కథ: వీడిన దుర్గంధం.. నీలను ఈసడించుకున్నందుకు చంద్రకళ కళ్లల్లో నీళ్లు!

19 Sep, 2022 15:04 IST|Sakshi

విశాఖపట్నం, మువ్వలవానిపాలెం.. బస్టాండ్‌లో ఉంది నీల. ఉదయం తొమ్మిది గంటలు.. ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్లే సమయం. రద్దీగా ఉంది. ఎవరి పనుల్లో వారు ఆదరాబాదరాగా కనిపిస్తున్నారు. 

ఎండ అప్పటికే చురచురలాడుతోంది. చెమట్లు పోస్తున్నాయి. ప్రతి ఒక్కరూ నీలవైపు చూస్తున్నారు. చూసినవారు అటువైపు వెళ్లకుండా నీలకు దూరంగా జరిగిపోతున్నారు. నీల కురూపి కాదు.. భిక్షగత్తె కాదు. రోగిష్టీ కాదు. పిచ్చిదీ కాదు. అయినా  ఆమెకు దూరంగా వెళ్లిపోతున్నారు.

నీల.. నల్ల ముద్దబంతిలా ఉంటుంది. మెరుపులాంటి ఆకర్షణ. ఆమె చెవులకు  చిన్న బుట్టలు వేళ్ళాడుతుంటాయి. నుదుటిపై చిన్నరూపాయి బిళ్లంత బొట్టు. మెడలో పసుపుతాడు. తాడులో నల్లపూసల్లో పుస్తెలు. సన్నమూ కాకుండా మరీ లావు కాకుండా మధ్యస్థంగా ఉంటుంది.

తను ఎక్కాల్సిన ఆటోకోసం ఎదురు చూస్తోంది. ఈరోజు ఆలస్యం అయిందనుకుంటోంది. ఓ నాలుగైదు ఈగలు తన చుట్టూరా తిరుగుతున్నాయి. సుమ్మగుడ్డతో వాటిని చికాగ్గా తరుముతోంది.  ముసురుతున్న ఈగల్ని.. నీల దగ్గరున్న బుట్టని చూసి అటువైపుగా మనుషులు వెళ్లడం లేదు. నీలకి అది అలవాటే. 

‘నీలక్కా ఆటో రాలేదా?’ నవ్వుతూ వచ్చి నీల పక్కగా నిలబడ్డాడు  రామ్మూర్తి.
నీల కూడా రామ్మూర్తిని నవ్వుతూ పలకరించింది ‘రాలేదు బాబూ’ అని.. సుమ్మ గుడ్డతో ఈగలు రొప్పుతూ బుట్ట సర్దుకుంటూ. అక్కడున్న అందరూ ఆ బుట్టవైపే చూస్తున్నారు. కొంతమంది ముక్కుపై రుమాలు పెట్టుకుంటున్నారు. ఆడవాళ్లు పైటలు అడ్డు పెట్టుకుంటున్నారు ముక్కుకి. కొంతమంది సహజంగానే నిలబడి ఉన్నారు.

ఇంతలో ఓ పిల్లి ‘మ్యావ్‌.. మ్యావ్‌’ అంటూ బుట్టవైపు.. నీలవైపు మార్చి మార్చి చూడసాగింది. ఆ పిల్లికి అలవాటే నీల బుట్ట వాసన ఎంత దూరం నుండైనా కనిపెడుతుంది. ఓ హక్కులా వచ్చి నీల చుట్టూ తిరుగుతుంది. అప్పుడప్పుడూ హూంకరించినట్టు చూస్తుంది. ఆ పిల్లి సైకాలజీ నీలకూ తెలుసు.
‘యెల్లెళ్లు.. తిరిగొచ్చినాక నీ గొడవ సూత్తాను’ అని తన చేతిలోని గుడ్డతో విదిలించింది. దూరంగా ఉన్న ఓ కాకి ధైర్యంగా వచ్చి బుట్టపై నుండి ఎగిరింది.

