తాజా తీర్పు: పోల్చి తిడితే ఇంతే సంగతులు

18 Aug, 2022 00:09 IST|Sakshi

భర్తల నోటికి తాళం. భార్యల వేదనకు ఈ తీర్పు ఒక అవసరం. ఇరుగింటామెతోనూ పొరుగింటామెతోనూ సినిమా హీరోయిన్‌తోనూ పోల్చి భార్యను చులకన చేస్తే సూటిపోటి మాటలంటే అది ‘మానసిక క్రూరత్వం’ కిందకే వస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అటువంటి భర్తతో కాపురం చేయనవసరం లేదని విడాకులు మంజూరు చేసింది. గతంలో ముంబై ఫ్యామిలీ కోర్టు కూడా
‘ఆ నువ్వు పెద్ద మగాడివని’ లాంటి గుచ్చే మాటలు మాట్లాడే భార్య నుంచి విడాకులు ఇప్పించింది. భార్యాభర్తలు ఇలాంటి మాటలు అనుకోవడం ఎందుకు?

భార్యను చులకన చేయడం భర్తకు సమాజం నుంచి కుటుంబం నుంచి అంగీకారం పొందిన విషయంగా అనిపిస్తుంది. సినిమాల్లో పాత్రలు, టీవీల్లో స్కిట్‌లు భార్యను భర్త నానా విధాలుగా హేళన చేయడం చూపిస్తూనే ఉంటాయి. ‘మసిబొగ్గులా ఉన్నావు’, ‘బోండాంలా ఉన్నావు’, ‘నిన్ను చేసుకునే బదులు అడవిలో మొద్దును చేసుకుని ఉంటే నయం’, ‘ఏదో ఒక మాయలో పడినట్టుగా నిన్ను చేసుకున్నాను.

కాని నీలో ఏ ఆకర్షణ లేదు’, ‘ఆ ఎదురింటామెను చూడు ఎంత అందంగా ఉందో’, ‘ఇదంతా నా ఖర్మ’... ఇలాంటి మాటలు భర్త మాట్లాడితే భార్య లోలోపల బాధ పడటమో తిరిగి తగాదా పడటమో చేస్తూ ఉంటుంది. కాని ‘ఇది అవసరమా నాకు’ అని భార్య అనుకుంటే విడాకులు మంజూరు చేయడానికి ఈ కారణం సరిపోతుందని తాజాగా కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కేరళ హైకోర్టు బెంచిలో జస్టిస్‌ కె.నరేంద్రన్, సి.ఎస్‌.సుధ ఈమేరకు తీర్పు వెలువరించారు.

ఏమిటి కేసు?
కేరళలో ఒక జంట 2009లో పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఆమెకు 26. అతనికి 29. పెళ్లయిన తర్వాత భర్త కొత్త పెళ్లికూతురు అని కూడా చూడక వెంటనే ఇతర స్త్రీలతో పోల్చసాగాడు. ‘నీకన్నా ఆమె బాగుంది’, ‘ఆమెకున్న మంచి జుట్టు నీకు లేదు’ లాంటి కామెంట్లు చేసేవాడు. అతని తమ్ముడు పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే పెళ్లిచూపులకు అన్నగా హాజరయ్యి భార్యతో ‘నా తమ్ముడు అదృష్టవంతుడు. మంచి అమ్మాయిలను వెతుకుతున్నాడు’ లాంటి కామెంట్లు చేసేవాడు. దాంతో ఆమె కనీసం ఆరునెలలు కూడా అతనితో కాపురం చేయలేకపోయింది. జనవరిలో పెళ్లయితే నవంబర్‌లో విడాకులకు ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసింది. ఫ్యామిలీ కోర్టు ‘లైంగిక దూరాన్ని’ కారణంగా చూపుతూ విడాకులు మంజూరు చేసింది. దాని మీద భర్త హైకోర్టుకు అప్లయి చేశాడు. కేరళ హైకోర్టు కూడా తాజాగా విడాకులే సబబైనవిగా తీర్పు ఇచ్చింది.

మానసిక క్రూరత్వం
ఈ కేసులో విడాకులకు కనిపించే సగటు కారణాల కన్నా భర్త తన భార్యను ఇతర స్త్రీలతో పోల్చుతూ చిన్నబుచ్చడాన్నే హైకోర్టు ప్రధాన కారణంగా తీసుకుంది. దానిని ‘మానసిక క్రూరత్వం’గా వ్యాఖ్యానించింది. అలాంటి క్రూరత్వంతో బంధం నిలవదు అని చెప్పింది. ‘వారు మంచి వయసులో ఉన్న జంటే అయినా ఈ కేసు కొనసాగిన ఇన్నేళ్లుగా తిరిగి కలవలేదు. భాగస్వాములలో ఒకరు విడాకులకు దరఖాస్తు చేసి, ఏళ్ల తరబడి ఇద్దరూ విడిగా ఉండగా ఆ పెళ్లి కుటుంబాలకు, సంఘానికి చెప్పుకోవడానికి ఉంటుందిగాని నిజంగా మనలేదు’ అని విడాకులు మంజూరు చేసింది.

భర్తను చిన్నబుచ్చినా అంతే!
అయితే 2013లో ముంబై ఫ్యామిలీ కోర్టులో భర్త తరఫు నుంచి ఇటువంటి తీర్పే ఇచ్చింది. భార్య భర్తను ‘నువ్వు పెద్ద మగాడివిలే’, ‘నేను సరిగా ఏడ్చి ఉంటే మావాళ్లు నీకంటే తెలివైన, మంచి కుటుంబం నుంచి కుర్రాణ్ణి వెతికి ఉండేవారు’, ‘నాకు నువ్వు ఏమాత్రం సరి తూగవు’ లాంటి మాటలతో బాధించేది. అప్పటికి వారికి పెళ్లయి పదేళ్లు. ఇద్దరు పిల్లలు. కాని భర్త అలసిపోయి ఆఫీసు నుంచి వస్తే ‘ఒక ముద్దు ముచ్చట లేదు. మగాడివైతేగా’ వంటి మాటలతో బాధించేది. ఏమైనా అంటే ‘ఉరేసుకుని చస్తా’ అని బెదిరించేది. ఈ మాటలన్నింటినీ కోర్టు ‘మానసిక క్రూరత్వం’గా పరిగణించి విడాకులు ఇచ్చింది. ముఖ్యంగా ‘ఆత్మహత్య బెదిరింపులు’ భర్తకు నరక ప్రాయం అవుతాయని వ్యాఖ్యానించింది.

ఎందుకు ఈ మాటలు?
భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహం, గౌరవం, సర్దుబాటు ధోరణి, అవగాహన, అర్థం చేసుకోవడం, బలహీనతలను గుర్తించడం, ఎదుటివారికి ఏ పని నచ్చదో దానిని వదలిపెట్టడం... ఇవన్నీ ఉంటే తప్ప కాపురం సజావుగా సాగదు. పెళ్లయ్యాక ఒకరికొకరు సరిపడరు అని అనుకుంటే విడిపోవడం లేదా మౌనంగా కొనసాగడం మేలు. కాని మాటలు చాలా గాయం చేస్తాయి. నిజానికి అవి వంటి మీద పడే దెబ్బల కంటే తీవ్రమైనవి. మాటలతో హింసించి సంతృప్తి పడదామంటే కాలక్రమంలో ఆ బంధం మరింత పలుచనవుతుంది తప్ప గట్టి పడదు.
కాబట్టి తిడితే ఏమవుతుందిలే అని భార్య/భర్త అనుకోవద్దు. విడాకులకు అవి చాలు.

మరిన్ని వార్తలు