Khalistan Zindabad Slogans Controversy: వరల్డ్ కప్ ముందు ఖలిస్థాన్ నినాదాలు.. పోలీసులు అలర్ట్‌

4 Oct, 2023 15:58 IST|Sakshi

ధర్మశాల: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో జల్ శక్తి డిపార్ట్‌మెంట్ గోడలపై దుండగులు ఖలిస్థాన్ నినాదాలు రాశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వచ్చే నెలలో క్రికెట్ వన్డే వరల్డ్ కప్‌ ఐదు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్న నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

వన్డే క్రికెట్ వరల్డ్ కప్‌ 2023కి భారత్ ఈసారి ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే నెలలో ధర్మశాలలో ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. క్రికెట్ టీమ్‌లు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి.  ఈ క్రమంలో జల్‌ శక్తి డిపార్ట్‌మెంట్ గోడలపై 'ఖలిస్థాన్ జిందాబాద్' అంటూ అల్లరిమూకలు నినాదాలు రాశారు. ఈ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

జల్ శక్తి డిపార్ట్‌మెంట్ గోడలపై స్పే పేయింటింగ్ ద్వారా దుండగులు నినాదాలు రాశారని కాంగ్రా ఎస్పీ షాలినీ అగ్నిహోత్రి తెలిపారు. పోలీసు బృందాలు అక్కడి వెళ్లి గోడలకు మళ్లీ పేయింటింగ్ వేసినట్లు కూడా వెల్లడించారు. సీసీటీవీ ఆధారాలతో దుండగుల కోసం గాలింపు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కెనడా-భారత్ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో ఖలిస్థాన్ నినాదాలు కెనడాలో పెరిగిపోతున్నాయి. ఇటు ఇండియాలోనూ అల్లరిమూకలు ఖలిస్థాన్ జిందాబాద్‌ అంటూ ఎక్కడపడితే అక్కడ గోడలపై నినాదాలు రాస్తున్నారు. అదీగాక వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ ‍కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో  తాజా అంశం ఆందోళన కలిగిస్తోంది. 

ఇదీ చదవండి: భారీగా పెరిగిన పన్ను వసూళ్లు.. అందుకు తగ్గట్టుగానే అప్పు కూడా..

మరిన్ని వార్తలు