‘అవి నీకొదలవు నీలక్కా’ అన్నాడు రామ్మూర్తి బుట్టలు చూస్తూ.
‘అవును బాబూ! పాపం.. వాటికి మిగిలిపోయిన బుర్రలు, తోకలు పడేస్తుంటాను’ అంది బుట్టలపై ఓ గుడ్డ కప్పుతూ. 
నీల బుట్టలు అంచెలంచెలుగా సర్దుంటాయి. కిందన సిల్వర్‌ డేక్సీ, దానిపైన పళ్లెం లాంటి సిల్వర్‌ ప్లేట్‌ మూతలా ఉంటుంది. దానిపైన ఓ వెదురు బద్దల దాగర, దానిపైన సన్‌ మైకా అంటించిన పల్చటి ప్లాంకులాంటి బల్ల చెక్క.

దానిపైన మరో వెదురు బుట్ట.. దాంట్లో ఓ ప్లాస్టిక్‌ పీట, ఒక కత్తిపీట, మంచినీళ్ల  సీసా! ఆ బుట్టలో నాలుగు క్యారీ బ్యాగుల్లో నాలుగు రకాల ఎండు చేపలను పెట్టుకుంటుంది. కింద సిల్వర్‌ డేక్సీలో తాజా పచ్చి చేపలు. నెత్తళ్లు, గులిబిందలు, వరిసరిపిలు, చందువాలు అయిసు ముక్కల్లో ఉంచుతుంది.

రామ్మూర్తి, నీల ఒకే ఆటోకోసం ఎదురు చూస్తున్నారు. రోజూ వాళ్లిద్దరూ ఒకే ఆటోలో ఎంవీపీ కాలనీ నుండి కొత్తరోడ్డు వరకూ వెళ్తారు. 
ఆ ఇద్దరూ సహచర ప్రయాణికులు కావటంతో నీలక్కా అంటాడు రామ్మూర్తి. తను కూడా తమ్ముడులానే బాబూ అని పిలుస్తుంది. కష్టసుఖాలు కలపోసుకుంటుంటారు ఖాళీ టైమ్‌లో.  

నీల .. వీధుల్లో చేపలు అమ్ముతుంది. ఆమె బతుకుతెరువు అదే. హార్బర్‌లో చేపలు కొని వీధుల్లో తిరిగి అమ్ముతుంది. రోజుకు మూడు వేలు పెట్టుబడి పెడితే ఐదారు వందలు సంపాదిస్తుంది. కాళ్లలోనూ, గొంతులోనూ ఎక్కువ బిగువుండాలి. తల బలంగా నిలబడాలి. నెత్తిన పది పదిహేను కేజీల బరువుతో  ‘చేపలమ్మా.. చేపలు.. నెత్తళ్లు.. రెయ్యిలు.. చేపలమ్మా చేపలు..’ అని వీధి చివరకంటూ వినిపించేలా అరవాలి. మేడల్లో తలుపులేసుకున్న ఇల్లు తలుపులు తట్టే  కేకలు పెట్టాలి. బలమూ బిగీ ఉండాలంటుంది నీల. అంత కష్టపడితే ఐదారొందలు మిగలడం కష్టమంటుంది.

‘అరేయ్‌ బాబూ.. ఆటోరాజుకి ఫోన్‌  చెయ్యి. వాడు రాకపోతే వేరే ఆటోలో యెలిపోదుమ. లేటైతే ఖాతాలు పోతాయి బాబూ..’ అంది రామ్మూర్తి వైపు చూస్తూ.
‘అలాగే నీలక్కా’ అంటూ ఫోను ప్రయత్నించసాగాడు అతను.

రామ్మూర్తి ఓ దేవాలయంలో పనిచేస్తాడు. లెక్కలు రాయటం, టికెట్లు అమ్మటం, పురోహితులకు సహకరించటం వంటివన్నీ చూసుకుంటాడు. నెలకు మూడు వేల రూపాయల జీతమిస్తుంది ట్రస్ట్‌. ఆపైన పూజార్లు కాయాకసురు పండూఫలము ఇస్తుంటారు. డిగ్రీ చదువుకున్నాడు.

పోటీపరీక్షలు రాస్తున్నానని చెపుతుంటాడు కానీ ఒక్కటీ తగల్లేదు. చిన్నప్పుడు వేదం నేర్చుకున్నాడట. కానీ మధ్యలో కాలేజీ ప్రభావంతో అన్నీ పక్కన్నెట్టేశాడట. ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాడట. ఉద్యోగం దొరికేవరకూ ఏదో ఒక ఉపాధి. దేవాలయానికి  వెళ్లగానే ప్యాంటూ, షర్టు తీసేసి కండువా పంచెకట్టులోకి మారిపోతాడు.

మెడలో రుద్రాక్షమాల వేస్తాడు. నుదుటిపై మూడు అడ్డునామాలు పెట్టేసి రామ్మూర్తి పంతులైపోతాడు. వాళ్ల నాన్న గుడిలో పూజారేనట. చనిపోయాడు.
 ‘వస్తున్నాడట నీలక్కా.. ట్రాఫిక్‌ జామైయిందట. ఆ రోడ్డులో మంత్రి గారి కాన్వాయి వెళ్లిందట. ఇప్పుడే క్లియర్‌ చేశారట’ అని రామ్మూర్తి చెప్తూండగానే వాళ్లు ఎక్కాల్సిన ఆటో రానే వచ్చింది. 

అప్పటికే అందులో ఓ ఇద్దరు ఆడవాళ్లు కూర్చోనున్నారు. ముందు సిల్క్‌ చీరలో నడివయస్సాడావిడ ఒకరు. నేత చీరలో కొంచెం పెద్దావిడ మరొకరు. ఆటో ఆగగానే వాళ్లిద్దరూ ముక్కులు మూసుకున్నారు.

గాబరా గాబరాగా తన బుట్టలు ఆటో వెనుక పెట్టడానికి ఉపక్రమించింది నీల. 
‘రండి.. రండి.. మీకు బాగా లేటైపోయింది’ అని ఆటో రాజు తన సీటులోంచి తలబైటకు పెట్టి కేక వేశాడు.

రామ్మూర్తి వైపు సాయంకోసం చూసింది నీల. బరువుగా ఉన్న బుట్టను ఎత్తి ఆటోలో పెట్టాలంటే రోజూ రామ్మూర్తే సాయం పడుతుంటాడు. ఆటో వెనుక బుట్టలు పెట్టారు.
‘ ఏంటండీ ఇదీ! ఈ కంపు మేం భరించలేం’ అంది సీటులో కూర్చున్న నడివయస్సావిడ. ‘మాకూ పడదండీ’ మరో ఆవిడ కూడా.

‘అమ్మా.. ఇది నా బేరం. వాళ్లు రోజూ ఎక్కుతారు. వాళ్లతోపాటు మీకులాగే చాలామంది ఎక్కి దిగుతుంటారు. మీరు భరించలేకపోతే దిగిపోండి లేకుంటే ఓ పావుగంట ఓపిక పట్టండి మీ స్టాప్‌ వచ్చేస్తుంది’ అన్నాడు రాజు.
‘దిగిపోవాలంటే ఎంతసేపూ పట్టదండీ! కాకపోతే నేను అర్జెంటుగా అక్కయ్యపాలెం రిజిస్ట్రేషన్‌  ఆఫీసుకు వెళ్లాలి. నాకు తప్పదులెండి. ఈ దరిద్రం అనుభవించాల్సిందే’ ఛీత్కారంగా మాట్లాడిందావిడ.

రామ్మూర్తి.. వాళ్ళ చిరాకు పరాకులు వింటున్నాడు. ఈలోగా నీల లోపలకెక్కి కూర్చొంది. వెనుక సీటులో ముగ్గురూ సరిపోయారు. ఆ నడివయస్సావిడ పక్కన నీల కూర్చోటంతో ఆవిడకు ముళ్లపైన కూర్చున్నట్లుగా ఉంది. తన దగ్గరున్న ఓ సంచినీ మధ్యలో అడ్డుగా పెట్టుకుంది. ఈలోగా ఇంకోతను  వచ్చి వాళ్ల ఎదురు చిన్న బల్ల సీటుపైన కూర్చొన్నాడు.

