కొండల రాణి.. మేఘాల్లో తేలినట్లుగా ఉంటుంది!

1 May, 2021 13:25 IST|Sakshi

ముస్సోరీ

మనకు పర్వత రాజు తెలుసు... ఈ కొండల రాణి ఎవరు? మన రాజరికం రాజు ప్రధానం... బ్రిటిష్‌ రాజరికం రాణి ప్రధానం. అందుకే... బ్రిటిషర్‌లు గుర్తించిన ఈ హిల్‌స్టేషన్‌ ‘క్వీన్‌ ఆఫ్‌ ద హిల్స్‌’ అని... సగౌరవంగా నామకరణం చేసుకుంది. ఆ మకుటానికి వన్నె తరగనివ్వని పర్యాటక ప్రదేశం ముస్సోరీ. ఈ ప్రదేశంలో మన్సూర్‌ అనే చెట్ల గుబుర్లు ఎక్కువ. దాంతో మన్సూర్‌ అనే పేరే వాడుకలో ఉండేది. బ్రిటిష్‌ అధికారుల ఉచ్చారణలో ముసూరీ అయింది. వాళ్లు నిర్దేశించిన ఇంగ్లిష్‌ స్పెల్లింగ్‌తో మన ఉచ్చారణలో ముస్సోరీగా స్థిరపడింది.

ముస్సోరీ పట్టణం ఉత్తరాఖండ్‌ రాష్ట్రం, డెహ్రాడూన్‌ జిల్లాలో ఉంది. ఢిల్లీ నుంచి ముస్సోరీకి రోడ్డు మార్గం మూడు వందల కిలోమీటర్ల లోపే, కానీ ప్రయాణం ఆరు గంటలు పడుతుంది. అయితే ఈ ప్రయాణంలో టైమ్‌ వృథా అయిందని ఏ మాత్రం అనిపించదు. ఢిల్లీ దాటిన తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ప్రయాణిస్తున్నంత సేపు రోడ్డు మీది దుమ్ముతో పోటీ పడి పరుగులు తీస్తున్నట్లు ఉంటుంది. ఉత్తరాఖండ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి సీన్‌ మారిపోతుంది. ప్రకృతి ప్రసాదించిన పచ్చదనం ఆహ్వానం పలుకుతుంది. పర్వతాల మీదకు సాగుతున్న ప్రయాణం నేల నుంచి నింగికి వేసిన నిచ్చెన మీద ఎక్కుతున్నట్లు ఉంటుంది. పైపైకి వెళ్లే కొద్దీ మేఘాలు మన దగ్గరగా వస్తున్నట్లు అనిపిస్తుంది. వాహనాన్ని సురక్షితమైన ఒక మలుపులో ఆపి రోడ్డు మీద నిలబడి ఎదురు చూస్తే మేఘాలు ఏ మాత్రం నిరుత్సాహ పరచకుండా మెల్లగా వచ్చి మెత్తగా చెంపలను తాకుతాయి.

ఆ చల్లదనాన్ని ఆస్వాదించేలోపే ముందుకు వెళ్లిపోతాయి. భవనాల దగ్గరకొచ్చే సరికి మేఘాలు చెదిరి పోయి దూదిపింజల్లా మారిపోతాయి. కొన్ని మబ్బు తునకలు భవనాలకు తగులుకున్న గాలిపటంలాగ కొద్దిసేపు అలాగే ఉండిపోతాయి. అంతలోనే మబ్బు కరిగి జల్లుగా మారుతుంది. పది నిమిషాల్లోనే ఆకాశం నిర్మలంగా మారిపోతుంది. లోయ నుంచి ఆకాశానికి నిచ్చెన వేస్తున్నట్లు పెరిగిన దేవదారు, పైన్, ఓక్‌ వృక్షాలు కూడా పర్యాటకుల చూపుని క్షణకాలం పాటు తమ మీద నిలుపుకుంటాయి. ముస్సోరీ పట్టణాన్ని చేరేలోపు పర్వతాల మధ్య విస్తరించిన ఒక పెద్ద సరస్సు ఉంది, దానికి విడిగా పేరేమీ లేదు, ముస్సోరీ లేక్‌ అంటారు.

