చిన్న పిల్లల్లో కూడా డిప్రెషన్‌..?

21 Jan, 2021 08:54 IST|Sakshi

పిల్లలంటే ఆడుతూ పాడుతూ హాయిగా ఉంటారు... అంతేగానీ పెద్దవాళ్లకు ఉండే సాధారణ బాధలూ, వాటి కారణంగా కుంగుబాటు వంటి సమస్యలు వాళ్లకు ఉండవని చాలామంది అనుకుంటారు. కానీ... చిన్నపిల్లలకూ డిప్రెషన్‌ రావచ్చు. అందరు పిల్లలూ ఒకేలా ఉండరు. కొంతమంది సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వాళ్లు త్వరగా డిప్రెషన్‌కు లోనవుతారు. పిల్లలు ఒంటరిగా ఉండటం, స్నేహితులు బాధపెట్టినప్పుడు ఏడ్వటం వంటి లక్షణాలతోనే పిల్లలు డిప్రెషన్‌కు లోనయ్యారని అనుకోకూడదు. చదువులపైనా, ఆటపాటలపై శ్రద్ధ చూపకుండా, ప్రతిదానికీ నిరుత్సాహంగా, ఎప్పుడూ నిరాశతోనే ఉంటే అది డిప్రెషన్‌ కావచ్చేమోనని అనుమానించాలి. 

డిప్రెషన్‌కు లోనైన పిల్లలందరూ ఏడుస్తూ ఉండరు. తమ బాధను కోపం, చిరాకు రూపంలో వ్యక్తపరుస్తారు. ఇలాంటి పిల్లలు త్వరగా నీరసపడతారు. తీవ్రంగా ఆకలి ఉండటం లేదా అస్సలు ఆకలి లేకపోవడం, చాలా ఎక్కువగా నిద్రపోవడం లేక తీవ్రమైన నిద్రలేమి వంటి లక్షణాలు ఉంటే అది చిన్నపిల్లల్లో డిప్రెషన్‌కు సూచన కావచ్చు. అందుకే డిప్రెషన్‌తో బాధపడే పిల్లల్లో ఒబేసిటీ లేదా తక్కువ బరువు ఉండటం వంటి బాధలు వస్తాయి. డిప్రెషన్‌తో బాధపడే పిల్లలు తమకు రకరకాల  శారీరక సమస్యలు ఉన్నాయంటూనో లేదా దేహంలో అనేక చోట్ల నొప్పిగా ఉందనో మాటిమాటికీ ఫిర్యాదు చేస్తారు. యుక్తవయసులోకి వచ్చే సమయంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా మూడ్స్‌లో మార్పులు (మూడ్‌ స్వింగ్స్‌) వచ్చి వాళ్లలో భావోద్వేగాలు త్వరత్వరగా మారిపోతూనే అవి తీవ్రంగా చెలరేగిపోతున్నట్లుగా వ్యక్తమయ్యే అవకాశాలూ ఉంటాయి. ఇలాంటి పిల్లలను ఒంటరిగా వదిలేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లల్లో రెండు మూడు వారాలకు పైగా డిప్రెషన్‌ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తుంటే వైద్యుల సలహా మేరకు చికిత్స చేయించాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు తల్లిదండ్రులు పిల్లలకు తగిన ప్రోత్సాహాన్ని ఇస్తూ కుటుంబంలో వారికి అనువైన వాతావరణం కల్పించాలి. 

బైపోలార్‌ డిజార్డర్, అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపరాక్టివ్‌ డిజార్డర్, ఆటిజమ్, డిసోసియేటివ్‌ ఐడెంటిటీ డిజార్డర్, యాంగై్జటీ వంటి మానసిక సమస్యలు ఉన్న పిల్లల్లో వాటితో పాటు డిప్రెషన్‌ లక్షణాలు కలిపిపోయి కనిపిస్తాయి. టీనేజ్‌లో ఉన్న పిల్లల ఎదుగుదల సమయంలో పేరెంట్స్‌ తగిన శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు భవిష్యత్తులో ఎదుర్కొనే అనారోగ్య సమస్యలను, మానసిక సమస్యలను నివారించాలంటే వారికి తగిన సమయంలో ఆప్యాయతతో కూడిన కౌన్సెలింగ్, మంచి చికిత్స ఇప్పించాలి.  

మరిన్ని వార్తలు