సోలంగ్‌ వ్యాలీ పర్యాటన ఓ అందమైన అనుభూతి..!

23 Oct, 2021 12:20 IST|Sakshi

సోలంగ్‌ టూర్‌లో అడ్వెంచరస్‌ స్పోర్ట్స్‌ హబ్‌ సోలంగ్‌ వ్యాలీనే. సోలాంగ్‌ నది పరివాహక ప్రదేశం ఇది. మనాలికి 13 కిమీల దూరాన ఉంది. కులు–మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువైన తర్వాత సినిమా షూటింగ్‌లు సోలంగ్‌ వ్యాలీలో జరుగుతున్నాయి. ఇప్పుడా సోలంగ్‌ వ్యాలీ పర్యాటకుల సాహస క్రీడావిహారానికి కేంద్రమైంది. ట్రెకింగ్, పారాగ్లైడింగ్, క్యాంపింగ్, రివర్‌ రాఫ్టింగ్, స్నో స్కీయింగ్, గ్రాస్‌ స్కీయింగ్, హార్స్‌ రైడింగ్, స్నో స్కూటర్‌ రేస్, రివర్‌ క్రాసింగ్, వాల్‌ క్లైంబింగ్‌ వంటి ఆటలన్నీ ఆడుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక్కడ పారా గ్లైడింగ్‌ చేశారు. అయితే సమీప గతంలో కాదు, అది గుజరాత్‌కి ముఖ్యమంత్రి కాక ముందు మాట.

రొటీన్‌కి భిన్నంగా
మనాలి పర్యటనలో రొటీన్‌గా చూసే మంచు కొండల్లో విహారానికి పరిమితం కాకుండా మరికొంచెం ఆసక్తిగా ప్లాన్‌ చేసుకోవాలి. అప్పుడే నగ్గర్‌ కోటలో బస, సాహసక్రీడలు, ప్రాచీన వారసత్వ నిర్మాణాలు, ఆ ప్రదేశానికి పరిమితమైన వైవిధ్యమైన వాస్తుశైలి, జలపాతాల స్వచ్ఛత, నదిలో విహరింతలను ఆస్వాదించడం సాధ్యమవుతుంది. మాల్‌ రోడ్డులో ఏమీ కొనకపోయినా సరే... హనీమూన్‌ కపుల్‌ చెట్టాపట్టగ చేతులు పట్టుకుని నడవడమే జీవితమంతా గుర్తుండిపోయే మధురానుభూతి. అలాగే కేబుల్‌ కార్‌ విహారం కూడా. 

చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !!

ఇవన్నీ చూడాలి!
హిడింబాలయం
పాండవులలో రెండవ వాడు భీముని భార్య హిడింబి. ఆమె ఆలయమే ఇది. మనాలి సమీపంలోని దుంగ్రీ అటవీ ప్రాంతంలో ఉంది. మనాలి టూర్‌ ప్యాకేజ్‌లలో హిడింబ ఆలయం తప్పక ఉంటుంది.

హిమాచల్‌ కల్చర్‌ అండ్‌ ఫోక్‌ ఆర్ట్స్‌ మ్యూజియం 
ఇది హిడింబ ఆలయానికి దగ్గరలోనే ఉంది. ఈ ప్రదేశంలో విలసిల్లిన నాగరకతను పురాతన వస్తువులు, ఆయుధాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. 

టిబెట్‌ మఠాలు
మనాలిలో స్థిరపడిన టిబెట్‌ వాళ్ల నివాస ప్రదేశాలివి. నిర్మాణశైలి పరంగా ప్రత్యేకంగా ఉంటాయి. రంగులు కూడా ఆసక్తిగొలుపుతుంటాయి. 

వశిష్ఠ ఆలయం
ఇది ఏకశిలలో తొలిచిన ఆలయం. ఈ ఆలయంతోపాటు ఇక్కడి వేడినీటి గుండాలు ప్రధాన ఆకర్షణ.

జోగ్ని జలపాతం
మంచుకొండలు, వేగంగా ప్రవహించే నదుల మధ్య ఉధృతంగా నేలకురికే జలపాతం సౌందర్యాన్ని మాటల్లో వర్ణించలేం. స్వయంగా వీక్షించి ఎవరికి వాళ్లు అనుభూతి చెందాల్సిందే.

నయింగ్మ టెంపుల్‌
ఇది మనాలి, మాల్‌రోడ్‌లో ఉన్న బుద్ధుని ఆలయం. నిర్మాణశైలిపరంగా చూసి తీరాల్సిన ఆలయం. శాక్యముని విగ్రహం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. మాల్‌రోడ్‌లో దుకాణాల్లో ఉలెన్‌ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్‌ వీల్స్‌ వంటి సావనీర్‌లు, టిబెట్‌ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్‌ ప్రదేశ్‌ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్‌ ఆభరణాలు, టిబెట్‌ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.

ఇలా తినవచ్చు!
ఈ పర్యటనలో రకరకాల రుచులను మిస్‌ కాకూడదు. మౌంట్‌ వ్యూ రెస్టారెంట్‌లో టిబెట్, జపాన్, చైనా, ఇటాలియన్, కాంటినెంటల్‌ ఫుడ్‌ రుచి చూడవచ్చు. చలిమంట వెచ్చదనంతోపాటు బార్బిక్యూ వంటలను ఆస్వాదించాలంటే బాసిల్‌ లీఫ్‌ రెస్టారెంట్‌కెళ్లాలి. మనాలి హిమాలయాల నేపథ్యంలో ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలంటే రూఫ్‌టాప్‌ రెస్టారెంట్‌లో భోజనం చేయడం మంచి ఆలోచన. ఇది నగ్గర్‌ రోడ్‌లో ఉంది. 

చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్‌ నిజాలు!

ఎప్పుడు! ఎలా!
హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని సోలంగ్‌– మనాలి టూర్‌కి అక్టోబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది. ఏడాది సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మాత్రమే. సమీప విమానాశ్రయం భుంటార్‌ ఎయిర్‌పోర్టు. ఇది మనాలి సిటీసెంటర్‌కు యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇవన్నీ కొనుక్కోవచ్చు
►మాల్‌రోడ్‌లో దుకాణాల్లో ఉలెన్‌ క్లోత్స్, దోర్జీబెల్స్, ప్రేయర్‌ వీల్స్‌ వంటి సావనీర్‌లు, టిబెట్‌ అగరబత్తులు, తరుణిబట్టిన దారుకళాకృతులు, హిమాచల్‌ ప్రదేశ్‌ సంప్రదాయ టర్కోయిస్, సిల్వర్‌ ఆభరణాలు, టిబెట్‌ వాళ్లు ధరించే ఆభరణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
సింగింగ్‌ బౌల్‌: ఇది బౌద్ధానికి ప్రతీక. హిమాచల్‌ ప్రదేశ్, టిబెట్‌ రోజువారీ జీవితంలో భాగం. దీని నుంచి వచ్చే శబ్దం, ఆ ప్రకంపనలు వాతావరణాన్ని ఆహ్లాదపరచడంతోపాటు ధ్యానం చేసేటప్పుడు ఏకాగ్రతను కలిగిస్తాయని చెబుతారు. స్నేహితులకు బహుమతిగా ఇవ్వడానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ సింగింగ్‌ బౌల్స్‌ను కొంటారు.
కులు షాల్‌: ఉలెన్‌ దుస్తుల విభాగంలో అడుగుపెడితే దేనిని సెలెక్ట్‌ చేసుకోవాలో అర్థం కాదు. స్వెటర్‌లు, మఫ్లర్‌లు, క్యాప్‌లు వందల రకాలుంటాయి. ప్రతిదీ అందంగానే ఉంటుంది. ఈ ట్రిప్‌కు గుర్తుగా కులు, కిన్నౌరి షాల్‌ తెచ్చుకోవడం మర్చిపోకూడదు. రకరకాల షేడ్‌లలో ఏ రంగు దుస్తులకైనా మ్యాచ్‌ అయ్యేటన్ని మోడల్స్‌ ఉంటాయి. 
ప్రేయర్‌ వీల్‌: ఇది టిబెట్‌ సంప్రదాయంలో ప్రధానమైనది. లోహం, చెక్క, తోలుతోపాటు రాతి చక్రాలు కూడా ఉంటాయి. ఈ వీల్స్‌ మీద టిబెట్‌ భాషలో ‘ఓంమణి పద్మే’ అనే మంత్రం ఉంటుంది. ఈ టూర్‌ గుర్తుగా డ్రాయింగ్‌ రూమ్‌లో పెట్టుకోవచ్చు.
దోర్జీ బెల్‌: ఇది కూడా టిబెట్‌ సంప్రదాయ వస్తు విశేషమే. గంట ఆకారంలో ఉంటుంది. 

మనాలిలో ఏ వస్తువైనా సరే ప్రభుత్వం అనుమతి పొందిన స్టోర్‌లలో మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. మామూలు దుకాణాల్లో ధరలు ఆకాశాన ఉంటాయి. బేరం చేయగలిగిన సామర్థ్యానికి పరీక్ష. గట్టిగా బేరం చేయగలిగితే ధరలను నేల మీదకు దించవచ్చు. కానీ టూర్‌లో సమయం చాలా విలువైనది. బేరం చేయడం కోసం అంత సమయం వృథా చేయడం అర్థరహితం. మాల్‌ రోడ్‌ తర్వాత మనాలిలో హాంగ్‌కాంగ్‌ మార్కెట్‌ మీద ఓ కన్నేయవచ్చు.  

ట్రావెల్‌ టిప్స్‌
►మాల్‌ రోడ్‌లో పగలు జరిగినంత షాపింగ్‌ రాత్రి కూడా జరుగుతుంది. హస్తకళాకృతులు లెక్కలేనన్ని రకాలుంటాయి. ఈ దుకాణాలను చూస్తే పురాతనంగా కనిపిస్తాయి. కానీ అన్నింటిలోనూ యూపీఐ, క్రెడిట్, డెబిట్‌ కార్డు పేమెంట్‌ చేయవచ్చు. 
►మాల్‌ రోడ్‌లో దొంగతనాలు ఎక్కువ. ఇక్కడ పర్యటించేటప్పుడు విలువైన వస్తువులను దగ్గర ఉంచుకోకపోవడమే మంచిది. షాపింగ్‌ సమయంలో చేతిలో ఉన్న బ్యాగ్‌ను పక్కన పెట్టి మరీ వస్తువుల నాణ్యతను పరిశీలిస్తాం. అలాంటి సమయంలో మళ్లీ చూసుకునేటప్పటికి బ్యాగ్‌ ఉండకపోవచ్చు. ఒక్కోసారి కింద పెట్టిన బ్యాగ్‌ గురించి మనమే మర్చిపోవచ్చు కూడా. కొంత దూరం వెళ్లిన తరవాత గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చినా ప్రయోజనం ఉండదు. 

చదవండి: Real Life Horror Story: 8 వారాలుగా శవంతోనే.. అసలు విషయమే తెలియదట!

మరిన్ని వార్తలు