ముస్సోరీలో సూర్యోదయం
ముస్సోరీ పట్టణం ఆరువేల ఐదు వందల అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ సూర్యుడు మరీ పొద్దున్నే ఉదయిస్తాడు. కాంతులు చిమ్ముతూ ఆకారంలో కూడా పెద్దగా, తెల్లగా కనిపిస్తాడు. కిరణాలు వేడి ఉండవు కానీ కొండల మీద తీక్షణంగా కాంతిపుంజంలాగ ప్రతిఫలిస్తూ ఉంటాయి. ముస్సోరీ పట్టణం కొండల మీద మైదాన ప్రదేశం కాదు. కొండల బారుల మీద, వాలులోనూ విస్తరించిన పట్టణం. పౌర్ణమి రోజుల్లో టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే సాయంత్రం పూట ఇక్కడ ప్రధాన రహదారిలో లైబ్రరీ పాయింట్, మాల్‌ రోడ్‌ వరకు నడిచి తీరాలి. మాల్‌ రోడ్‌ నుంచి గన్‌ హిల్‌ మీదకు రోప్‌ వే క్యాబిన్‌లో వెళ్లాలి. పగలయితే పచ్చదనం నిండిన పర్వత శ్రేణులు అలరిస్తాయి. రాత్రి లైట్లు మిణుకు మిణుకుమంటూ పట్టణం ఎంత మేర విస్తరించిందో తెలియచేస్తుంటాయి.

గన్‌ హిల్‌ మీద కొంత ప్రదేశం చదునుగా ఉంటుంది. ఈ హిల్‌ మీద నుంచి చూస్తే మంచు దుప్పటి కప్పుకున్న ప్రధాన హిమాలయాలు కనిపిస్తాయని చెబుతారు. కానీ చాలా అరుదుగా ఆకాశంలో మబ్బుల్లేనప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఈ గన్‌హిల్‌ మీద ఫొటోగ్రఫీ స్టూడియోలలో ఉత్తరాఖండ్, కశ్మీరీ సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు ఉంటాయి. మొత్తం ప్యాకేజ్‌ రెండు వందలు ఉంటుంది. ఈ దుస్తులను ఎంతమంది ధరించారో అని పర్యాటకులు డైలమాలో ఉండగానే స్టూడియో వాళ్లు ఆ దుస్తుల్ని తగిలించేసి ఫొటోకి పోజిమ్మని హడావుడి చేస్తారు. ఇక్కడ తీసుకున్న ఫొటో ముస్సోరీ టూర్‌ జ్ఞాపకానికి అందమైన భౌతిక రూపంగా ఆల్బమ్‌లో కలకాలం ఉండి తీరుతుంది.

-వాకా మంజులారెడ్డి

ట్రావెల్‌ టిప్స్‌.. జాగ్రత్తగా వెళ్లి వద్దాం!

  • ముస్సోరీలో పర్యటించడానికి మార్చి నుంచి జూన్‌ వరకు వాతావరణం అనుకూలిస్తుంది. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ మధ్యలో కూడా వెళ్ల వచ్చు. కానీ ట్రెకింగ్, రాక్‌ క్లైంబింగ్, క్యాంపింగ్‌ వంటి సరదాలకు వేసవి కాలమే సౌకర్యం.
  • సన్‌గ్లాసెస్, అత్యవసర మందులు, ఎగుడుదిగుడు ప్రదేశాల్లో నడవడానికి అనువైన స్పోర్ట్స్‌ షూస్‌ తీసుకెళ్లాలి. వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్టం 30 డిగ్రీలకు మించవు, కనిష్టం పది డిగ్రీలకు తగ్గిపోతాయి. కాబట్టి వేసవిలో కూడా ఊలు దుస్తులు తీసుకెళ్లాలి. ఇక్కడ రోజూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతుంది. కాబట్టి గొడుగు, రెయిన్‌ కోట్‌ కూడా ఉంటే మంచిది.
  • ఫొటోగ్రఫీని ఇష్టపడే వాళ్లు లెన్స్‌ కెమెరా తీసుకెళ్తే అందమైన టూర్‌ జ్ఞాపకాలతోపాటు మంచి ఫొటోలను కూడా వెంట తెచ్చుకోవచ్చు. 
  • భోజనానికి టిబెటన్, ఇండియన్, కాంటినెంటల్‌ క్విజిన్‌లు ఉంటాయి. హ్యాండ్‌ టోస్టెడ్‌ పిజ్జాతోపాటు చక్కటి పంజాబీ శాకాహార వంటకాలు ఉంటాయి. మాంసాహారం కూడా దొరుకుతుంది. కానీ కొత్త ప్రదేశాల్లో తీసుకునే ఆహారం తేలిగ్గా జీర్ణం అయ్యి త్వరగా శక్తినిచ్చేదిగా ఉంటే టూర్‌ హాయిగా సాగుతుంది. 


     

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు