మీల్‌మేకర్‌ స్టఫ్డ్‌ చపాతీ.. భలే రుచిగా ఉంటాయి 

12 Dec, 2023 10:28 IST|Sakshi

మీల్‌మేకర్‌ స్టఫ్డ్‌ చపాతీ తయారీకి కావలసినవి:

మీల్‌మేకర్‌ – పావు కప్పు (మెత్తగా ఉడికించుకుని, చల్లారాక తురుములా చేసుకోవాలి), గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు, వేడి నీళ్లు, నూనె – సరిపడా, మొక్కజొన్న పిండి – 2 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్‌ స్పూన్లు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు – 1 టీ స్పూన్‌, పసుపు – చిటికెడు, కారం – 1 టీ స్పూన్‌ , అల్లం– వెల్లుల్లి పేస్ట్‌ – అర టేబుల్‌ స్పూన్‌ , టొమాటో ముక్కలు – 1 టేబుల్‌ స్పూన్‌  (చిన్నవి), కరివేపాకు, కొత్తిమీర తురుము – కొద్దిగా

తయారీ విధానమిలా:

ముందుగా గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, మూడు గరిటెల నూనె, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని కొద్దికొద్దిగా వేడి నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకుని, తడి గుడ్డ పరచి 20 నిమిషాల పాటు పక్కనపెట్టుకోవాలి. ఈలోపు ఒక కళాయిలో 2 గరిటెల నూనె వేసుకుని.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను దోరగా వేయించుకుని.. మీల్‌మేకర్‌ తురుమునూ వేసుకుని బాగా కలుపుకోవాలి.

అల్లం–వెల్లుల్లి పేస్ట్‌ కూడా వేసి బాగా కలిపి.. పసుపు, కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుము వేసుకుని స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం చపాతీలు చేసుకుని, ఒక్కోదానిలో కొద్దికొద్దిగా మీల్‌మేకర్‌ మిశ్రమాన్ని పెట్టుకుని.. ఫోల్డ్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి. వీటిని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.

>
మరిన్ని వార్తలు