Hyper Realistic Pencil Drawing:‘కళ’యా నిజమా!

25 Jun, 2021 19:26 IST|Sakshi

‘పెన్సిల్‌ మరియు కల ఈ రెండు మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకువెళతాయి’ అన్నాడు పెన్సిల్‌ను అమితంగా అభిమానించే కళాకారుడు. ‘భవిష్యత్‌ను పెన్సిల్‌తో డిజైన్‌ చేసుకోవాలి. ఎందుకంటే మార్పుచేర్పులకు అవకాశం ఉంటుంది’ అన్నాడు తాత్వికుడు. ఎవరు ఏ కోణంలో తమ ‘ఫేవరెట్‌’ చేసుకున్నా, పెన్సిల్‌ ప్రేమికులకు కొదవ లేదు. ‘హైపర్‌ రియలిస్టిక్‌ పెన్సిల్‌ డ్రాయింగ్‌’పై ఇప్పుడు యూత్‌ మనసు పారేసుకుంటోంది...

జేడీ హిల్‌బెరీ సంగీతకారుడు కావాలనుకొని పెన్సిల్‌ చిత్రకారుడయ్యారు. అయితేనేం... ఈ ఆర్ట్‌లో జేడీకి వచ్చిన పేరు ఇంతా అంతా కాదు. ఆయన వెబ్‌సైట్‌లోకి వెళితే అద్భుతమైన ఎన్నో పెన్సిల్‌ చిత్రాలు పలకరిస్తాయి. ‘లెర్న్‌ మై టెక్నిక్‌’ అంటూ వీడియో ట్యుటోరియల్స్‌ విజయవంతంగా నడుపుతున్నారు జేడీ.

‘పెన్సిల్‌ అంటే స్కూల్‌ రోజులు గుర్తుకు వస్తాయి. కానీ ఇప్పుడు అద్భుతమైన కళారూపాలు మదిలో మెదులుతున్నాయి’ అంటున్నాడు 20 సంవత్సరాల స్పానిష్‌ స్టూడెంట్‌ నికోలస్‌. ‘లెర్న్‌ మై టెక్నిక్‌’ను ఫాలో అవుతూ తనదైన సొంతశైలిని సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నాడు నికోలస్‌.

హైపర్‌ రియలిస్టిక్‌ పెన్సిల్‌ డ్రాయింగ్‌ కళలో ఇండోనేషియన్‌ ఆర్టిస్ట్‌ వెరి ఆప్రియాంటో ఉద్దండ పిండం. మాట్లాడే భాష అర్థం కాకపోయినా ఆయన టాలెంట్‌ ఏమిటో నెట్‌డాట్‌ టాక్‌ షోలో చూడవచ్చు. మాట్లాడుతూనే కెమెరాతో ఫోటో తీసినట్టు పెన్సిల్‌తో ‘ఆహా ’అనిపించే బొమ్మ గీస్తాడు. కాలేజీ విద్యార్థులు ఎంత శ్రద్ధగా వింటున్నారో! (ఆయన మాటలు ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌గా వస్తే మనలాంటి వాళ్లకు ఎంత ప్రయోజనమో కదా!)

బ్రిటన్‌ పెన్సిల్‌ ఆర్టిస్ట్‌ కెల్విన్‌ వోకఫోర్‌కు ముఖాలు మాత్రమే గీయడం అంటే ఇష్టం. దీనికి ముఖ్య కారణం... ‘ప్రతి ముఖం తనదైన భావోద్వేగాలను, చరిత్రను చెప్పకనే చెబుతుంది’ అంటారు కెల్విన్‌. ఇక సెల్ఫ్‌–టాట్‌ సౌత్‌ ఆఫ్రికన్‌ ఆర్టిస్ట్‌ జోనో డ్రై ఫోటోరియలిజం, సర్రియలిజంలను మిక్స్‌ చేసి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

నైజీరియన్‌ ఆర్టిస్ట్‌ ఎ.స్టాన్లీ ఎగ్బెన్‌గ్యూ ఆరు సంవత్సరాల వయసు నుంచే పెన్సిల్‌ పట్టాడు. 28 సంవత్సరాల స్టాన్లీ ఇంజనీర్, యాక్టివిస్ట్, ఫోటోగ్రాఫర్, ఎంటర్‌ప్రెన్యూర్‌. అయితే ఆయనకు హైపర్‌ రియలిస్టిక్‌ పెన్సిల్‌ ఆర్టిస్ట్‌గానే ఎక్కువ గుర్తింపు ఉంది. ‘మనలోని సృజనను బొమ్మగా మార్చే శక్తి పెన్సిల్‌ కు ఉంది’ అంటాడు స్టాన్లీ. ఇక మన దేశంలో వైభవ్‌ తివారి... మొదలైన వాళ్లు ‘వాహ్వా! పెన్సిల్‌ డ్రాయింగ్‌’ అనిపిస్తున్నారు. యూత్‌ను తెగ ఆకట్టుకుంటున్నారు. మరి మీరెప్పుడు!

 
మీరు సైతం... స్కెచింగ్‌ డ్రాయింగ్‌ ఫోటో ఎడిటర్‌ ‘పెన్సిల్‌ ఫోటో స్కెచ్‌’ యాప్‌తో మీరు కూడా ముచ్చటగా ఆర్టిస్ట్‌గా మారవచ్చు. మీ ఫోటో లేదా మీ ఫ్రెండ్స్‌ ఫోటోలను ఆకట్టుకునే పెన్సిల్‌ స్కెచ్‌లుగా మార్చవచ్చు. పెన్సిల్‌ స్కెచ్‌తో పాటు లైట్‌ స్కెచ్, కార్టూన్‌ ఆర్ట్, కలర్‌ డ్రాయింగ్‌...మొదలైన ఎఫెక్ట్‌లు ఇందులో ఉన్నాయి. ఇలా ఎందుకు? రియల్‌గానే నేర్చుకుందాం... అని డిసైడైతే డ్రాయింగ్‌ రియలిస్టిక్‌ పెన్సిల్‌ పోట్రాయిట్స్‌ స్టెప్‌ బై స్టెప్‌(జస్టిన్‌ మాస్‌)... మొదలైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక మీ ఇష్టం! 

చదవండి: పద్మశ్రీ పంకజాక్షి మనుమరాలు

ఏదో చేయాలి​.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’

మరిన్ని వార్తలు