ఆయన కాళ్లు వాళ్ల కాళ్ళకు తగులుతున్నాయి. నడివయస్సావిడ తన కాళ్లను కాస్త పక్కకు జరిపింది. దాంతో ఇటు అతణ్ణి.. బ్యాగ్‌ అడ్డుతో అటు నీలనూ తగలకుండా జాగ్రత్తపడుతూ పైటతో ముక్కు కప్పుకుని ‘తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టకూడదనే ఇంగితం ఉండాలి. వీధుల్లో తిరిగేవాళ్లు, చేపలు అమ్మకునేవాళ్లు వేరే ఆటో కట్టించుకోవాలి’ అంటూ మూతి, కంటినొసలు ముడుచుకొని ఊపిరి బిగపట్టేసి అత్తిపత్తిలా కూర్చొంది.

ఆవిడ మాటలకి రామ్మూర్తికి చుర్రుమంది. కుర్రోడు కదా వెంటనే కౌంటరు వేసుకున్నాడు.. ‘ఏంటమ్మా పెద్ద పెద్ద మాటలు? కంపుల్లేకుండా ఇంపుగా కార్లో వెళ్లండి’ అంటూ గదమాయించిన స్వరంతో. 

‘ఏం లేదు బాబూ.. ఈరోజు తెల్లారి లేవగానే ఎవరి ముఖం చూశానో ఏమో! అడ్డమైన వాళ్లతో కలసి వెళ్లాల్సి వస్తోంది’ బైటకు వినీవినిపించనట్టు అంది.
‘మాటలు జాగ్రత్తగా ఆడండి. ఇక్కడ అడ్డమైన వాళ్లు ఎవరూలేరు. మేమెప్పుడూ ఈ ఆటోలోనే వెళ్తాం, వస్తాం. నోరు పారేసుకోకండి’ గట్టిగానే బదులిచ్చాడు రామ్మూర్తి. 

‘ఎందుకులే బాబూ.. తగువు?’ అంది నీల.
‘తగువు కాదక్కా.. తక్కువ చేసి మాట్లాడుతున్నారు చూడు! కష్టపడ్డమంటే ఏం తెలుసు వీళ్లకు? ఈ దేశంలో సగానికిపైగా కంపుల్లోనే  పని చేస్తూ బతుకుతున్నారు. ఒకరి బతుకుని కించపర్చడం మంచిది కాదు.. ఎవరి బతుకులు వాళ్లవి’ ఆవేశంతో రామ్మూర్తి.  

వెనుదిరిగి మాట్లాడుతున్న రామ్మూర్తి.. గతుకులో ఆటో పడ్డంతో ముందుకు తూలి డ్రైవర్‌ మీద పడ్డాడు. వెనుకవాళ్లూ  పట్టు తప్పారు. బిగదీసుకొని కూర్చున్నావిడ నీల మీద పడింది. ఎదురుగా కూర్చున్నాయన కూడా నడివయస్సావిడ మీద పడబోయి బ్యాలెన్స్‌ చేసుకున్నాడు. మధ్యలో పెట్టిన సంచి కాళ్ల కింద పడింది.  ‘అబ్బా.. రాజూ నడుములు విరిసేసినావు’  రామ్మూర్తి.

‘నేనేటి చేస్తానయ్యా..’
‘బాబ్బాబూ.. నెమ్మదయ్యా.. నా గంపలు తుళ్లిపోతాయి’ అని వెనుకనున్న గంపలపై చెయ్యి వేసింది. ఆ చెయ్యి నడివయస్సావిడ  చెయ్యిపై పడింది. ఆవిడ కూడా వెనుక సీటుకు సపోర్టు చేస్తూ తన చెయ్యి వెనక్కు వేసింది, ఆ చేతిలో హ్యాండ్‌ బ్యాగ్‌ ఉంది. నీల చేయిపడ్డంతో ఠక్కున తీసేసింది.

