Sheroes Hangout: ఆత్మబలమే అసలైన అందం... ఆనందం

18 Aug, 2022 00:09 IST|Sakshi
యాసిడ్‌ బాధిత మహిళలకు శ్రేయాస్‌ హ్యాంగవుట్‌ కేఫ్‌ కొండంత అండ

ఆ కేఫ్‌ వేడివేడి చాయ్‌లకు మాత్రమే ఫేమస్‌ కాదు. వేడి, వేడి చర్చలకు కూడా. ఎక్కడో ఏదో దిగులుగా ఉందా? అంతా శూన్యం అనిపిస్తుందా? అయితే అటు పదండి. దేశవ్యాప్తంగా ఎంతోమంది యాసిడ్‌ బాధిత మహిళలకు అంతులేని ధైర్యాన్ని ఇచ్చిన శ్రేయాస్‌ హ్యాంగవుట్‌ కేఫ్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసింది...

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ‘శ్రేయాస్‌ హ్యాంగవుట్‌’ కేవలం రుచుల కేఫ్‌ మాత్రమే కాదు. ఆత్మవిశ్వాసం లేనివారికి అంతులేని ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ఇచ్చే వేదిక. అభాగ్యుల కన్నీటిని తుడిచే చల్లని హస్తం. ఆపదలో ఉన్నవారికి చేయూత ఇచ్చి ముందడుగు వేయించే ఆత్మీయ మిత్రురాలు. యాసిడ్‌ ఎటాక్‌ సర్వైవర్స్‌ ఈ కేఫ్‌ను నడుపుతున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది యాసిడ్‌ బాధిత మహిళలకు స్ఫూర్తి ఇచ్చిన ‘శ్రేయాస్‌ హ్యాంగవుట్‌’  తాజాగా మరో అడుగు ముందుకు వేసింది.
ప్రముఖ బ్యూటీ చైన్‌ సెలూన్‌ ‘నెచురల్స్‌’తో కలిసి యాసిడ్‌ బాధిత మహిళలకు ప్రొఫెషనల్‌ బ్యూటీ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా ఈ కోర్స్‌ చేయడానికి డెబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చవుతుంది.

శిక్షణ ఇవ్వడం మాత్రమే కాదు, వారు సొంతంగా బ్యూటీపార్లర్‌ ప్రారంభించడానికి అవసరమైన సహాయాన్ని కూడా అందిస్తారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అయిదు మంది మహిళలు శిక్షణ తీసుకున్నారు. వారిలో ఒకరు ఫరాఖాన్‌. ఒకప్పుడు ఆమెకు మేకప్‌ వేసుకోవడం అంటే ఎంతో ఇష్టం. అయితే భర్త యాసిడ్‌ దాడి చేసిన తరువాత అద్దంలోకి చూడాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చింది.

‘అందరు మహిళలలాగే నాకు కూడా అలంకరణ అంటే చాలా ఇష్టం. శుభకార్యాలకు వెళ్లడానికి ముందు ఎంతో హడావిడి చేసేదాన్ని. నా భర్త చేసిన దుర్మార్గం వల్ల మేకప్‌ అనే మాట వినబడగానే కన్నీళ్లు ధారలు కట్టేవి. అద్దం చూడడానికి భయమేసేది. ఇలాంటి నా మానసిక ధోరణిలో పూర్తిగా మార్పు తీసుకువచ్చి నన్ను బలమైన మహిళగా నిలబెట్టింది శ్రేయాస్‌. పూర్వంలాగే ఇప్పుడు నేను మేకప్‌ విషయంలో శ్రద్ధ చూపుతున్నాను. ఏ తప్పు చేశానని భయపడాలి? ఎవరికి  భయపడాలి!’ అంటుంది ఫరాఖాన్‌.

28 సంవత్సరాల కుంతి సోని డిమాండ్‌ ఉన్న నెయిల్‌ ఆర్ట్‌లో శిక్షణ తీసుకుంది. ఒక సినిమా కోసం బాలీవుడ్‌ కథానాయిక దీపికా పదుకొణెతో కలిసి పనిచేసింది.
‘యాసిడ్‌ బాధితులకు ఉపాధి దొరకడం ఒక ఎల్తైతే, అందమైన ఆనంద జీవితం మరో ఎత్తు. యాసిడ్‌ బాధితురాలైన నేను మేకప్‌  వేసుకుంటే నలుగురు చులకనగా మాట్లాడతారేమో...అనే భావనతో చాలామంది అలంకరణ అనే అందమైన సంతోషాన్ని తమ ప్రపంచం నుంచి దూరం చేసుకుంటున్నారు. అలాంటి వారికి శ్రేయాస్‌ కొత్త ధైర్యాన్ని ఇచ్చింది’ అంటుంది సోని.

ఘాజిపూర్‌కు చెందిన రూపాలి విశ్వకర్మ సినిమా రంగంలో మేకప్‌–ఆర్టిస్ట్‌ కావాలని బలంగా అనుకుంటుంది. కొన్ని ప్రాంతీయ చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు వేసిన రుపాలి ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోకముందే ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ఒక కన్ను పూర్తిగా దెబ్బతింది.
ఆమె రంగుల కల నల్లగా మసక బారింది.
ఒకప్పుడు కళ్లముందు సుందర భవిష్యత్‌ చిత్రపటం తప్ప మరేది  కనిపించేది కాదు.
దాడి తరువాత ఎటుచూసినా దుఃఖసముద్రమే!

‘బయటి వాళ్ల నుంచి మాత్రమే కాదు ఇంటివాళ్ల నుంచి కూడా నన్ను పట్టించుకోని నిర్లక్ష్య ధోరణి ఎదురైంది. ఒక మూలన కూర్చొని జీవితాన్ని వెళ్లదీయి అన్నట్లుగా ఉండేవి వారి మాటలు. అయితే శ్రేయాస్‌తో పరిచయం అయిన తరువాత నాలో ధైర్యం పెరిగింది. మరుగున పడిన కలలు మళ్లీ ఊపిరి పోసుకున్నాయి. నేను మేకప్‌–ఆర్టిస్ట్‌గా రాణించడం మాత్రమే కాదు, ధైర్యం లోపించి దారి కనిపించని యువతులకు ధైర్యం ఇవ్వాలనుకుంటున్నాను’ అంటుంది రుపాలి.
శ్రేయాస్‌ సరికొత్త ముందడుగు ద్వారా ‘అలంకరణ, అందం అనేవి మనకు సంబంధించిన మాటలు కావు’ అనే దుఃఖపూరిత నిరాశానిస్పృహలకు కాలం చెల్లుతుంది. ‘ఆత్మబలమే అసలైన అందం, ఆనందం’ అనుకునే కొత్త కాలం ఒకటి వస్తుంది.

మరిన్ని వార్తలు