌ దేవి అగర్వాల్‌ ఊరి పెద్దలను ఎదిరించి మరీ పంచాయితీ నిధుల నుంచి 75 వేలు మంజూరు చేసి ‘బర్తన్‌ బ్యాంక్‌’ ఏర్పాటు చేసింది. ‘ప్రతి ఊళ్లో ఇలాంటి బ్యాంక్‌ ఉండాలి’అంటుందామె. అయితే ఈ బర్తన్‌ బ్యాంక్‌లు రెండు విధాలుగా పని చేస్తున్నాయి. కొన్ని చోట్ల కామన్‌గా పాత్రలను ఉంచేస్తే మరికొన్ని చోట్ల ఇంటికి ఇన్నని స్టీలు సామాన్లు ఇచ్చేస్తున్నారు. అంటే పెళ్లికి ఎవరికి పళ్లాలు వాళ్లు తెచ్చుకుని తిని తీసుకెళ్లిపోయేలా. ఇది కూడా బాగానే ఉందంటున్నారు కొందరు. ఏమైనా ఉత్తరాది సంప్రదాయం దక్షిణాదికి కూడా వ్యాపిస్తే బాగుండు. 

(చదవండి: ఎవరీ గుర్మిత్‌ కౌర్‌!..ఆమె గురించి యూకేలో ఎందుకు పోరాటం..?

మరిన్ని వార్తలు