‘అమ్మా.. అక్కయ్యపాలెం.. దిగండి.. దిగండి..’ కేక వేశాడు డ్రైవర్‌.. ఆటో ఆపుతూ. 
దిగేవాళ్లకి తోవ ఇవ్వటానికి నీల దిగింది. గబగబా నడివయస్సావిడ దిగింది. డ్రైవర్‌కి డబ్బులిస్తూ ‘అబ్బ.. గొప్ప నరకం చూపించావులే’ అంటూ అందరినీ చురచురా చూసి

చకచకా వెళ్లిపోయింది అక్కడి నుంచి. ఆటో ముందుకు కదిలింది. తరువాత స్టేజీలో ఇంకో ఆవిడ దిగింది. ఇంకో ఇద్దరు ఎక్కారు.  
తన స్టేజీ రావడంతో దిగిపోతూ  రామ్మూర్తి.. ‘నీలక్కా రేపు కలుద్దాం’ అంటూ ‘బాయ్‌’ చెప్పాడు.

నీల దిగే స్టేజీ వచ్చింది. ఆటో ఆగిన తరువాత డ్రైవర్‌ రాజు నీలకు సాయం చేశాడు బుట్టలు దింపడంలో. నీల ఓ గుడ్డను రింగులా సుమ్మ చుట్టి నెత్తిపైన పెట్టింది. పైట మాటిమాటికీ ఎగురకుండా గట్టిగా నడుంలోకి దూర్చింది. బుట్టలకు సాయం పట్టి నీల నెత్తిపైన పెట్టాడు రాజు.
‘సరిగ్గా, ఒంటి గంటకు వచ్చేస్తాను.. పావుగంట అటూ ఇటుగా’ అని చెప్పి ఆటో ఎక్కేశాడు రాజు.
∙∙ 
‘చేపలోయ్‌..’ అని అరుస్తూ తన రోజువారీ ఖాతాదారుల వీధుల్లోకి ప్రవేశించింది నీల. ఒక అపార్ట్‌మెంట్‌ ముందు ఆగింది. వాచ్‌మేన్‌ సాయంతో బుట్ట దింపింది. బుట్టలో సామాన్లు ఒక్కొక్కటి కింద పెడుతోంది. తను కూర్చునే ప్లాస్టిక్‌ సీటు పైకి తీసింది. ఆశ్చర్యం! ఆపై బుట్టలో ఎండు చేపల కవర్ల మధ్యలో కత్తిపీట పక్కన ఒక మనీపర్సు కనిపించింది నీలకు. ఆత్రుతతో జిప్‌ తెరచింది.

మరింత ఆశ్చర్యపోయింది.
‘అయ్య బాబోయ్‌.. డబ్బుల కట్టలు’ అనుకుంటూ కళ్లు పెద్దవి చేసింది. చేతులు చిన్నగా వణకసాగాయి. అలాంటి నోట్ల కట్టలను తనెప్పుడూ చూడ్లేదు. ఇదే ప్రథమం. రెండు వేల కట్టలు రెండు. ఐదొందల కట్ట ఒకటి. మూడు కట్టలూ కొత్తగా పిన్ను కొట్టి ఉన్నాయి. ఎవరో వచ్చిన సడి చూసి గబగబా జిప్‌ మూసేసి తెలివిగా పర్సును ఓ నల్ల క్యారీ బ్యాగ్‌ కవర్‌లో పెట్టింది. 

మూడు బేరాలు వచ్చాయి. వేగంగా చేపలు శుభ్రం చేసేసి కత్తిపీటతో తలలు, తోకలు, పొలుసు తీసేసింది. శుద్ధి చేసిన చేపలు కవర్లో పెట్టి వాళ్లని పంపించేసింది. రెండు మూడు వీధులు తిరిగింది. బుట్ట సగం కంటే ఎక్కువే ఖాళీ అయింది. బుట్ట ఖాళీ అవుతున్నా ఆలోచనలతో తల బరువెక్కుతోంది. రామ్మూర్తికి ఫో¯Œ చేసి చెప్పనా? ఆటో రాజుకు చెప్పనా? లేదంటే ఎవ్వరికీ చెప్పకుండా.. ఛ.. ఛ.. దరిద్రపు ఆలోచనలు అనుకొంది.

అయినా ఒకరి కష్టం నాకెందుకు? నా రెక్కల కష్టం నాది. కష్టం విలువే కదా డబ్బు. నేను ఐదు గంటలు కష్టపడితే ఐదొందలొస్తాయి. ఈ లెక్కన ఆ నోట్లు.. ఎన్ని రోజుల కష్టానివో! 

మధ్యాహ్నం పన్నెండు దాటుతోంది.. బుట్ట దించేటప్పుడు, ఎత్తుకునేటవ్వుడు జాగ్రత్తగా నల్ల క్యారీ బ్యాగ్‌ని చూనుకుంటోంది..‘డబ్బులేం చెయ్యాలీ’ అనే ఆలోచనలే ముసురుకుంటున్నాయి. తన చుట్టూ రోజూ చేరే ఈగల్లా!

పర్సు పోయిన వాళ్లు పోలీసులకు చెబితే.. పోలీసులు ఆటోరాజును పిలిపిస్తే.. ఆటోరాజు నా గూర్చి, రామ్మూర్తి గూర్చి చెపితే, వాళ్లు మమ్మల్ని స్టేషన్‌లో కూర్చోబెడితే.. పరిపరి విధాల పోతోంది నీల మనసు. 

అసలకి అదేం డబ్బో? దొంగ డబ్బో? కష్టం డబ్బో? నేనే నేరుగా పోలీసులకు అప్పగించేస్తే?! మంచి పోలీసైతే ఆరా తీస్తారు. కాకపోతే కాజేస్తారు. వాళ్లతో ముందుకెళ్తే గొయ్యి.. వెనక్కెళ్తే నుయ్యి! ఆ ఆలోచనలతో నడుస్తూ ‘ చేపలూ..’ అంటూ అరవడం మానేసింది నీల. 

వీధి మలుపు దగ్గర ఒకతను ఆపాడు. తన దగ్గర ఉన్న చేపలన్నీ తీసుకుంటానన్నాడు. బేరసారాలకు చూడకుండా, నష్టం రాకుండా ఇచ్చేసింది. తనకారోజు వచ్చిన డబ్బులు లెక్క చూసుకుంది. తన వస్తువులన్నిటినీ శుభ్రం చేసుకుని.. బుట్టలన్నీ వరుస క్రమంలో పెట్టుకుంది. పర్సున్న నల్ల కవరు మళ్లీ మళ్లీ చూసుకుంది. రోడ్డు పక్కన చెట్టు నీడకు చేరింది.

పర్సు సరిగా చూడలేదు. దానిలో ఇంకేమైనా ఉన్నాయా? ఆ పర్సు ఎవరిదని ఎలా గుర్తించటం.. ఆలోచనలతో పర్సు మళ్లీ చూసింది నీల. నోట్లకట్టలతోపాటు ఆధార్‌ కార్డు, ఒక విజిటింగ్‌ కార్డు కనిపించాయి. నీల పెద్దగా చదువుకోలేదు కానీ అక్షరజ్ఞానం ఉంది.

ఆధార్‌కార్డలో అడ్రస్‌ చూసింది. ఇంటి నెంబరు చూసింది. విశాలాక్షినగర్, విశాఖపట్నం అని ఉంది. మరైతే మాకు దగ్గరే అనుకుంది. విజిటింగ్‌ కార్డు తకేమీ అర్థం కాలేదు  కానీ అందులోని ఫోన్‌  నెంబరును మాత్రం గ్రహించింది. ఈ నెంబర్‌కు ఫోన్‌  చేస్తే ఆ డబ్బులు ఎవరివనేవి తెలిసిపోతుందనుకుంది.

అయినా ఇంత డబ్బు వాళ్ళకు ఇవ్వాలంటే  ఎవరినైనా తోడు పెట్టుకోవాలనుకుంది. రామ్మూర్తే మెదిలాడు మనసులో. అవును అతనే కచ్చితమైన మనిషి. ఆ అబ్బాయినే పిలుస్తాను. ఎక్కువ మందికి తెలిసినా ప్రమాదమే! రామ్మూర్తికి ముందే చెప్పాలి ఎవరికీ తెలీకూడదని అనుకుంటూనే రామ్మూర్తికి ఫోన్‌  చేసింది. తనుండే బస్టాపు దగ్గరలోని మర్రిచెట్టు దగ్గరకు రమ్మనిచెప్పి అతని కోసం ఎదురుచూడసాగింది. ఎప్పుడో తనోసారి తన సిక్కం పారేసుకుంది. ఆరోజున ఎంత బాధపడిందో జ్ఞాపకం తెచ్చుకుంది. తనవి పోయినవి రెండొందలే! కానీ ఇవో.. ‘అయ్య బాబోయ్‌’ అని గుండె బాదుకుంది.

ఎవరిదో సైకిల్‌ తీసుకొని గాబరా గాబరాగా వచ్చాడు రామ్మూర్తి. జరిగిందంతా చెప్పింది నీల. ఆమె మనసుని అర్థం చేసుకున్నాడు.
‘సరే అక్కా ఓ పని చేద్దాం. నేను ఇప్పుడు నీతో వచ్చినా మన డ్రైవర్‌కి అనుమానం రావచ్చును. మామూలుగా నీవెళ్లిపో.. నేను వేరే బస్సులో వచ్చేస్తా. అడ్రస్‌లోని ఇల్లు అక్కడకు దగ్గరే కాబట్టి. అక్కడకు నేను వచ్చిన తరువాత ఆ నెంబర్‌కు ఫోన్‌  చేద్దాం’ అన్నాడు.

‘సరే’ అంది నీల.
 రామ్మూర్తి వెళ్లిపోయిన ఐదు నిమిషాల్లో ఆటోరాజు వచ్చేశాడు. అప్పటికే బుట్టలు సర్దుకుని ఉన్న నీల.. గబగబా ఆటో వెనుక ఎక్కేందుకు ప్రయత్నించింది.
‘ఏటి నీలమ్మా... ముందుకొచ్చే. సీటు ఖాళీనే కదా’ అన్నాడు డైవర్‌.

‘యవురైనా ఎక్కుతారులే బాబూ’ అని వెనుకే కూర్చుంది. బుట్టలు కదలకుండా ఒక చేయి వాటిపై ఉంచి. ఆటో కదిలింది. మధ్యమధ్యలో ఒకరిద్దరు ఎక్కటం దిగటం జరుగుతావుంది. ఎండకి రోడ్డు వేడెక్కివుంది. వేడిగాలులు వీస్తున్నాయి. నీల దిగాల్సిన ఎంవీపీ కాలనీ వచ్చింది. నీల దిగి.. బుట్టల్నీ దించింది. ‘రేపు
కలుద్దాం నీలమ్మా’ అంటూ రాజు ముందుకు పోనిచ్చాడు ఆటోని.

మధ్యాహ్న సమయం కావడంతో బస్‌స్టాండ్‌లో ఎవ్వరూ లేరు. ఓ మూలన నీల అలా బుట్టలు పెట్టిందో లేదో ఇలా వచ్చేసింది పిల్లి ‘మ్యావ్‌’ అంటూ. అలవాటు ప్రకారం ‘వచ్చీసినావా తల్లీ!’ అంటూ తాను తెచ్చిన పచ్చి నెత్తళ్ల తలలు కవర్లోంచి తీసి కొంచెం దూరంలో ఓ క్రమంగా  పడేసింది. పిల్లి నెమ్మదిగా అటు పరుగుతీసింది. 

అంతలోకే రామ్మూర్తీ బస్సు దిగాడు. ‘అమ్మయ్య.. వచ్చీసినావా!’ అంది అతన్ని భారం దించుకున్నట్టుగా. చుట్టూ చూశాడు రామ్మూర్తి. పిల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. పిల్లి కూడా కళ్లు మూసుకుని దాని పని అది చేసుకుంటోంది. ‘నీలక్కా.. ముందుగా మనం ఈ ఫోన్‌  నెంబర్‌తో మాట్లాడి మీ ఆధార్‌ దొరికిందని చెపుదాం. అప్పుడు అది వాళ్లదో కాదో మనం తెలుసుకోవచ్చు. ఆధార్‌లోని పేరు వాళ్లు చెప్పిన పేరు ఒక్కటే అయితే ఈ పర్స్‌ వారిదే అని కన్ఫర్మ్‌ చేసుకుని  వాళ్లని రమ్మందాం’ అన్నాడు రామ్మూర్తి.

‘కచ్చితంగా వాళ్లే బాబూ.. ఆ వాసనకు మెలికలు తిరిగిపోయినావిడవే బాబూ..తరువాత ఎవ్వరూ అలాంటి బ్యాగులున్నోళ్లు ఎక్కనేదు’ అంది నీల. 
రామ్మూర్తి ఫోన్‌  చేశాడు. ఫోన్‌  కలిసింది. ‘హలో, హలో..’ అంటూ అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్లాడు. మాట్లాడుకుంటూ వచ్చాడు. నీలకు ఆందోళనగా ఉంది. రామ్మూర్తి చెప్పాడు..‘నీలక్కా ఆధార్‌ కన్ఫర్మ్‌ అయింది. వాళ్లు వస్తారు’ అని. 

‘ఆవిడేనా?’ ఆత్రంగా నీల. ‘వస్తే కదా తెలిసేది? ఆవిడ పేరు.. ఆధార్‌ పేరు ఒక్కటే.. చంద్రకళ’ చెప్పాడు రామ్మూర్తి. ‘పోన్లే బాబూ..  ఎవరి కష్టం వారికి చేర్చేస్తాం’ సంబర పడింది.
చంద్రకళ రాకకోసం ఎదురు చూడసాగారు ఇద్దరూ. పర్సు బుట్టలోనే ఉంది. ఇచ్చేవరకు నీలకు భయమే!
∙∙ 
దూరంగా ఓ కారాగింది. కారులోంచి ఒకావిడ దిగి నీల, రామ్మూర్తి ఉన్న వైపు రాసాగింది. ఆవిడ వెనుకనే ఒకతను కూడా ఉన్నాడు. వాళ్ళు తాలూకా కావాలి.
‘వాళ్లే నీలక్కా.. అటు చూడు అవిడే కదా ఉదయం ఆటో ఎక్కింది?’ రామ్మూర్తి.

‘అవును బాబూ.. వాళ్లే... వాళ్లే..’ నీల.. కన్ఫర్మ్‌ చేసుకుంటూ.  వాళ్లు దగ్గరకొస్తుండగానే ఓవైపు సంబరం.. బాధతో ఉక్కిరిబిక్కిరైపోయింది నీల. వెంటనే వాళ్ల పర్స్‌ వాళ్లకు ఇచ్చేయాలన్న తాపత్రయంలో వాళ్లేం మాట్లాడతారోనని కూడా చూడకుండా వాళ్లలా వచ్చీరావడంతోనే..  

‘అమ్మమ్మా.. ఎంత బాధ పడిపోనావో తల్లీ! డబ్బులు పోనాయి కదా నీకష్టం పోయిందని! ఇంద తల్లీ.. ఇంద.. ఇది నీ పరసే తల్లీ.. ఇదిగిదిగో నాకే దొరికింది’ అంటూ ఉద్వేగంతో బుట్టలో దాచిన పర్సును ఆవిడ చేతిలో పెట్టింది.

‘ఎంత గొప్ప మనసు! ఈరోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారా? ఇతరుల కష్టాన్ని తమ కష్టంగా భావించే వాళ్లు! నీలక్కా.. నీకు పాదాభివందనాలు’ అని మనసులో దండం పెట్టుకుంటూ ఆ పర్సు చంద్రకళకు అందించే దృశ్యాన్ని చూసి చలించిపోయాడు రామ్మూర్తి. 

పర్సు తీసి చూసుకుంది చంద్రకళ. అన్నీ ఉన్నాయి. తను పోగొట్టుకున్నవన్నీ దొరికాయి.  ఉదయం నీలను ఈసడించుకున్నందుకుగాను ఇప్పుడు చంద్రకళ కళ్లలో నీళ్లు తిరిగాయి. నీల కాళ్లపై పడబోయింది. వారించింది నీల. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంది చంద్రకళ. నీల చమట వాసన, నీల చేపల వాసన ఏమీ తెలియలేదు చంద్రకళకి. నీల మనసులోని పరిమళ సుగంధాలు అక్కడ చుట్టూ అలముకున్నాయి.
- బొడ్డ కుర్మారావు
చదవండి: కథ: చివరి ప్రయాణం.. నేను ఇంకెంతో కాలం బతకనని డాక్టర్లన్నారు! గొప్ప క్షణాలు
   

మరిన్ని వార్తలు